రోజువారీ విద్యుదుత్పత్తిలో ‘సీలేరు’ ఆల్‌టైమ్ రికార్డు
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:36 PM
సీలేరు జలవిద్యుత్ కేంద్రం రోజువారీ (24 గంటల) విద్యుదుత్పత్తిలో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది.

జలవిద్యుత్ కేంద్రంలో 24 గంటల్లో
5.325 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి
58 సంవత్సరాల్లో ఇదే అత్యధికం
రికార్డులను బ్రేక్ చేస్తున్న సీలేరు జలవిద్యుత్ కేంద్రం
సీలేరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): సీలేరు జలవిద్యుత్ కేంద్రం రోజువారీ (24 గంటల) విద్యుదుత్పత్తిలో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. జలవిద్యుత్ కేంద్రంలో 24 గంటల్లో అత్యధికంగా 5.325 మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి చేసి తన రికార్డులను తానే బ్రేక్ చేసింది.
సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 26 తేదీన 4.949 మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి చేసి రికార్డు నమోదు చేసింది. జలవిద్యుత్ కేంద్రం చరిత్రలోనే ఒక్కరోజు అన్ని యూనిట్లు ఎప్పుడూ ఉత్పత్తి చేయలేదు. ఈనెల 26వ తేదీన 5.126 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి ఫిబ్రవరి నెలలో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసింది. తాజాగా గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు 24 గంటల్లో 5.325 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేసి అత్యధిక రికార్డును నెలకొల్పింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రం నెలకొల్పిన 58 సంవత్సరాల్లో ఇదే అత్యధికమని స్థానిక జలవిద్యుత్ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు. విద్యుదుత్పత్తిలో వరుస రికార్డులను నెలకొల్పుతున్న సీలేరు జలవిద్యుత్ కేంద్రం ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందిని జెన్‌కో ఎండీ కేవీఎన్ చక్రధరబాబు అభినందించారని సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ వాసుదేవరావు తెలిపారు.