Share News

విద్యాలయం భూములనూ వదలరా?

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:32 AM

even School lands encrochment రెండు నెలల క్రితం ఎస్‌.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుబంధంగా మహిళ వసతి గృహ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వం రూ.6 కోట్లు కేటాయించింది. కళాశాలకు చెందిన స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు తొలుత చెట్ల తొలగింపునకు ప్రయత్నించగా కొంతమంది వచ్చి ఈ భూమి తమదంటూ పేచీకి దిగారు.

విద్యాలయం భూములనూ  వదలరా?
ఎస్‌.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పెరిగిన టేకు చెట్లు

విద్యాలయం భూములనూ

వదలరా?

ఎస్‌.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములపై కన్ను...!

మాన్సాస్‌ నుంచి కొనుగోలు చేసిన ప్రభుత్వం

సరైన రికార్డులు లేకపోవడంతో ఆక్రమణలకు యత్నం

చెట్లు మావంటూ తాజాగా కొందరి బుకాయింపు

అధికారుల ప్రవేశంతో వెనకడుగు

ఇంకా ఆక్రమణలో కళాశాల, మాన్సాస్‌ భూములు

రెండు నెలల క్రితం ఎస్‌.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుబంధంగా మహిళ వసతి గృహ నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వం రూ.6 కోట్లు కేటాయించింది. కళాశాలకు చెందిన స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు తొలుత చెట్ల తొలగింపునకు ప్రయత్నించగా కొంతమంది వచ్చి ఈ భూమి తమదంటూ పేచీకి దిగారు. దీంతో కళాశాల సిబ్బంది రెవెన్యూ అధికారులను సంప్రదించారు. తహసీల్దార్‌ ఎం.అరుణకుమారి సర్వే చేయించారు. సర్వే నెంబర్‌ల ప్రకారం కళాశాల భూమిగా గుర్తించారు. మహిళా వసతి గృహ నిర్మాణానికి భూమి హద్దులను చూపించారు. అయితే ఈ కళాశాల మాన్సాస్‌ సంస్థ నుంచి గతంలో తీసుకున్న భూమిలో చాలా వరకు ఆక్రమణలు ఉన్నట్లు అనుమానాలున్నాయి.

శృంగవరపుకోట, మార్చి 25(ఆంధ్రజ్యోతి):

శృంగవరపుకోట పంచాయతీ పరిధిలోని పుణ్యగిరి కొండ సమీపంలో మాన్సాస్‌(మహారాజ అలక్‌ నారాయణ సొసైటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌)కు 20 ఎకరాల వరకు భూములున్నాయి. ఇందులో ఎకరా రూ.2వేలు చొప్పున 15 ఎకరాలను 1984లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం ప్రభుత్వ సంస్థ యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) కొనుగోలు చేసింది. సర్వే నెంబర్‌ 157లో పది ఎకరాలు, సర్వే నెంబర్‌ 149లో ఐదు ఎకరాలను యూజీసీకి మాన్సాస్‌ అప్పగించింది. మూడు దశాబ్దాల క్రితం ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మించారు. అందులో బీఏ, బీకాం, బీఎస్సీ మ్యాథ్స్‌, కెమిస్ట్రీ తరగతులు నిర్వహిస్తున్నారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడం, రవాణా సదుపాయం లేకపోవడం, ప్రైవేటు కళాశాలల ఆవిర్భావంతో ఈ కళాశాల ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. అయినా కూడా విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది.

విద్యార్థినుల అవస్థలు తప్పించేందుకే..

జిల్లా విద్యార్థులతో పాటు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు చెందిన విద్యార్థులూ ఇక్కడ చేరుతున్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో చేరే అవకాశం లేని దూర ప్రాంతాల విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించక సతమతమవుతున్నారు. వీరిలో మహిళా విద్యార్థులు ఎక్కువ. దీన్ని గ్రహించిన కళాశాల యాజమాన్యం అనుబంధ వసతిగృహం కోసం ప్రయత్నించారు. ప్రభుత్వం కరుణించింది. మాన్సాస్‌ నుంచి కొనుగోలు చేసిన సర్వే నెంబర్‌ 149లోని ఐదు ఎకరాల్లో ఈ వసతి గృహ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఖాళీ స్థలంలో ఉన్న టేకు చెట్లను తొలగించేందుకు అనుమతుల కోసం రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేశారు. చెట్లను తొలగిస్తున్నట్లు తెలుసుకున్న కొందరు ఈ భూములు తమవంటూ వచ్చారు. రెవెన్యూ అధికారులు సర్వే చేయడంతో ఈ భూమంతా మాన్సస్‌ వద్ద ప్రభుత్వ డిగ్రీ కళశాలకు కొనుగోలు చేసిందేనని తేలడంతో ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు.

పక్కా రికార్డులు లేకే..

మరో సర్వే నెంబర్‌ 157లోని పది ఎకరాల్లో ఐదు ఎకరాల్లోపు కళాశాల భవనాలు ఉన్నాయి. మిగిలిన భూమి చాలా వరకు ఆక్రమణల్లో ఉంది. భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసిన సమయంలోనే భవనాలు నిర్మించగా ఖాళీగా వున్న స్థలంలో టేకు చెట్లను నాటారు. అవి ఏపుగా పెరిగాయి. ఇప్పటికే ఈ చెట్లలో చాలా వరకు తస్కరించుకుపోయారు. కాగా కళాశాలకు భూమిని అప్పగించిన సమయంలో మాన్సాస్‌ నుంచి కొనుగోలు చేసినట్లు దేవదాయ శాఖ ఇచ్చిన పత్రం మాత్రమే ఉంది. మరేటువంటి రికార్డులను కళాశాలకు అప్పట్లో ఇవ్వకపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. కళాశాలకు విక్రయించగా మరో ఐదు ఎకరాల భూమి మాన్సాస్‌ వద్ద ఉంది. ఆ భూమిని కూడా ఆక్రమించారు. ఇప్పటికైన కళాశాలకు విక్రయించిన భూమికి సరైన రికార్డులు, మిగులు భూముల రక్షణకు మాన్సాస్‌ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వసతి గృహానికి రూ.6 కోట్లు మంజూరు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుబంధ మహిళా వసతి గృహం మంజూరైంది. రూ.6కోట్లతో కళాశాలకు అనుకుని ఉన్న స్థలంలో నిర్మించేందుకు నిర్ణయించాం. ఇందులో టేకు చెట్లు ఉన్నాయి. వీటిని తొలగించేందుకు రెవెన్యూ, అటవీ శాఖాధికారులకు విన్నవించాం. అనుమతులు వచ్చాయి. వీటిని తొలగించి వేలం వేస్తాం. తహసీల్దార్‌ అరుణకుమారి ప్రతిపాదిత స్థలానికి హద్దులు నిర్ణయించి ఇచ్చారు. మాన్సాస్‌ నుంచి కొనుగోలు చేసిన మొత్తం స్థలానికి హద్దులు చూపించాలని కోరాం.

డాక్టర్‌ సీహెచ్‌ కేశవరావు, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శృంగవరపుకోట

హద్దులు చూపించాం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన భూములకు హద్దులు చూపించాం. పక్కాగా హద్దులు నిర్ణయించేందుకు మాన్సాస్‌ సంస్థ భూ రికార్డులను ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల యాజమాన్యం వద్ద వున్న రికార్డులో స్థలం కొనుగోలు చేసినట్లు మాత్రమే ఉంది. ఆ భూమికి సంబంధించిన మ్యాప్‌ లేదు. ఎవరైన అడ్డగిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పాం.

- ఎం.అరుణకుమారి, తహసీల్దార్‌, శృంగవరపుకోట

Updated Date - Mar 26 , 2025 | 12:32 AM