స్టార్టప్ పాలసీతో వినూత్న మార్పులు
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:57 AM
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన ఇన్నోవేషన్, స్టార్టప్ పాలసీ ఐటీ రంగంలో వినూత్నమైన మార్పులకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఐటీ పరిశ్రమ హర్షం
రతన్ టాటా ఇన్నోవేషన్ ద్వారానే కార్యక్రమాలు
అమరావతి, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలలో సబ్ సెంటర్లు
30 మంది ఉద్యోగుల వరకూ 100 శాతం అద్దె రాయితీ
విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన ఇన్నోవేషన్, స్టార్టప్ పాలసీ ఐటీ రంగంలో వినూత్నమైన మార్పులకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా అనుకున్న లక్ష్యం సాధించాలని ప్రభుత్వం పాలసీని రూపొందించింది. విజయవాడలో ఆ సెంటర్‌ను ఏర్పాటుచేసి దానికి అనుబంధంగా మరో ఐదు సబ్ సెంటర్లను విశాఖపట్నం, అమరావతి, రాజమండ్రి, తిరుపతి, అనంతపురాల్లో ఏర్పాటుచేస్తామని పేర్కొంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించి అన్ని కార్యక్రమాలు అక్కడి నుంచే అమలయ్యేలా చేయనున్నారు. ఈసారి ఇన్నోవేషన్, స్టార్టప్‌లకు ఒక్క ఐటీ శాఖ నుంచే కాకుండా గుర్తించిన 15 శాఖల నుంచి రూ.10 కోట్లకు తక్కువ లేకుండా నిధులు ఇచ్చేలా నిబంధనలు పెట్టారు.
స్టార్టప్‌లకు ప్రోత్సాహం
- మంచి ఐడియాతో స్టార్టప్ చేస్తే ఆ ఆలోచనకే రూ.2 లక్షలు గ్రాంటు ఇస్తారు.
- స్టార్టప్ ఉత్పత్తి ప్రారంభిస్తే రూ.15 లక్షల గ్రాంటు
- స్టార్టప్‌లో 30 మంది ఉద్యోగుల వరకూ ఉచిత సీట్లు. ప్లగ్ అండ్ ప్లే. ఎటువంటి అద్దె వసూలు చేయరు.
- ఐడియా బాగా పనిచేస్తుందని నమ్మితే సీడ్ ఫండింగ్‌గా రూ.50 లక్షలు ఈక్విటీ షేరింగ్‌తో ఇస్తారు.
- ఏమైనా ఈవెంట్లకు హాజరైతే ఖర్చులో 75 శాతం రీఎంబర్స్‌మెంట్ చేసుకోవచ్చు.
- మహిళలు, బీసీలు, ఎస్‌సీలు, ఎస్‌టీలు, దివ్యాంగులకు రూ.20 లక్షల వరకు గ్రాంటు
సిలికాన్ వేలీగా ఏపీ
శ్రీధర్ కొసరాజు, పూర్వ చైర్మన్, ఐటాప్
ఈ కొత్త పాలసీతో ఆంధ్రప్రదేశ్ సిలికాన్ వేలీగా మారనుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ ద్వారా 20 వేల స్టార్టప్‌లు ఏర్పాటు చేయించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ పాలసీలో ప్రభుత్వ ప్రమేయం తక్కువ. దీని ద్వారా ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఐటీ ఎకో సిస్టమ్ పూర్తిగా మారిపోతుంది. కేవలం ఐటీ ఒక్కటే కాకుండా ఐఓటీ, ఏఐ తదితర కొత్త టెక్నాలజీలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇది పూర్తిగా సీఎం చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి లోకేశ్‌ల చొరవతోనే సాధ్యమైంది.