అవిశ్వాసం వైపుగా..
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:43 PM
Towards disbelief.. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే దిశగా పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనిపై బొబ్బిలి అంతా చర్చలు సాగుతున్నాయి. మాజీ మంత్రి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు మున్సిపల్ అవిశ్వాస తీర్మానంపై ఇటీవల తొలిసారిగా పెదవి విప్పడంతో వైసీపీ శిబిరంలో కలకలం రేగింది.

అవిశ్వాసం వైపుగా..
అధినేతల రంగప్రవేశంతో ఊపందుకున్న మున్సిపల్ రాజకీయం
అటు బొత్స, చిన్నశ్రీను, ఇటు నాయన సోదరులు
తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం
టీడీపీ, వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లలో ఉత్కంఠ
బొబ్బిలి, మార్చి 27(ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే దిశగా పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనిపై బొబ్బిలి అంతా చర్చలు సాగుతున్నాయి. మాజీ మంత్రి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు మున్సిపల్ అవిశ్వాస తీర్మానంపై ఇటీవల తొలిసారిగా పెదవి విప్పడంతో వైసీపీ శిబిరంలో కలకలం రేగింది. అన్నకు మద్దతుగా ఎమ్మెల్యే బేబీనాయన కూడా ప్రకటించారు. దీంతో మున్షిపల్ రాజకీయం కాస్త వేడెక్కినట్లయింది. అన్నదమ్ములిద్దరూ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు మొగ్గుచూపినట్లు నిర్ధారణ కావడంతో తెలుగుదేశం శిబిరంలోనే కాకుండా వైసీపీలో ఉన్న అసమ్మతి వర్గంలోనూ జోష్ పెరిగింది.
సుజయ్ మాట్లాడాక మున్సిపల్ చైర్మన్ సావు హుటాహుటిన పక్కి గ్రామానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత శంబంగి వెంకటచినఅప్పలనాయుడుతో మంతనాలు జరిపారని సమాచారం. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణ సైతం ఈ అంశంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. వైసీపీలో ఉన్న అసమ్మతి కౌన్సిలర్లందరినీ తనతో ఫోన్‌లో మాట్లాడే ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను దగ్గరికి వైసీపీ కౌన్సిలర్లు వెళ్లి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆ సమావేశానికి గాని, మున్సిపల్ చైర్మన్ ప్రీ కౌన్సిల్ సమావేశానికి గాని అసమ్మతి వర్గీయులైన కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాకపోవడం మరో ట్విస్టుగా పరిశీలకులు భావిస్తున్నారు.
- అసమ్మతి వర్గంలో ఉన్న తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లలో కొంతమంది స్థానిక మాజీ ఎమ్మెల్యేకి అనుచరులు కాగా, మరికొంతమంది బొత్స, చిన్నశ్రీను అనుచరులుగా ముద్ర పడినవారే కావడం గమనార్హం. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న డిమాండ్‌లో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు.
- అవిశ్వాస తీర్మానం నెగ్గితే తర్వాత చైర్మన్‌గా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు కావొచ్చునంటున్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడరుగా వ్యవహరిస్తున్న గెంబలి శ్రీనివాసరావు కూడా ఈ పదవి పట్ల ఆసక్తితో ఉన్నారు. సామాజిక వర్గం సమీకరణాలకు సంబంధించి తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వైస్‌చైర్మన్ పదవుల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలిసింది.
- ఈ నెల 29 న మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో చర్చకు సుమారు 50కి పైగా అంశాలను పేర్కొన్నారు. అయితే రాజకీయంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం తీరుతెన్నులు ఎలా ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
--------------