Share News

వైద్యులు సమయపాలన పాటించాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:39 AM

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరచడంపై దృష్టిసారించామని, అందుకోసం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు చెప్పారు. సమయపాలన పాటించకపోయినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోగ్య కేంద్రాల పనితీరు, కేన్సర్‌ స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌, ప్రైవేటు ఆస్పత్రులపై పర్యవేక్షణ సహా పలు అంశాలను వెల్లడించారు.

వైద్యులు సమయపాలన పాటించాలి

ఫీల్డ్‌కు వెళితే మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో నమోదుచేయాలి

లేనిపక్షంలో చర్యలు తప్పవు

సిబ్బందికి కూడా అదే వర్తిస్తుంది

ఆరోగ్య కేంద్రాల పనితీరు మెరుగుపర్చేందుకు కృషిచేస్తున్నాం

నాలుగు ఇండికేటర్స్‌ అమలు చేసేలా వైద్యులు, సిబ్బందికి ఆదేశాలు జారీ

క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ సర్వే 46 శాతం,

అభా ఐడీ ప్రోగ్రామ్‌ 69 శాతం మేర పూర్తి

ఖాళీలు భర్తీలో పారదర్శకత పాటిస్తున్నాం

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మాకు ఫిర్యాదు చేయవచ్చు

రోగికి అందించే వైద్యాన్ని రహస్యంగా ఉంచడానికి వీల్లేదు

‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు

విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరచడంపై దృష్టిసారించామని, అందుకోసం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు చెప్పారు. సమయపాలన పాటించకపోయినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోగ్య కేంద్రాల పనితీరు, కేన్సర్‌ స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌, ప్రైవేటు ఆస్పత్రులపై పర్యవేక్షణ సహా పలు అంశాలను వెల్లడించారు.

వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్న

ఆరోపణలు ఉన్నాయి?

ప్రస్తుతం గ్రామీణ జిల్లాలో తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు చొప్పున వైద్యులు, 12 మంది చొప్పున సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే, పట్టణంలో 66 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో అర్బన్‌ ఆరోగ్య కేంద్రంలో ఒక్కో డాక్టర్‌తోపాటు మరో ఆరుగురు సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు (సెలవు రోజుల్లో మినహా) రోగులకు సేవలు అందించాలి. కొన్నిచోట్ల సిబ్బంది ఉండడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. వైద్యులు తప్పనిసరిగా వారికి కేటాయించిన సమయాల్లో ఆస్పత్రుల్లోనే ఉండాలి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌) కఠినంగా అమలు చేస్తున్నాం. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవు. రాష్ట్ర స్థాయి నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు.

వైద్యులు తప్పనిసరిగా డ్యూటీ వేళల్లో ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలి. ఉదయం ఓపీ చూసిన తరువాతే ఫీల్డ్‌కు వెళ్లాలి. ఫీల్డ్‌కు వెళితే తప్పనిసరిగా మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో ఎంటర్‌ చేయాలి. దీన్ని పక్కాగా పాటించాలి. లేకపోతే చర్యలు తప్పవు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల వివరాలను ఎలక్ర్టానిక్‌ హెల్త్‌ రికార్డులో నమోదు చేస్తున్నాం.

నియామకాలపై ఆరోపణలు వస్తున్నాయి?

ప్రస్తుతం ఆరోగ్య శాఖలో ఎటువంటి ఖాళీలు లేవు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ కార్యాలయం ద్వారా ఖాళీల భర్తీ జరిగేది. ఇప్పుడు డీఎంఈ, డీహెచ్‌ ఆధ్వర్యంలో జరుగుతోంది. కొన్ని పోస్టులు మేము భర్తీ చేస్తున్నాం. అటువంటి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేస్తున్నాం. మెరిట్‌ ఉన్న వారికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి.

కేన్సర్‌ స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌ ఎంతవరకు వచ్చింది?

ప్రభుత్వం కేన్సర్‌ రోగులను ముందుగానే గుర్తించేందుకు స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ జిల్లాలో 46 శాతం పూర్తయింది. ఈ సర్వేలో భాగంగా నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్లను ముందుగా గుర్తించడంతోపాటు బీపీ, షుగర్‌ వంటి వాటిని నిర్ధారిస్తున్నాం. అనుమానిత కేన్సర్‌ కేసులను కేజీహెచ్‌లోని ప్రివెంటివ్‌ అంకాలజీ యూనిట్‌కు తరలించి పరీక్షలు చేయిస్తున్నాం. వచ్చే నెలాఖరు నాటికి సర్వే పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అర్బన్‌ ప్రాంతాల్లో ప్రజలు సర్వేకు సహకరించాలి.

అలాగే, ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ (ఆభా) ఐడీ ప్రోగ్రామ్‌ కూడా నడుస్తోంది. ఆధార్‌ తరహాలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య ఐడీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏఎన్‌ఎం ఇంటింటికీ వెళ్లి ఆధార్‌తో అటాచ్‌ అయి ఉన్న ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి అభా ఐడీని జనరేట్‌ చేస్తున్నారు. భవిష్యత్తులో ఆధార్‌ తరహాలో వైద్య సేవల కోసం ఈ ఐడీ ఉపయోగపడుతుంది. రోగులు ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఆ నంబర్‌ చెబితే వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇది మెరుగైన సేవలు అందించేందుకు ఉపకరిస్తుంది.

మీరు ప్రాధాన్యం ఇచ్చే అంశాలు?

ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం. తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టిసారిస్తున్నా. ఓపీ, ఐపీ సేవలు, డెలివరీలు పెంచాలి. ఫ్యామిలీ ప్లానింగ్‌ అంటే బిడ్డకు బిడ్డకు మధ్య దూరం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలి. ఆయా కేంద్రాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఈ అంశాలను అడిగి తెలుసుకుంటున్నా. వైద్యులు, సిబ్బంది చెప్పే మాటలు విని వచ్చేయకుండా రోగులతో కూడా మాట్లాడి సేవలు అందుతున్న తీరును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం.

ఆస్పత్రులపై పర్యవేక్షణ కొరవడినట్టుంది?

జిల్లాలోని ఆస్పత్రులతోపాటు క్లినిక్‌లు, ల్యాబొరేటరీలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు ఆందోళనలు చేస్తున్నారు. ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అటువంటి వాటిపై అధికారులతో విచారణ చేయిస్తున్నాం. మా సిబ్బంది ఎప్పటికప్పుడు కొన్ని ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటుంటారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే మాకు ఫిర్యాదులు చేయవచ్చు. రోగికి అందించే వైద్యాన్ని రహస్యంగా ఉంచడానికి వీల్లేదు. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వాలి.

Updated Date - Mar 27 , 2025 | 01:39 AM