Singer SP Sailaja: ఇవి మరచిపోలేని క్షణాలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:55 PM
Singer SP Sailaja: సినీ వినీలాకాశంలో మెరిసిన ఎంతో మంది మహానుభావులు నడయాడిన విజయనగరంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న క్షణాలు మరచిపోలేనివని సినీ గాయని ఎస్పీ శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్‌లు సంతోషం వ్యక్తం చేశారు.

- గాయని ఎస్పీ శైలజ, శుభలేఖ సుధాకర్
- గురునారాయణ కళాపీఠం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం
విజయనగరం (ఆంరఽధజ్యోతి)/విజయనగరం రూరల్, ఏప్రిల్ 1: సినీ వినీలాకాశంలో మెరిసిన ఎంతో మంది మహానుభావులు నడయాడిన విజయనగరంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న క్షణాలు మరచిపోలేనివని సినీ గాయని ఎస్పీ శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్‌లు సంతోషం వ్యక్తం చేశారు. గురునారాయణ కళాపీఠం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం శైలజా సుధాకర్ దంపతులకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాయని శైలజ మాట్లాడుతూ ఘంటసాల, పి.సుశీల వంటి వారు ఇక్కడ సంగీత సాధన చేసి.. విజయనగరం కీర్తిని నలుచెరగులా విస్తరింపజేశారని కొనియాడారు. విజయనగరం గడ్డపై గురునారాయణ కళాపీఠం నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో మొదటి సంగీత, నృత్య కళాశాలను పూసపాటి వంశీయులు స్థాపించడం కళలపై వారికి గల మక్కువను తెలియజేస్తోందన్నారు. అదే వంశానికి చెందిన అశోక్ గజపతిరాజు, అదితి గజపతిరాజు కళాకారులను ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ తన చిత్రాలను ఆదరించడమే కాకుండా, కళలు, కళాకారులకు నిలయమైన విజయనగరంలో సతీమణి శైలజకు, తనకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేయడం తమ జీవితంలో మరచిపోలేని ఘట్టమన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందన్నారు. వివిధ విభాగాల్లో ఎంతో మందిని ఈ సమాజానికి అందించిందని గుర్తు చేసుకున్నారు.
ఆకట్టుకున్న గీతాలు
అంతకుముందు సినీ నటి, హరికథా కళాకారిణి కల్యాణి, గురునారాయణ కళాపీఠానికి చెందిన గాయనీ గాయకులు పవన్‌చరణ్, సురభి, శ్రావణి, హారిక, సోనాలి, విష్ణుప్రియ తదితరులు వివిధ చిత్రాల్లోని గీతాలు ఆలపించారు. ఎస్పీ శైలజ ‘మయూరి’ చిత్రంలోని పాటను పాడి ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ కార్యక్రమంలో గురునారాయణ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బీఏ నారాయణ, సినీ దర్శకుడు ఇమంది రామారావు, కళాపీఠం సభ్యులు పి .సన్యాసమ్మ, యార్లగడ్డ బాబూరావు, లలిత, సాంబశివరావు, నాగేంద్రప్రసాద్, గౌరీ శంకర్. జి.శివ తదితరులు పాల్గొన్నారు.
పైడిమాంబను దర్శించుకున్న సుధాకర్ దంపతులు
విజయనగరం వచ్చిన ప్రముఖ గాయని ఎస్పీ శైలజ, నటుడు శుభలేఖ సుధాకర్‌లు మూడులాంతర్లు వద్ద ఉన్న పైడిమాంబ ఆలయంలో మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ప్రసాదాన్ని, పైడిమాంబ చిత్రపటాన్ని వారికి అందజేశారు.