Share News

పరిశ్రమల కోసం 1000 ఎకరాలు

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:52 AM

విశాఖ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం వేయి ఎకరాలను గుర్తిస్తున్నామని, నగరానికి దగ్గరగా, రహదారి సౌకర్యం ఉన్న భూములనే ఎంపిక చేస్తామని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ పేర్కొన్నారు.

పరిశ్రమల కోసం 1000 ఎకరాలు

  • నియోజకవర్గానికొక ఎంఎస్‌ఎంఈ పార్కు

  • మెట్రో రైలు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన భూమిని ఆరు నెలల్లో అప్పగిస్తాం

  • జీవీఎంసీ పరిధిలో ఐదుచోట్ల వర్కింగ్‌ విమెన్‌ హాస్టళ్లు

  • వచ్చే జూన్‌ నాటికి మాస్టర్‌ప్లాన్‌ రహదారుల నిర్మాణం పూర్తి

  • సీఎంకు నివేదిక ఇచ్చిన కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌

విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

విశాఖ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం వేయి ఎకరాలను గుర్తిస్తున్నామని, నగరానికి దగ్గరగా, రహదారి సౌకర్యం ఉన్న భూములనే ఎంపిక చేస్తామని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ పేర్కొన్నారు. అమరావతిలో మంగళ, బుధవారాల్లో ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో సమావేశంలో జరగనున్న సమావేశాల్లో సమర్పించేందుకు జిల్లాకు సంబంధించి ఆయన ఒక నివేదిక రూపొందించారు. జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నదీ అందులో వివరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు పెడతామన్నారు. వాటికి ఏయూలోని రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ సహకరిస్తుందని, దీనివల్ల 300 స్టార్టప్‌లు, 1,800 మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. ఐఐఎం ఇంకుబేషన్‌, స్టార్టప్‌ హబ్‌లో 300 స్టార్టప్‌లకు సహకారం అందిస్తామన్నారు.

- పీఎం సూర్యఘర్‌ కింద 7,500 సోలార్‌ రూఫ్‌టాప్‌లు అమరుస్తున్నామన్నారు. ఆరింటిని మోడల్‌ సోలార్‌ గ్రామాలుగా మారుస్తామన్నారు. సుమారు 98 ఎకరాలలో 5 సోలార్‌ ప్లాంట్లను 9.47 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేస్తామన్నారు. అలాగే మరో 100 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీఎన్‌జీ అమ్మకాలు పెంచడానికి కొత్తగా 5 రిటైల్‌ అవుట్‌లెట్లు పెడతామన్నారు.

- మెట్రో రైలు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన భూమిని ఆరు నెలల్లో అప్పగిస్తామని హామీ ఇచ్చారు.

- భోగాపురం విమానాశ్రయం ట్రాఫిక్‌ను తట్టుకోవడానికి 15 మాస్టర్‌ ప్లాన్‌ రహదారులను 72.82 కి.మీ. పొడవున రూ.392.89 కోట్లతో నిర్మించనున్నామని, వీటిని వచ్చే జూన్‌ నాటికి పూర్తిచేస్తామన్నారు.

- జీవీఎంసీ పరిధిలో పనిచేసే మహిళల కోసం ఐదు ప్రాంతాల్లో వర్కింగ్‌ విమెన్‌ హాస్టళ్లు నిర్మించే ఆలోచన ఉందన్నారు. వీటి ద్వారా 1,150 మందికి ఆశ్రయం లభిస్తుందన్నారు.

- మధురవాడ ప్రాంతంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థను రూ.643 కోట్లతో చేపట్టనున్నామని వెల్లడించారు.

- పరదేశిపాలెంలో కాలేజీ విద్యార్థినులకు రూ.70 లక్షలతో హాస్టల్‌ భవనం నిర్మిస్తామన్నారు.

- కేజీహెచ్‌ ఓపీ బ్లాక్‌, క్యాజువాలిటీని కోటి రూపాయలతో ఆధునీకరించనున్నట్టు పేర్కొన్నారు.

- త్వరలోనే విశాఖ పోర్టులో క్రూయిజ్‌ టూరిజం ప్రారంభం కానుందని, బీచ్‌లో హోప్‌ ఆన్‌, హోప్‌ ఆఫ్‌ బస్సు సర్వీసులు ప్రారంభిస్తామన్నారు.

ప్రత్యేక డ్రగ్‌ డి అడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలి

సీపీ శంఖబ్రతబాగ్చి సూచన

విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, మత్తుమందులు, మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారి సంఖ్య పెరిగినందున, వారిని అందులో నుంచి బయటపడేసేందుకు ప్రత్యేక డ్రగ్‌ డీ అడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలతో అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెకర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో గంజాయి వినియోగం పెరిగిపోతున్నందున డ్రగ్‌ డి అడిక్షన్‌ సెంటర్లను పెంచాలని కోరారు. దీనికి అనుబంధంగా సీపీ శంఖబ్రతబాగ్చి మాట్లాడుతూ అన్నింటికీ ఒకే విధమైన చికిత్స, కౌన్సెలింగ్‌ కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒక్కో డ్రగ్‌కు ఒక్కో రకమైన ట్రీట్‌మెంట్‌ అవసరమని, అలా చేస్తేనే ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఏ డ్రగ్‌ను ఎక్కువగా వాడుతున్నారనే దానిపై సర్వే చేసి, మ్యాపింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత ఎక్కడ ఎలాంటి డీ అడిక్షన్‌ సెంటర్‌ అవసరమైతే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చునని సీఎం చంద్రబాబు అన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:52 AM