అవకతవకలు బట్టబయలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:42 PM
The manipulations are exposed మెంటాడ మండల కేంద్రంలో గురువారం జరిగిన సామాజిక తనిఖీ కార్యక్రమం సాక్షిగా గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల అమలులో చోటుచేసుకున్న అనేక అవకతవకలు, అక్రమాలు బట్టబయలయ్యాయి. డ్వామా అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ ఆడిట్‌లో ఇరిగేషన్, ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ తదితర పథకాల్లో డొల్లతనం బయటపడింది

అవకతవకలు బట్టబయలు
సోషల్ ఆడిట్ సాక్షిగా వెల్లడి
ఇరిగేషన్ గోడకు బీటలు
పూర్తికాని సచివాలయానికి బిల్లు చెల్లింపులు
మస్తర్లలోనూ మాయాజాలం
పీడీకి నివేదిస్తా: ఏపీడీ పద్మజ
మెంటాడ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మెంటాడ మండల కేంద్రంలో గురువారం జరిగిన సామాజిక తనిఖీ కార్యక్రమం సాక్షిగా గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల అమలులో చోటుచేసుకున్న అనేక అవకతవకలు, అక్రమాలు బట్టబయలయ్యాయి. డ్వామా అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ ఆడిట్‌లో ఇరిగేషన్, ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ తదితర పథకాల్లో డొల్లతనం బయటపడింది. కొంపంగి గ్రామంలో పట్నాయక్ చెరువు చుట్టూ దాదాపు ఐదులక్షలతో నిర్మించిన గోడ పూర్తిగా పగుళ్లు ఇచ్చిందని, పనుల్లో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని డీఆర్పీలు ఏపీడీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఏపీడీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేదికపై ఉన్న వైసీపీకి చెందిన మండల ఉపాధ్యక్షుడు కలుగుజేసుకొని క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఆ గోడ పనులు సక్రమంగా జరిగినట్లు నిర్ధారించారని, అటువంటిది ఇప్పుడు బీటలు వారాయని చెప్పడమేంటని అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
- మరికొన్ని గ్రామాల్లో బినామీ మస్తర్లు, దొంగ మస్తర్లు బయటపడ్డాయి.మస్తర్లలో దిద్దుబాట్లు, కొట్టివేతలను అధికారులు గుర్తించారు. దీనిపై నిలదీస్తే ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంపై ఏపీడీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
- జయతి సచివాలయానికి తలుపులు, విద్యుత్ వైరింగ్, ఫ్యాన్లు, ఏర్పాటు చేయకుండా బిల్లు డ్రా చేసినట్లు డీఆర్‌పీ నివేదించారు. పంచాయతీరాజ్ అధికారులు సోషల్ ఆడిట్‌కు సహకరించని విషయాన్ని ఏపీడీ దృష్టికి రాగా ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇంకా మరికొన్ని పథకాల్లో కూడా అవకతవకలును గుర్తించిన ఏపీడీ పద్మజ దీనిపై ప్రాజెక్టు డైరెక్టర్‌కు నివేదిక అందజేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో భానుమూర్తి, ఎంపీపీ సన్యాసినాయుడు, ఏపీవో చినప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
- ప్రాజెక్టు డైరెక్టర్ వస్తున్నట్టు సమాచారం అందడంతో రెండ్రోజులుగా ఉరుకులు పరుగులు తీసిన స్థానిక అధికారులు అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.