Share News

కేజీహెచ్‌లో వైద్యుల కక్కుర్తి

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:53 AM

కేజీహెచ్‌లో కొందరు వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడు తున్నారు.

కేజీహెచ్‌లో వైద్యుల కక్కుర్తి

  • డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లతో ఒప్పందాలు

  • ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ వంటి పరీక్షలు

  • బయట చేయించుకోవాలంటూ రోగులపై ఒత్తిడి

  • సెంటర్‌ల నిర్వాహకుల నుంచి 40 నుంచి 50 శాతం మేర కమీషన్‌

  • ఆస్పత్రిలోనే పరీక్షలు చేయించుకుంటే రిపోర్టులు చూసేందుకు ఆసక్తి చూపించని పరిస్థితి

  • తమ క్లినిక్‌లకు వచ్చేయాలంటూ

  • రోగులకు సూచిస్తున్న మరికొందరు వైద్యులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కేజీహెచ్‌లో కొందరు వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడు తున్నారు. ముఖ్యంగా మూడు, నాలుగు విభాగాలకు చెందిన వారు బయట మెడికల్‌ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ వంటి పరీక్షలను తమ చెప్పినచోట చేయించుకోవా లంటూ రోగులకు సూచిస్తున్నారు. ఈ పరీక్షలు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ ఉంటాయి. తమ వద్ద పరీక్షలకు సిఫారసు చేసినందుకు సదరు వైద్యులకు మెడికల్‌ సెంటర్లు 40 నుంచి 50 శాతం వరకూ కమీషన్‌ చెల్లిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ వేరొక చోట పరీక్షలు చేయించుకుంటే రిపోర్టులను చూసేందుకు కొందరు వైద్యులు ఇష్టపడడం లేదు. అందులో స్పష్టత లేదని, ఫలానా మెడికల్‌ సెంటర్‌లో చేయించుకోవాలని పంపిస్తున్నారు. కేజీహెచ్‌లో రూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు పొందేందుకు అవకాశం ఉన్నా, వైద్యులు కొందరు వేల రూపాయలు పెట్టి పరీక్షలు బయట చేయించుకోవాలని పంపుతుండడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యులు చూసుకునే వెసులుబాటు

ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ వంటి పరీక్షలను కేజీహెచ్‌లో ఉచితంగా చేస్తారు. ఫిల్మ్‌ మాత్రం కొన్నాళ్లుగా రోగులకు ఇవ్వడం లేదు. కానీ, రిపోర్టులను రోగులకు అందిస్తున్నారు. అలాగే, ఆన్‌లైన్‌లో సంబం ధించిన ఇమేజ్‌లను వైద్యులకు పంపిస్తున్నారు. వీటిని కంప్యూటర్‌లో వైద్యులు పరిశీలించి రోగులకు అవసరమైన మందులు ఇవ్వవచ్చు. కానీ, కొందరు వైద్యులు వాటిల్లో స్పష్టత లేదంటూ బయటకు వెళ్లి పరీక్షలు చేయించుకోమంటున్నారు.

ప్రైవేటు రోగులు

ఇక కొన్ని విభాగాలకు చెందిన వైద్యులైతే రోగులను తమ క్లినిక్‌లు, ఆస్పత్రులకు తరలించుకుపోతున్నారు. ఇది బహిరంగ రహస్యమే. ఒకసారి కేజీహెచ్‌కు వస్తే రెండోసారి నుంచి క్లినిక్‌, సదరు వైద్యుడు పనిచేసే ఆస్పత్రికి వెళ్లే రోగులు ఎంతోమంది ఉన్నారు. కేజీహెచ్‌లో వైద్యం పొందాలంటే కనీసం మూడు, నాలుగుసార్లు రావాలన్న భావన రోగుల్లో ఉంది. దీనికంటే నేరుగా సదరు వైద్యుడి క్లినిక్‌కు వెళ్లి చూపించుకుంటే సరిపోతుందన్న పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఇది ఆస్పత్రిలోని ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోరు. ఇప్ప టికీ ఎంతోమంది వైద్యులు ఓపీల్లో అందుబాటులో ఉండరు. ఎవరైనా ప్రశ్నిస్తే ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్నామని, మరో ఉన్నతాధికారి వద్దకు వెళ్లామన్న సమాధానం చెబుతుంటారు. ఆస్పత్రిలో వ్యవహా రాలపై జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించాల్సి ఉంది.

Updated Date - Mar 26 , 2025 | 12:53 AM