Share News

ఫ్రీహోల్డ్‌ పనిపడుతున్నారు!

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:39 PM

రెండు దశాబ్దాలు దాటిన అసైన్డ్‌ భూములకు గత వైసీపీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన సంగతి తెలిసిందే. జిల్లాలో 7490.62 ఎకరాలకు యాజమాన్య హక్కు (ఫ్రీహోల్డ్‌) కల్పించారు. ఇలా ఫ్రీహోల్డ్‌ జరిగిన వెనువెంటనే తొమ్మిది మండలాల్లో 179.41 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్‌లు జరిగాయి.

ఫ్రీహోల్డ్‌ పనిపడుతున్నారు!

ఫ్రీహోల్డ్‌ పనిపడుతున్నారు!

15 ఎకరాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు గుర్తింపు

నోటీసుల జారీతో అక్రమార్కుల్లో గుబులు

బయటపడని కీలక వ్యక్తుల పేర్లు

ఫ్రీహోల్డ్‌ ప్రక్రియపైనా లోతుగా విచారణ

ఇన్‌చార్జి మంత్రులకు బాధ్యతలు

శృంగవరపుకోట, 27(ఆంధ్రజ్యోతి):

- జిల్లాలో 15 ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ అయినట్లు గుర్తించాం. వారికి నోటీసులు పంపించాం

- మూడు రోజుల క్రితం గంట్యాడ విలేకర్ల సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

- వేపాడలో 100.55 ఎకరాలు, రామభద్రపురం 33.88 ఎకరాలు, భోగాపురం 19.6 ఎకరాలు, విజయనగరం 11.56 ఎకరాలు, గజపతినగరం 6.11 ఎకరాలు, డెంకాడ 5.1 ఎకరాలు, గంట్యాడ 1.25 ఎకరాలు, దత్తిరాజేరు 0.36 ఎకరాలు, మెరకముడదాం 1 ఎకరా

- ఇవీ మండలాల వారీగా రిజిస్ట్రేషన్లు జరిగిన ఫ్రీహోల్డ్‌ భూములు

రెండు దశాబ్దాలు దాటిన అసైన్డ్‌ భూములకు గత వైసీపీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన సంగతి తెలిసిందే. జిల్లాలో 7490.62 ఎకరాలకు యాజమాన్య హక్కు (ఫ్రీహోల్డ్‌) కల్పించారు. ఇలా ఫ్రీహోల్డ్‌ జరిగిన వెనువెంటనే తొమ్మిది మండలాల్లో 179.41 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఈ వ్యవహారం నిబంధనలకు విరుద్దంగా జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం భావించడంతో విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా జిల్లాలో 15 ఎకరాల ఫ్రీహోల్డ్‌ భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేల్చారు. దీంతో వీటిని అక్రమ మార్గంలో పొందిన వారి గుండెలు గుబేల్‌ మంటున్నాయి. ఇప్పటికే వీరందరికి నోటీసులు జారీ చేసినట్లు మంత్రి కొండపల్లి తెలిపారు. అక్రమంగా జరిగిన ఫ్రీహోల్డ్‌ రిజిస్ట్రేషన్‌లను రద్దు చేస్తారా? లేక ఈ భూములను తిరిగి నిషేధిత జాబితాలో చేరుస్తారా? అసైన్డ్‌ రైతుకు తిరిగి భూమిని అప్పగిస్తారా? ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటుందా? అన్న చర్చ నడుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా క్రయ, విక్రయాలకు అవకాశం ఇచ్చిన అధికారులపై ఎటువంటి చర్యలు ఉంటాయన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు.

కీలక బాధ్యులెవరో?

ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు రెవెన్యూ కార్యాలయాల పాత్ర ఉంది. వీరందరిలోనూ ఇప్పుడు ఆందోళన నెలకొంది. అయితే ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్‌ తంతులో ఎన్ని ఎకరాల్లో అక్రమాలు జరిగాయన్నది మాత్రమే బయటకు చెబుతున్నారు. నోటీస్‌లు పంపించామంటున్నారు తప్ప బాధ్యుల పేర్లు ఇంకా బయటపెట్టలేదు.

ఫ్రీహోల్డ్‌పైనా అనుమానాలు

ఫ్రీహోల్డ్‌ జరిగిన భూముల రిజిస్ట్రేషన్ల కంటే అసైన్డ్‌ భూములకు చట్టబద్ధత (ఫ్రీహోల్డ్‌) కల్పించిన తీరుపైనా ప్రస్తుత ప్రభుత్వానికి అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. నిజంగా అసైన్డ్‌ భూములు కలిగిన అర్హులు ఎవరున్నారు? వాటిని ఫ్రీహోల్డ్‌ చేయడం వల్ల వారికే లబ్ధి చేకూరిందా? వారిని మభ్యపెట్టి ఎవరైనా భూములు కొని లబ్ధిపొందుతున్నారా? అన్న అంశాలన్నీ కూలంకషంగా పరిశీలించే బాధ్యతను జనవరి నెలలో జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించారు. ఇదెంతవరకు తేల్చారన్న విషయం బహిర్గతం కావడం లేదు.

పేదల భూముల్లో పెద్దల పాగా

జిల్లాలో సగానికి పైబడి అసైన్డ్‌ భూములు ఇతరుల చేతుల్లో ఉన్నాయి. అప్పట్లో ఎకరా రూ.500 నుంచి రూ.1000కు అనధికారకంగా కొనుగోలు చేసిన వారున్నారు. ఈ అసైన్డ్‌ భూములు పొందిన వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని పేదలు కావడంతో వారికి డబ్బు ఆశచూపి కొందరు పెద్దలు చేజెక్కించుకున్నారు. అయితే ఈ భూములను వ్యవసాయ భూములుగా మార్చుకునేందుకు ఖర్చుతో కూడిన పని కావడంతో చాలామంది అలాగే వదిలేశారు. ఇలాంటి వారిని గుర్తించిన బడాబాబులు వీరినుంచి తీసుకున్న భూముల్లో పలు రకాల పండ్ల చెట్ల పెంపకం చేపట్టేందుకు తిరిగి వారినే కూలీలుగా మార్చారు. అధికారులు ఎవరైనా వస్తే తమ భూములుగా చెప్పేలా తర్ఫీదు ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌లు చేసుకొనేందుకు అవకాశఽం లేనందున అప్పుగా ఇచ్చినట్లు కాగితాలు రాయించుకున్నారు. అమ్మిన రైతులు ఎవరైనా తిరగబడితే వాటిని చూపి నోరు నొక్కేసేవారు. ఇలాంటి వారందరికీ గత వైసీపీ ప్రభుత్వంలో కలిసొచ్చింది. అప్పటి ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ భూములకు యాజమాన్య హక్కులు కల్పించుకున్నారు. చట్టబద్ధత కల్పించుకొనేందుకు రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగుతుండగానే ప్రభుత్వం మారింది.

రెవెన్యూ అధికారుల సహకారంతోనే..

అసైన్డ్‌ భూములు అసలైన రైతుల వద్ద లేవన్న విషయం అందరికీ తెలిసిందే. ఇరవై ఏళ్ల క్రితం అసైన్డ్‌ పొందిన రైతు ఇప్పటికీ అతని అనుభవంలో ఉంటేనే ఫ్రీహోల్డ్‌కు అర్హులు. అప్పటి రెవెన్యూ అధికారులు ఈ నిబంధనను పాటించకుండా భూములను అమ్ముకొని వారి వద్ద కూలీగా వున్న అసైన్డ్‌ రైతుల పేరున తొలుత భూ యాజమాన్య హక్కులు కల్పించి, ఆ తరువాత రిజిస్ట్రేషన్‌ల ద్వారా చట్టబద్ధత కల్పించేందుకు అవకాశం ఇచ్చారు.

లోతుగా ఆరా తీస్తున్న ప్రభుత్వం

ఫ్రీహోల్డ్‌ భూముల్లో వెంటవెంటనే రిజిస్ట్రేషన్‌ జరిగిన భూములను గుర్తించేందుకు ప్రస్తుత ప్రభుత్వం నడంబిగించింది. ఇలాంటి భూమి లెక్క తెలుసుకోవాలన్న ఆత్రుత అందరిలోనూ ఉంది. గత ఆరు నెలలుగా రెవెన్యూ అధికారులు వడపోతపడుతున్నారు. కలెక్టర్‌ కార్యాలయానికి నివేదికలు వెలుతున్నాయి. అయినా ఈ లెక్క ఇంతవరకు తేలలేదు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ రిజిస్ట్రేషన్‌లు జరిగిన ఫ్రీహోల్డ్‌లో అక్రమ లెక్కను మాత్రమే బయటకు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూములకు జరిగిన ఫ్రీహోల్డ్‌ వివరాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

-------------

Updated Date - Mar 27 , 2025 | 11:40 PM