Share News

Better 'Employment' మెరుగ్గా ‘ఉపాధి’

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:06 AM

Better 'Employment' ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు మెరుగైన ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కూలీలకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో పని కల్పించాలని భావిస్తోంది.

Better 'Employment'  మెరుగ్గా ‘ఉపాధి’

వ్యవసాయం బాగు..బాగు

సాగుకు ఈ ఏడాది కలిసివస్తుందన్న పండితులు

మెరుగ్గా ‘ఉపాధి’

వేసవి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు

ఐదు అంశాలకు ప్రాధాన్యం

రాజాం రూరల్‌, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు మెరుగైన ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కూలీలకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో పని కల్పించాలని భావిస్తోంది. వేసవి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇటీవల అమరావతిలో రెండ్రోజుల పాటు కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు జిల్లా యంత్రాంగం గ్రామాల్లో ఏయే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏమేర నిధులు అవసరమో ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

చెరువుల పునరుద్ధరణ

గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చెరువుల్ని నీరు కార్చేసింది. జిల్లావ్యాప్తంగా చెరువుల్లో తట్టెడు మట్టి తీయించలేదు. దీంతో చెరువుల్లో పూడికలు పేరుకుపోయాయి. కట్టలు శిథిలావప్థకు చేరాయి. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి ఎండిపోతున్నాయి. దీంతో చెరువుల పునరుద్ధరణ, జల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తొలిదశలో గ్రామానికో చెరువును ఎంపికచేసి పూడిక తీయించి, చెరువుకట్ట బలోపేతం చేసేలా ఉపాధి నిధులు వెచ్చించనుంది.

సగటు వేతనానికి బరోసా

చాలామంది ఉపాధి కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. దీంతో నిరాశతో ఉన్న కొంతమంది కూలీలు పనులకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వేసవిలో రోజూ కనీస సగటు వేతనం రూ.300 దక్కేలా అధికారులు పనులు చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం నాలుగు గంటలు పని చేస్తే కూలి గిట్టుబాటయ్యేలా బృందానికి కొలతలతో మార్కింగ్‌ ఇస్తారు. ప్రతి శుక్రవారం రోజ్‌గార్‌ దివస్‌ సందర్భంగా పనుల మార్కింగ్‌, వేతనాలపై కూలీలకు అవగాహన కల్పిస్తారు.

పశువులకు నీటి తొట్టెలు

ప్రతి గ్రామంలో పశువులకు నీటితొట్టెలను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడెక్కడ నీటితొట్టెలు నిర్మించాలో అధికారులు నిర్ణయించాక పనులు ప్రారంభిస్తారు. పశువులు, మేకలు, గొర్రెలు తిరిగే మార్గంలో బోరు, పంచాయతీ కుళాయిలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణ పనులు చేపడతారు. ఏప్రిల్‌ నెలాఖరుకు నీటితొట్టెల నిర్మాణం పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలందాయి.

ఫీడర్‌ ఛానళ్ల మరమ్మతులు

ప్రతి మూడేళ్లకోసారి పూడికతీత పనులు చేపట్టాలి. అయితే ఈ నిర్ణయానికి గత ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. ఫలితంగా ఫీడర్‌ఛానళ్లలో పూడికలు పేరుకుపోయి, ఆనవాళ్లు కోల్పోయాయి. కూలీలకు పనుల కల్పనలో భాగంగా వీటి రూపురేఖలు మారనున్నాయి. పనులకు సంబంధించి మూడు దశల్లో ఫొటోలు తీసి నమోదు చేయాలి. పూడిక తొలిగితే శివారు భూములకు సాగునీరందేలా చూస్తారు.

ఫాంపాండ్ల నిర్మాణం

ఫాంపాండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. వ్యవసాయ భూముల్లో పడిన వాననీటిని ఒడిసిపడితే నీటిఎద్దడిని కొంతమేర తగ్గించవచ్చన్న ఆలోచనతో వీటి నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉపాధి పనులకు వచ్చే కూలీలలో 20 శాతం మందిని ఈ పనులకు మళ్లించేలా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్దేశాల మేరకు వేసవి ప్రణాళికలను ఆయాశాఖల అధికారులు తయారుచేస్తున్నారు.

Updated Date - Mar 31 , 2025 | 12:06 AM