Share News

స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చట్ట విరుద్ధం

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:07 AM

ఉక్కు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చట్ట విరుద్ధమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నరసింగరావు అన్నారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి రక్షణ యాత్ర పేరిట ఆదివారం కొత్త గాజువాక నుంచి కూర్మన్నపాలెంలోని రిలే నిరాహార దీక్షల శిబిరం వరకు చేపట్టిన పాదయాత్ర విజయవంతమైంది.

స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చట్ట విరుద్ధం
కూర్మన్నపాలెంలోని దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న సీహెచ్‌ నరసింగరావు

కేంద్రం ప్యాకేజీ ఇచ్చింది కార్మికులను తొలగించడానికా?

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నరసింగరావు

కూర్మన్నపాలెం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఉక్కు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చట్ట విరుద్ధమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నరసింగరావు అన్నారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి రక్షణ యాత్ర పేరిట ఆదివారం కొత్త గాజువాక నుంచి కూర్మన్నపాలెంలోని రిలే నిరాహార దీక్షల శిబిరం వరకు చేపట్టిన పాదయాత్ర విజయవంతమైంది. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చింది కార్మికులను తొలగించడానికా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో ఇంత దారుణమైన కార్మికుల తొలగింపును మునుపెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కు కాంట్రాక్టు కార్మికులను ఏ ఒక్కరినీ తొలగించరాదని ఆయన డిమాండ్‌ చేశారు. కార్మికులకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల మద్దతు ఉందన్నారు. స్టీల్‌ప్లాంటుకు సొంత గనులు కేటాయించి సెయిల్‌లో విలీనం చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందే తప్పా కార్మికులను తొలగిస్తే రాదని పేర్కొన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌లు మాట్లాడుతూ ఉక్కు యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల తొలగింపును ఆపకపోతే రానున్న రోజుల్లో జరిగే ఉధృత పోరాటాలకు, పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులోకి తీసుకోవాలని, ఇకపై ఎవరినీ తొలగించరాదని, నిర్వాతులకు న్యాయం చేయాలని, సకాలంతో వేతనాలు ఇవ్వడంతో పాటు బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ కేంద్రానికి స్టీల్‌ప్లాంటును నడిపే ఉద్దేశం లేదన్నారు. అదానీకి కట్టబెట్టే యోచనలో ఉందని, ప్రభుత్వాల కుట్రను ప్రజలంతా తిప్పికొట్టాలన్నారు. ఉక్కు కర్మాగార పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటాలాకు సిద్ధం కావాలని పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు, కేఎస్‌ఎన్‌ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు జె.అయోధ్యరామ్‌, ఎన్‌.రామారావు, నీరుకొండ రామచంద్రరావుల, జగ్గు నాయుడు, జె.రామకృష్ణ, దొమ్మేటి అప్పారావు, యు.రామస్వామి, కేఎం శ్రీనివాస్‌, నమ్మి రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:07 AM