Share News

జిల్లా సమగ్రాభివృద్ధికి విజన్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:19 PM

స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యంతో జిల్లాలో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధనకు ఒక విజన్‌తో ముందుకు సాగుతున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.

జిల్లా సమగ్రాభివృద్ధికి విజన్‌
సీఎం చంద్రబాబునాయుడు సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధన దిశగా చర్యలు

- రూ.1,050 కోట్లతో కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణ, 75 వేల ఎకరాల్లో పాత తోటల పునరుద్ధరణకు ప్రతిపాదనలు

జిల్లాలో 94,270 మంది ప్రకృతి వ్యవసాయ రైతులు

పర్యాటకంగా జిల్లాను అగ్రస్థానంలో ఉంచేందుకు ప్రణాళిక

సీఎం చంద్రబాబునాయుడు సమీక్షలో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యంతో జిల్లాలో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధనకు ఒక విజన్‌తో ముందుకు సాగుతున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన జిల్లా అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేస్తూ సీఎంకు వివరించారు. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధన దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధానంగా జిల్లాలో ఆదాయ వనరుగా ఉన్న కాఫీ తోటల అభివృద్ధికి చర్యలు చే పడుతున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 2 లక్షల 82 వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయని, కాఫీ బోర్డు సహకారం, ఉపాధి హామీ పథకంలో మరో లక్ష ఎకరాల్లో కొత్తగా తోటల విస్తరణ, 75 వేల ఎకరాల్లో పాత తోటల పునరుద్ధరణ చేపట్టామన్నారు. అందుకు గానూ రూ.1,050 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. జిల్లాలో సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తున్నామని, మొత్తం లక్షా 74 వేల మంది రైతుల్లో 94 వేల 275 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సేద్యం చేస్తున్నారన్నారు. ప్రతి ఏడాది సాగు విస్తీర్ణం పెంచుతామని తెలిపారు. ఉద్యానవన, వ్యవసాయం, పట్టు, మత్స్య పరిశ్రమల ద్వారా గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇరిగేషన్‌లో భాగంగా 306 చెక్‌డ్యామ్‌లకు రూ.18.23 కోట్లతో మరమ్మతులు చేపట్టామని, ఐటీడీఏ ఆర్థిక సహకారంతో రూ.11.9 కోట్లతో 10 వేల ఎకరాల పంటలకు సాగునీటిని అందించామని చెప్పారు. అలాగే 5 వేల ఎకరాల్లో చిరుధాన్యాలైన రాగులు, సామలు, కొర్రల విస్తీర్ణం పెంచేందుకు, 3 వేల ఎకరాల్లోని మైక్రో ఇరిగేషన్‌ లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామన్నారు. పీ4 మోడల్‌లో యూనిట్‌ ధర రూ.65 వేలుగా 159 పేద కుటుంబాలకు గొర్రెలు, మేకల యూనిట్‌లను అందిస్తామన్నారు.

మారుమూల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.2,887 కోట్లు

జిల్లాలో నేటికీ వందల సంఖ్యలో మారుమూల గ్రామాలున్నాయని, ఆయా ప్రాంతాలకు రోడ్ల నిర్మాణానికి రూ.2,887 కోట్లు అవసరమవుతుందని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి 1,530 గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయం లేదని, అవి పాడేరు డివిజనల్‌లో 1,230, రంపచోడవరం డివిజన్‌లో 178, చింతూరు డివిజన్‌లో 109 గ్రామాలున్నాయన్నారు. దీంతో 1,230 గ్రామాలకు తారురోడ్ల నిర్మాణానికి రూ.2,887 కోట్లు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం వివిధ పథకాల్లోని నిఽధులతో గిరి పల్లెలకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. పర్యాటకంగా జిల్లాలో ఉన్న టూరిజం స్పాట్‌లను కలుపుతూ టూరిజం హబ్‌లను ఏర్పాటు చేస్తామని, కొత్తగా పాడేరు మండలం డల్లాపల్లిలో స్టార్‌ రిసార్ట్స్‌ నిర్మాణం, డుంబ్రిగుడ మండలం అంజోడలో కార్వాన్‌ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకంగా ఏటా జిల్లాలో సుమారుగా రూ.100 కోట్ల టర్నోవర్‌ జరుగుతుందని, దానిని మరింతగా పెంచి గిరిజన యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతామన్నారు. రూ.5 కోట్లతో ఈకో ఫ్రెండ్లీ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పాడేరు, రంపచోడవరం ప్రాంతాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ వెల్లడించారు.

Updated Date - Mar 26 , 2025 | 11:19 PM