Can it still solve ఇప్పుడైనా తేలుతుందా..?
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:48 PM
Can it still solve ‘లక్కవరపుకోట గ్రామానికి చెందిన రామన్న(రాయప్ప)చెరువు రంగరాయపురం గ్రామానికి ఆనుకొని ఉంది. చెరువు గట్టును సర్పంచ్ రహదారిగా మార్చేస్తున్నారు. కిలోమీటరు పొడవు రోడ్డు నిర్మించేస్తున్నారు. మేము అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. తగు చర్యలు తీసుకోండి’ అంటూ లక్కవరపుకోట పంచాయతీకి చెందిన నాయకుడొకరు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు పంపారు.

ఇప్పుడైనా తేలుతుందా..?
రంగరాయపురం సరిహద్దుల వివాదంపై రేపు విచారణ
మూడు దశబ్దాల క్రితం సంతపేట గ్రామం నుంచి విభజించిన అధికారులు
గెజిట్ పబ్లికేషన్ చేయకే తరచూ వివాదాలంటున్న స్థానికులు
కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న మాజీ జడ్పీటీసీ
- లక్కవరపుకోట మండలం రంగరాయపురం (పిల్ల అగ్రహారం), సంతపేట గ్రామాల మధ్య శ్మశానం, చెత్త సేకరణ, ఇతర అభివృద్ధి పనులు జరగడం లేదని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇటీవల ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. 1995వ సంవత్సరం విభజన సమయంలో ఉన్న రికార్డుల ఆధారంగా సరిహద్దులను తెలియజేస్తూ నోటిఫికేషన్, గెజిట్‌ను ప్రచురించాల్సి ఉంది. తహసీల్దార్, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, రంగరాయపురం, ఎల్.కోట, సంతపేట గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు, సర్వేయర్‌లు, గ్రామ రెవెన్యూ అధికారులు గురువారం (ఈనెల 3న)రంగరాయపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరగనున్న విచారణకు హాజరుకావాలి.
- ప్రజా ప్రతినిధితులు, పంచాయతీ, రెవెన్యూ అధికారులకు డివిజనల్ పంచాయతీ అధికారి నుంచి అందిన దర్యాప్తు నోటీస్ ఇది
శృంగవరపుకోట, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి):
‘లక్కవరపుకోట గ్రామానికి చెందిన రామన్న(రాయప్ప)చెరువు రంగరాయపురం గ్రామానికి ఆనుకొని ఉంది. చెరువు గట్టును సర్పంచ్ రహదారిగా మార్చేస్తున్నారు. కిలోమీటరు పొడవు రోడ్డు నిర్మించేస్తున్నారు. మేము అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. తగు చర్యలు తీసుకోండి’ అంటూ లక్కవరపుకోట పంచాయతీకి చెందిన నాయకుడొకరు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు పంపారు. ఇలా రంగరాయపురం గ్రామంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా పక్కనున్న సరిహద్దు గ్రామాలతో అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేసిన సమయంలో అధికారులు సరిహద్దులు చూపలేదు. దీంతో గెజిట్ పబ్లికేషన్ వివరాలు లభ్యం కావడం లేదు. ప్రత్యేక పంచాయతీగా ఏర్పడి మూడు దశాబ్దాలు కావస్తోంది. ఇంతవరకు ఈ గ్రామానికి సరిహద్దులేవో ఎవరికీ తెలియదు. వీటి కోసం కొన్నేళ్లగా మాజీ జడ్పీటీసీ కరెండ్ల ఈశ్వరరావు పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లా ప్రాదేశిక సభ్యునిగా (జడ్పీటీసీ) పలుమార్లు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ప్రస్తావించారు. అంతలో ప్రభుత్వం మారింది. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేతల దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ పంచాయతీగా ముద్ర ఉండడంతో పట్టించుకోవడం మానేశారు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టడంతో గ్రామ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో స్థానికులు ఉన్నారు.
- 1995లో సంతపేట గ్రామం నుంచి వేరుచేసి ప్రత్యేక పంచాయతీగా రంగరాయపురాన్ని గుర్తించారు. గెజిట్ పబ్లికేషన్‌ను మాత్రం ముద్రించలేదని స్థానికుల వాదన. అప్పటి నుంచి దాదాపు నాలుగు పర్యాయాలు స్థానిక ఎన్నికలు జరిగాయి. సర్పంచ్, పాలకమండలి సభ్యులు కొలువుతీరుతున్నారు. నాలుగేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో. టీడీపీ మద్దతుదారు కరెండ్ల రామలక్ష్మి సర్పంచ్ పీటం దక్కించుకున్నారు. సహజంగా ప్రభుత్వం ప్రత్యేక పంచాయతీగా ప్రకటించే సమయంలో గెజిట్ పబ్లికేషన్‌ను ఇస్తుంది. ఆ పబ్లికేషన్‌లో గ్రామ పరిధిలోకి వచ్చే అస్తుల వివరాలను, సరిహద్దులను పొందుపరుస్తారు. ఈ ప్రక్రియ జరగలేదు. దీంతో అప్పటి నుంచి నిత్యం వివాదాలు తలెత్తుతున్నాయి. పంచాయతీ అభివృద్ధి పడకేసింది. గెజిట్ పబ్లికేషన్ ద్వారానే తమ హక్కులను పొందవచ్చని భావించిన మాజీ జడ్పీటీసీ ఈశ్వరరావు చాలా సంవత్సరాలుగా ఇందుకోసం పోరాడుతున్నారు.
ఎమ్మెల్యే చొరవతో..
సరిహద్దుల సమస్యతో గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇటీవల ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు వివరించారు. గెజిట్ ప్రచురుణ చేయాలని కోరారు. దీంతో ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారిగా డివిజినల్ పంచాయతీ అధికారికి బాధ్యతలు అప్పగించింది. అధికారులు చేపట్టే విచారణ ద్వారా గెజిట్ పబ్లికేషన్, సరిహద్దుల వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.