is No compassion to market? కూ‘సంత’ కరుణ లేదా?
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:58 PM
is No compassion to market? ఆ సంతకు అధికారుల నుంచి అనుమతి ఉందా..? నిర్వాహకుడు నిబంధనలు అనుసరిస్తున్నాడా..? అధికారులు నిఘా పెట్టారా..? క్రమం తప్పకుండా సంత నిర్వహణ కమిటీ సమావేశం అవుతోందా..? పశువులకు కనీస వసతులు కల్పిస్తున్నారా..? వాటి రవాణాలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ లేదనే సమాధానమే వినిపిస్తోంది.

కూ‘సంత’ కరుణ లేదా?
లోట్లపల్లి సంతపై అధికారుల నిర్లక్ష్యం
అనుమతి లేకపోయినా పట్టించుకోని వైనం
కబేళాకు తరలిపోతున్న మూగజీవాలు
రవాణాలో కనీస సౌకర్యాలు మృగ్యం
సంత నిర్వాహకునికి నేతలూ సహకారం
గత ప్రభుత్వం నుంచీ ఇదే తీరు
వారం.. వారం రూ.కోట్లలో వ్యాపారం
జామి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ఆ సంతకు అధికారుల నుంచి అనుమతి ఉందా..? నిర్వాహకుడు నిబంధనలు అనుసరిస్తున్నాడా..? అధికారులు నిఘా పెట్టారా..? క్రమం తప్పకుండా సంత నిర్వహణ కమిటీ సమావేశం అవుతోందా..? పశువులకు కనీస వసతులు కల్పిస్తున్నారా..? వాటి రవాణాలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ లేదనే సమాధానమే వినిపిస్తోంది. జామి మండలంలోని లోట్లపల్లి సంత పరిస్థితి ఇది. పూర్వం నుంచి అతిపెద్ద పశువుల మార్కెట్‌గా పేరొందింది. ప్రతి సోమవారం జరిగే ఈ సంతకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఏ విషయంలోనూ సంతలో నిబంధనలు అమలు కావడం లేదు. అసలు సంత నిర్వహణకు అనుమతే లేదు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వ నేతలతోనూ సఖ్యతగా ఉంటూ నిర్వాహకుడు ఇష్టారాజ్యంగా వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
జామి మండలంలోని లోట్లపల్లి పశువుల సంత జిల్లాలోనే కాకుండా పక్క రాష్ట్రం పశువుల వ్యాపారులకు కూడా బాగా తెలుసు. సులువుగా వ్యాపారం సాగించాలన్నా... పశువులను ఏ రకంగా పట్టుకుపోవాలన్నా.. ఈ సంతే అనుకూలమని వ్యాపారులు భావిస్తారు. ఇటీవల కాలంలో కబేళా కోసమే ఎక్కువ ఆవులు అమ్ముడుపోతున్నాయి. అయితే వాటిని తీసుకువచ్చేటప్పుడు కాని తరలించేటప్పుడు కాని కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఒక్కోసారి కుక్కినట్టుగా ఒక వాహనంలో అత్యధికంగా ఆవులను రవాణా చేస్తున్నారు. పట్టించుకునేవారు ఉండరని వ్యాపారులకు గట్టి నమ్మకం. సంత నిర్వాహకుడు కూడా వారికి భరోసా ఇస్తున్నట్లు సమాచారం. అంతకన్న ముఖ్యంగా ఏడాది కాలంగా ఈసంత నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేవు. అధికారులు ఎందుకు అడగడం లేదో వారికే తెలియాలి. నిర్వాహకునికి కొందరు అధికారుల సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల్లో జరిగే లావాదేవీల్లో వారికీ వాటా అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు ప్రజాప్రతినిధులు ఈ సంత నిర్వాహకునికి అండగా ఉండేవారు. వారి సహకారంతోనే పశువుల వ్యాపారం బాగా సాగేది. దీనిపై జంతు సంరక్షణ సమాఖ్య అప్పట్లో గగ్గోలు పెట్టింది. కొందరు అధికారులు నిర్వాహకుడికి సహకరిస్తున్నారని సమాఖ్య ప్రతినిధులు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోయింది. ఇదిలా ఉండగా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు సంత నిర్వాహకుడు కండువా మార్చేశాడు. ఇంకేముంది కండువా మార్చిన పార్టీ గెలిచింది కాబట్టి మళ్లీ సంతకు అడ్డులేకుండా పోయింది. గత ప్రభుత్వ అనుమతులతో నడిచిన ఈ సంత ఏడాది కాలంగా ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా నడుస్తోంది. ఈ సంతకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్దఎత్తున పశువులను తీసుకొస్తారు. ఇక్కడకు ఆరోగ్యంగా వున్న పశువులకంటే అనారోగ్యంతో ఉండేవి.. గొడ్డుపోయినవి తెచ్చి కబేళా నిర్వాహకులకు తక్కువ ధరకు అమ్మేస్తారు. వీటిని కబేళా నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా రవాణా చేస్తున్నారు.
వాయిదాలు ఎందుకో?
పశువుల సంతకు లైసెన్స్ ఇచ్చేందుకు ముందు సంత నిర్వహణ కమిటీ సమావేశమవ్వాలి. అదేం విచిత్రమో కానీ గడిచిన ఏడాదిలో సుమారు ఐదునుంచి ఏడు సార్లు దీని అనుమతులు పునరుద్ధరించేందుకు సంత నిర్వహణ కమిటీ సమావేశం అయింది. అయితే ఎప్పుడూ తహసీల్దార్, పశువైద్యాధికారి మాత్రమే రావడం.. పోలీస్, మార్కెటింగ్, రవాణశాఖ అధికారులు గైర్హాజరవ్వడంతో సమావేశం వాయిదా పడేది. ఈ తంతు నిరంతర ప్రక్రియగా మారింది. సంతకు అనుమతులు ఇస్తే ఏ సమస్య వచ్చినా స్పందించాల్సి వస్తుందనో.. మరే ఇతర కారణం చేతనో అనుమతి పునరుద్ధరణ జరగడం లేదు. సంత నిర్వహణకు ఆసక్తి చూపే ఇతరులు సమావేశానికి వచ్చినప్పుడల్లా అధికారుల తీరుపై నిరాశ వ్యక్తం చేయడం సర్వసాధారణంగా మారింది. వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పినా అధికారులు మౌనాన్ని వీడడం లేదు. కాగా సంత నిర్వహణపై పంచాయతీ కార్యదర్శి మౌనికను వివరణ కోరగా ఆ విషయం తనకు పెద్దగా తెలియదని, తాను ఇటీవలే చార్జ్ తీసుకున్నానని చెప్పారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తానన్నారు.
వచ్చే నెల సమావేశం ఏర్పాటు చేస్తాం
ఉమ, ఈవోపీఆర్‌డీ
లోట్లపల్లి సంత నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు ఈ నెలలో సంత కమిటీ సమావేశం నిర్వహిస్తాం. సంత ఉంటే పంచాయతీకి ప్రతి ఏడాది రూ.లక్షా 80వేలు ఆదాయం వస్తుంది. గత ఏడాది అనుమతులు లేకపోవడం వల్ల ఆదాయం కోల్పోయాం. ఈయేడాది మాత్రం ఖచ్చితంగా డబ్బులు వసూలుచేస్తాం.