Share News

Arms depot land acquisition exercise ఆయుధ డిపో భూసేకరణకు కసరత్తు

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:04 AM

Arms depot land acquisition exercise బాడంగి మండల కేంద్రంలో చిలకపాలెం-రాయగడ రాష్ర్టీయ రహదారిని ఆనుకొని నిరుపయోగంగా ఉన్న పురాతన విమానాశ్రయ స్థలంలో నేవీ ఆయుథ డిపో ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని, భూసేకరణ చేపట్టాల్సి ఉందని బొబ్బిలి ఆర్డీవో జిల్లెల వెంకట సత్యసాయి రామ్మోహనరావు తెలిపారు.

Arms depot land acquisition exercise ఆయుధ డిపో భూసేకరణకు కసరత్తు
రామ్మోహనరావు, బొబ్బిలి ఆర్డీవో

ఆయుధ డిపో భూసేకరణకు కసరత్తు

1796.079 ఎకరాలు అవసరం

భూముల విలువ కోసం జిల్లా రిజిస్ర్టార్‌కు లేఖ

బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు

బొబ్బిలి, మార్చి 24(ఆంధ్రజ్యోతి):

బాడంగి మండల కేంద్రంలో చిలకపాలెం-రాయగడ రాష్ర్టీయ రహదారిని ఆనుకొని నిరుపయోగంగా ఉన్న పురాతన విమానాశ్రయ స్థలంలో నేవీ ఆయుథ డిపో ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని, భూసేకరణ చేపట్టాల్సి ఉందని బొబ్బిలి ఆర్డీవో జిల్లెల వెంకట సత్యసాయి రామ్మోహనరావు తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం 180 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని, 1796.079 ఎకరాలు అవసరమని చెప్పారు. యుద్ధ నౌక, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, నేవీ షిప్‌, ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌, నేవల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఆయుధ భాండాగారం) వంటి వాటికోసం భూములను సేకరించాలని తమకు ఆదేశాలందాయన్నారు. బాడంగి మండలంలో ముగడ, కోడూరు, రామచంద్రపురం, పూడివలస, పాల్తేరు, మల్లమ్మపేట గ్రామాలకు చెందిన భూములు మాత్రమే సేకరణ ప్రతిపాదనల్లో ఉన్నాయన్నారు. గ్రామాలేవీ పోవడం లేదని, వాటిని ఆనుకొని పెద్ద ప్రహరీ వస్తుందన్నారు. భూముల విలువకు సంబంధించి నివేదికలు ఇవ్వాలని జిల్లా రిజిస్ర్టార్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. నిధులు వస్తే కానీ ఈ కార్యకలాపాలేవీ చేపట్టలేమన్నారు. భూముల ధరల వివరాలు వచ్చిన తరువాత అవసరమైన ప్రతిపాదనలను తయారు చేసి కేంద్రప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. హేబిటేషన్స్‌ పక్క నుంచి ప్రతిపాదిత ఆయుధ డిపో గోడలు వస్తాయని, ఇందుకు సంబంధించిన విధి విధానాలపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తరువాతే క్షేత్రస్థాయి కార్యకలాపాలు జరుగుతాయని, అంతవరకు కాగితాలపైనే పనులు జరుగుతాయని ఆర్డీవో తెలిపారు.

- భూముల రీసర్వేలో చోటుచేసుకున్న లోటుపాట్లను సవరించేందుకు తహసీల్దారు, ఆర్డీవో స్థాయిలో పరిష్కరించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించాలని కోరామని ఆర్డీవో తెలిపారు. బొబ్బిలి మండలం పారాది పంచాయతీ బంకురువానివలస గ్రామంలో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Mar 25 , 2025 | 12:04 AM