రైల్వే జోన్ పనులను అడ్డుకున్న గిరిజనులు
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:55 AM
దక్షిణ కోస్తా రైల్వే జోన్ డివిజన్ కార్యాలయ నిర్మాణంలో భాగంగా చేపడుతున్న పనులను స్థానిక గిరిజనులు మంగళవారం అడ్డుకున్నారు.

ఆ భూములను గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిందంటూ వాదన
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకోవాలన్న కాంట్రాక్టు కంపెనీ సిబ్బంది
ఆరిలోవ (విశాఖపట్నం), మార్చి 25 (ఆంధజ్ర్యోతి):
దక్షిణ కోస్తా రైల్వే జోన్ డివిజన్ కార్యాలయ నిర్మాణంలో భాగంగా చేపడుతున్న పనులను స్థానిక గిరిజనులు మంగళవారం అడ్డుకున్నారు. తమకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేయవద్దంటూ నినాదాలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నగర పరిధిలోని చినగదిలి మండలం ముడసర్లోవ రిజర్వాయర్‌కు సమీపంలో సుమారు 52 ఎకరాలను రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు బదలాయించింది. ఆ స్థలంలో బూసి భుయాన్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ సిబ్బంది మంగళవారం ఎక్స్‌కవేటర్‌తో స్థలం చదునుచేసే పనులు ప్రారంభించారు. అయితే స్థానికంగా నివాసముంటున్న గిరిజనులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని పనులను అడ్డుకున్నారు. అక్కడ సుమారు 66 ఎకరాలను 1963లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 66 గిరిజన కుటుంబాలకు కేటాయించిందని, శ్రీకృష్ణాపురంలో ఇళ్లు కూడా నిర్మించిందని వివరించారు. తమ భూముల్లో పనులు చేపట్టవద్దంటూ నినాదాలు చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఏమైనా అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్‌ను కలిసి నివేదించాలని కాంట్రాక్టు సిబ్బంది వారికి సూచించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పనులు యథావిధిగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు పైడిరాజుతో పాటు అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుపై 50 శాతం వడ్డీ రాయితీ
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):
ఆస్తి పన్ను, వీఎల్‌టీ (ఖాళీ స్థలాలపై పన్ను) బకాయిల చెల్లింపుపై 50 శాతం వడ్డీ రాయితీ ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసిందని జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నగర పరిధిలోని గృహ యజమానులు, స్థలాలు కలిగినవారు ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఇంకా చెల్లించనివారు మొదటి అర్ధ సంవత్సరం పన్నుపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని, అలాంటి వారంతా సంవత్సరం పన్నును ఈనెల 31లోపు ఒకేసారి చెల్లిస్తే...వారికి వడ్డీపై 50 శాతం రాయితీ లభిస్తుందని జీవీఎంసీ రెవెన్యూ విభాగం డిప్యూటీ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. అలాగే గత కొన్నేళ్లుగా పన్ను చెల్లించకుండా ఉండిపోయినవారు ఈనెల 31లోగా మొత్తం చెల్లించేస్తే వడ్డీలో 50 శాతం మినహాయింపు వర్తిస్తుందని వివరించారు. ఆస్తి పన్నును అన్ని జోనల్ కార్యాలయాల్లోని సౌకర్యం కేంద్రాలతోపాటు సిరిపురంలోని ఐడీబీఐ బ్యాంక్, ద్వారకానగర్ ఐసీఐసీఐ బ్యాంక్, రామ్‌నగర్‌లోని యాక్సిస్ బ్యాంకుల్లో చెల్లించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే వార్డు సచివాలయాల వద్ద కూడా పన్ను చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు.