Share News

ఆర్థిక వృద్ధికి ప్రణాళికలు

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:26 AM

జిల్లాను ఆర్థికంగా మరింత పటిష్ఠవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, అందుకు ప్రధానంగా సర్వీ్‌స సెక్టార్‌, ఉత్పత్తి, వ్యవసాయ రంగాలపై దృష్టిసారించి తగిన ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న సదస్సులో రెండో రోజు బుధవారం కలెక్టర్‌ 2025-26లో జిల్లా సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉత్పత్తి రంగంలో కీలకమైన ప్రాజెక్టులు పట్టాలు ఎక్కేలా ముందుకు వెళుతున్నామన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశకు అవసరమైన భూసేకరణ పూర్తిచేసి, వచ్చే 12 నెలల్లో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. నగరంలో మురుగునీటి సమస్య పరిష్కారానికిగాను యూజీడీ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. తాగునీటి సరఫరా మరింత మెరుగుపర్చేందుకు వీలుగా ప్రణాళికలు అమలు చేస్తామన్నారు.

ఆర్థిక వృద్ధికి ప్రణాళికలు

సర్వీ్‌స సెక్టార్‌, ఉత్పత్తి, వ్యవసాయ రంగాలపై ప్రధాన దృష్టి

ఏడాదిలో మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశకు

భూసేకరణ పూర్తి చేసి టెండర్లు ఆహ్వానిస్తాం

తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తాం

గ్రోత్‌హబ్‌ లక్ష్యాలు చేరుకుంటాం

కొత్తవంగడాలు, వినూత్న పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగంలో ఉత్పాదక పెంపు

కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌

విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):

జిల్లాను ఆర్థికంగా మరింత పటిష్ఠవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, అందుకు ప్రధానంగా సర్వీ్‌స సెక్టార్‌, ఉత్పత్తి, వ్యవసాయ రంగాలపై దృష్టిసారించి తగిన ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న సదస్సులో రెండో రోజు బుధవారం కలెక్టర్‌ 2025-26లో జిల్లా సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉత్పత్తి రంగంలో కీలకమైన ప్రాజెక్టులు పట్టాలు ఎక్కేలా ముందుకు వెళుతున్నామన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశకు అవసరమైన భూసేకరణ పూర్తిచేసి, వచ్చే 12 నెలల్లో టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. నగరంలో మురుగునీటి సమస్య పరిష్కారానికిగాను యూజీడీ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. తాగునీటి సరఫరా మరింత మెరుగుపర్చేందుకు వీలుగా ప్రణాళికలు అమలు చేస్తామన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోనే విశాఖ జిల్లా తలసరి ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉందని, వచ్చే ఏడాదికల్లా రాష్ట్ర స్థూల అభివృద్ధిలో విశాఖ రీజియన్‌ వాటా 15.7 శాతం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆదాయపరంగా రాష్ట్రంలో విశాఖ ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రస్తుత ఏడాది జిల్లా వృద్ధి రేటు 9.73గా ఉందంటూ...రాష్ట్ర వృద్ధి రేటు 12.02 కంటే తక్కువగా ఉండడానికి గల కారణాలను కలెక్టర్‌ వివరించారు. ఈ ఏడాది నిర్మాణ రంగం మందకొడిగా ఉందని, ఇసుక, మెటల్‌ వంటి ముడిసరకు కొరత వచ్చిందన్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.1,500 కోట్లుగా నిర్ణయిస్తే ఇంతవరకు రూ.1,100 కోట్లు వచ్చిందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది నిర్మాణ రంగంపై ఎక్కువగా ఫోకస్‌ పెడతామన్నారు. జిల్లా ఆదాయంలో సర్వీస్‌ సెక్టార్‌ నుంచి 50 శాతం, ఉత్పత్తి రంగం నుంచి 45 శాతం, వ్యవసాయం నుంచి ఐదు శాతం వస్తుందన్నారు. ఉత్పత్తి రంగంపై మరింత దృష్టిసారించడం వల్ల ఆదాయం పెరిగేలా కృషిచేస్తామన్నారు. రెండు పోర్టుల ద్వారా వ్యాపారం పెరిగితే ఆదాయం వృద్ధి చెందుతుందన్నారు. దీంతో వచ్చే ఏడాది వృద్ధి రేటు 15 శాతానికి చేరుకోకపోయినా రాష్ట్ర సగటును దాటుతామని పేర్కొన్నారు.

స్మార్ట్‌ సిటీ పనులు 90 శాతం పూర్తి

స్మార్ట్‌ సిటీ, ఎన్‌సీఏపీ నుంచి నిధులు విడుదల కావలసి ఉందని, రాష్ట్ర వాటాగా రూ.248.91 కోట్లు బదిలీ చేయాల్సి ఉందని సమావేశంలో కలెక్టర్‌ వెల్లడించారు. గతంలో మూడు వాయిదాల్లో రూ.129.25 కోట్లు విడుదల చేశారని, వాటితో చేపట్టిన పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. 2019 నిబంధనల ప్రకారం కోస్తా నియంత్రణ మండలి పరిధిని గుర్తించడానికి ఏపీ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నదని చెప్పారు. మధురవాడ, భీమునిపట్నం మధ్య సీఆర్‌జెడ్‌-3, సీఆర్‌జెడ్‌-2లను రీ క్లాసిఫికేషన్‌ చేయాలని వినతులు వచ్చాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. యారాడ భూముల అభివృద్ధికి న్యాయపరమైన అడ్డంకులు వస్తున్నాయని, ఆ భూముల్లో గంగవరం పోర్టు, రక్షణ శాఖ కార్యాలయాలు ఉన్నాయని, కోర్టులో రిట్‌ పిటిషన్లు కూడా ఉన్నాయన్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలను ఒక గ్రోత్‌ హబ్‌ను నీతి ఆయోగ్‌ రూపొందించిన నేపథ్యంలో పలు రంగాల అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాయుతంగా కృషి చేస్తున్నట్టు కలెక్టర్‌ వివరించారు. 2047కల్లా 2.5 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకున్నందున...విశాఖ రీజియన్‌లో నిర్దేశించిన 715 బిలియన్‌ డాలర్ల లక్ష్యం చేరుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

జిల్లాలో రంగాల వారీగా చూస్తే గ్రాస్‌ వాల్యూయాడెడ్‌ (జీవీఎ)లో వ్యవసాయ రంగం వాటా కేవలం ఐదు శాతం మాత్రమే ఉందని పేర్కొంటూ దానిని 10 శాతానికి చేరుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగదు రూపంలో చూస్తే రూ.68 కోట్లు మాత్రమే వ్యవసాయ రంగం వాటాగా ఉన్నట్టు వెల్లడించారు. జిల్లాలో అనేక కారణాల వల్ల రెండు వేల ఎకరాల బీడు భూములు ఉన్నాయని, వచ్చే ఏడాది 200 హెక్టార్లను సాగులోకి తీసుకువస్తామన్నారు. వరి, చిరుధాన్యాల సాగులో వినూత్న సంస్కరణలు చేపట్టి కొత్త వంగడాలు ప్రవేశపెడతామన్నారు. వరిలో ఎంటీయూ 1224, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, చిరుధాన్యాలలో ఇంద్రావతి, వేగవతి వంటి నూతన రకాలను అందుబాటులోకి తీసుకువచ్చి ఉత్పాదకతను పెంచుతామన్నారు. సూర్యఘర్‌ పథకం అమలుకుగాను ప్రతి నియోజకవర్గంలో కనీసం పది వేల యూనిట్లు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిసారించేలా ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తామని కలెక్టర్‌ వివరించారు.

Updated Date - Mar 27 , 2025 | 01:26 AM