Camp politics in Bobbili బొబ్బిలిలో క్యాంపు రాజకీయాలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:49 PM
Camp politics in Bobbili

బొబ్బిలిలో క్యాంపు రాజకీయాలు
మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం దిశగా పరిణామాలు
కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో వైసీపీ
టీడీపీతోనే ఉన్న ఆ పార్టీ అసంతృప్తులు
రంగంలోకి ఇరుపార్టీల కీలక నాయకులు
బొబ్బిలి, మార్చి 31(ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకటమురళీకృష్ణారావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే దిశగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కౌన్సిలర్ల క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. తమ వర్గం కౌన్సిలర్లు చేజారిపోకుండా చూసుకునేందుకు రెండు పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలని వైసీపీ కౌన్సిలర్లే తొలుత సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. వారిలో వైసీపీకి చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిని బుజ్జగించాలని చైర్మన్‌తో సహా వైసీపీ నాయకులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని వారు తెగేసి చెప్పేశారు. వారు చెప్పినట్లుగానే సోమవారం వారంతా రహస్య శిబిరానికి తరలి వెళ్లారు. తొమ్మిది మంది వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు రహస్య శిబిరానికి వెళ్లినట్లు వార్తలు గుప్పుమనడంతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ పెద్దలంతా రంగప్రవేశం చేసి ఇప్పటికే తమకు అనుకూలంగా ఉన్న 11 మంది వైసీపీ కౌన్సిలర్లను వేరే రహస్య ప్రదేశానికి తరలించే ఏర్పాట్లు చేశారు. కాగా ఈ 11 మందిలో ఏ ఒక్కరూ జారిపోకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చూస్తుండగానే 26వ వార్డు వైసీపీ కౌన్సిలరు తిరుపతిరావు టీడీపీ శిబిరం వైపు వెళ్లిపోయారు. మాజీ మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు చేసిన మంత్రాంగం ఫలించినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
కలెక్టర్‌కు తీర్మానం ఇవ్వడమే తరువాయి
బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు సమక్షంలో ఆదివారం రాత్రి టీడీపీకి చెందిన పది మంది కౌన్సిలర్లు సమావేశమయ్యారు. వీరంతా చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవసరమైన లాంఛనాలను పూర్తిచేశారు. దీంతో ఇంతవరకు రెండు పార్టీలకు చెందిన 20 మంది కౌన్సిలర్లు చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సంతకాలు చేసినట్లయింది. ఇక కలెక్టర్‌కు తీర్మానం అందజేయడమే తరువాయి. ఈ లోగా మరికొంతమంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గుచూపుతూ సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం.
- ఇద్దరు మున్సిపల్ వైస్‌చైర్మన్లు ఎటువైపు మొగ్గుచూపుతారోనని పెద్ద చర్చ జరుగుతోంది. వీరిద్దరూ టీడీపీకి సై అంటారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక వైస్‌చైర్మన్‌ను వైసీపీ క్యాంపు శిబిరానికి తరలించినట్లు తెలిసింది.
- మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలతో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు కలిసి వైసీపీ ఖాతాలో నుంచి బొబ్బిలి మున్సిపాలిటీ చేజారిపోకుండా ప్రయత్నిస్తున్నారు.
అవిశ్వాసానికి సిద్ధం
సుజయ్‌ను కలిసి మద్దతు తెలిపిన వైసీపీ కౌన్సిలర్లు
బొబ్బిలి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ అసమర్థత కారణంగా మున్సిపా లిటీలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని, ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు స్పష్టంచేశారు. పదిమంది వైసీపీ కౌన్సిలర్లు సోమవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ అటవీఅభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావును విశాఖలోని ఆయన నివాసంలో కలిసి బేషరతుగా మద్దతు పలికారు. తమ పార్టీకి చెందిన చైర్మన్ ఆ పదవికి అర్హుడు కాడని, కూటమి ప్రభుత్వం బొబ్బిలి పట్టణాభివృద్ధికి సహకరిస్తున్నా చైర్మన్ అడ్డుపడడంతో అభివృద్ధి నిలిచిపోయిందని ఏకరువు పెట్టారు. టీడీపీ అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నుకునేందుకు తామంతా బేషరతుగా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. సుజయ్‌ను కలిసిన వారిలో వైసీపీ కౌన్సిలర్లు బొత్స రమణమ్మ, తెంటు పార్వతి, మరిపి తిరుపతిరావు, వాడపల్లి వనజాకుమారి, దిబ్బ సునీత, సావు శారద, సీరాపు శ్రీలక్ష్మి, ఒమ్మి మహలక్ష్మి, కొర్లాపు రామారావు, అమ్మన్నమ్మ ఉన్నారు.