దొంగలు బాబోయ్...
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:34 AM
దొంగలు బాబోయ్... దొంగలు... తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలు చేస్తున్నారు. జిల్లాలో రెండు రోజుల్లో 12 ఇళ్లలో, ఒక మిర్చి యార్డులో దొంగతనాలు జరిగాయి. లక్షల రూపాయల సొత్తును లూటీ చేశారు. ఇళ్లలోకి చొచ్చుకెళుతున్న దొంగలు బంగారం, వెండి ఆభరణాలతోపాటు ద్విచక్రవాహనాలనూ ఎత్తుకుపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రొఫెషనల్ దొంగల ముఠాలు ఒకే రకమైన చోరీలకు పాల్పడే అవకాశముంటుందని, బైక్‌లను ముట్టరని కొందరు పోలీసులు చెబుతున్నారు.

కరీంనగర్ క్రైం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): దొంగలు బాబోయ్... దొంగలు... తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలు చేస్తున్నారు. జిల్లాలో రెండు రోజుల్లో 12 ఇళ్లలో, ఒక మిర్చి యార్డులో దొంగతనాలు జరిగాయి. లక్షల రూపాయల సొత్తును లూటీ చేశారు. ఇళ్లలోకి చొచ్చుకెళుతున్న దొంగలు బంగారం, వెండి ఆభరణాలతోపాటు ద్విచక్రవాహనాలనూ ఎత్తుకుపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రొఫెషనల్ దొంగల ముఠాలు ఒకే రకమైన చోరీలకు పాల్పడే అవకాశముంటుందని, బైక్‌లను ముట్టరని కొందరు పోలీసులు చెబుతున్నారు. గంజాయి బ్యాచ్‌లే ఇటువంటి దొంగతనాలకు పాల్పడి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంజాయికి బానిసలుగా మారిన కొందు ముఠాలుగా ఏర్పడి డబ్బుల కోసం పగలంతా తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతూ విలువైన వస్తువులు, బంగారం, వెండి, నగదును, బైక్‌లను ఎత్తుకుపోతున్నారని పోలీసుల్లో చెబుతున్నారు. రెండు గ్రామాల్లో జరిగిన ఘటనల్లో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు. ఒక వృద్ధురాలి ఇంటిలోకి వెళ్లి ఆమె మెడలోని పుస్త్తెలతాడును తెంపుకుని పారిపోయారు. ఒక ఇంటి ఆవరణలోని బైక్‌ను దొంగిలించారు. మరో చోట మిర్చియార్డులోకి వెళ్లి క్యాష్ కౌంటర్‌లోని 80 వేల నగదును ఎత్తుకుపోయారు.
ఫ భయాందోళనలో ప్రజలు
రెండు రోజుల వ్యవధిలో 13 చోట్ల దొంగతనాలు జరిగి, లక్షల రూపాయల సొత్తును దోచుకుపోవడంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్నా ఫలితం ఉండడం లేదు. రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచినట్లు పోలీసులు చెబుతున్నా దొంగతనాలు నియంత్రణలోకి రావడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఫ ఆదివారం అర్ధరాత్రి శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న ఎనిమిది ఇళ్లలోకి వెళ్లి భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదు, బైక్, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకుపోయారు. మంగళవారం అర్ధరాత్రి మానకొండూర్ మండలం అన్నారంలో నాలుగిళ్లలోకి వెళ్లి బంగారం, వెండి, నగదు, బైక్‌లను ఎత్తుకుపోయారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు రాత్రి గస్తీని పెంచాలని కోరుతున్నారు. పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు తిరుగుతూ సైరన్ వేసుకుంటూ వెళుతున్నారు. దొంగలు ఆ సైరన్ విని పోలీసుల కంటపడకుండా చీకట్లో నక్కి పోలీసులు వెళ్లిన తరువాత వారి పనిని కానిచ్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఫ కరీంనగర్ బస్టాండ్‌లో ఆందోళన కలిగిస్తున్న చోరీలు
కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణీకుల సెల్‌ఫోన్‌లు, పర్సులు, బ్యాగ్‌లు చోరీకి గురవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం గన్నేరువరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బస్సు ఎక్కుతున్న సమయంలో 20 వేల స్మార్ట్ సెల్‌ఫోన్‌ను కొట్టేశారు. అందకుముందు ఒక ప్రయాణీకురాలి హాండ్ బ్యాగ్‌ను దొంగలు చోరీ చేసినట్లు తెలిసింది. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో బస్టాండ్‌లో నిత్యం ప్రయాణికుల సెల్‌ఫోన్లు, పర్సులు, బ్యాగ్‌లు చోరీకి గురవుతున్నప్పటికీ దొంగలను గుర్తించలేకపోతున్నారు. వరంగల్, హన్మకొండ, నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్లలో ప్రతి ప్లాట్‌ఫాంకు ఇద్దరు వంతున ఆర్టీసీ సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసి ప్రయాణీకుల భద్రతకు ప్రాధానమిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సీసీ కెమెరా ఉన్నచోటనే నిలపాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రయాణికుల వస్తువులు చోరీకి గురైన సమయంలో వెంటనే సీసీ కెమెరాలను పరిశీలిస్తే నిందితులు ఎవరనేది వెల్లడై త్వరగా పట్టుకునేందుకు వీలుంటుంది. చోరీకి గురైన సొమ్ములు రికవరీ అయ్యే అవకాశముంటుంది.