Share News

ఆశీలు ఎగవేత

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:20 AM

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలకు పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టిన వారి బండారం బయట పడింది

ఆశీలు ఎగవేత

వైసీపీ హయాంలో కాంట్రాక్టర్ల దందా

ఆ కాంట్రాక్టర్లపై మున్సిపాలిటీ కేసులు

ఇప్పటికే రెండుసార్లు వేలంపాట రద్దు

తాడేపల్లిగూడెంలో అధికారులు మల్లగుల్లాలు

నేడు మరోసారి వేలంపాటకు చర్యలు

మున్సిపాలిటీలకు మార్కెట్‌ పన్ను ప్రధాన ఆదాయంగానే పరిగణిస్తారు. వేలంపాట నిర్వహించి మార్కెట్‌ పన్ను వసూలు చేయడానికి లైసెన్స్‌ మంజూరు చేస్తారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ విధానం అమలులో ఉంది. గత ప్రభుత్వ హయాంలో పన్ను వసూళ్లు పక్కదారి పట్టాయి. లైసెన్స్‌దారులు మున్సిపాలిటీలకు పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి) :

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలకు పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టిన వారి బండారం బయట పడింది. సదరు మున్సిపాలిటీలో రెండేళ్ల పాటు లైసెన్స్‌దారులు సొమ్ములు పూర్తిస్థాయిలో చెల్లించలేదు. అయినా అప్పటి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. వైసీపీ నేతల ఒత్తిళ్లతో మిన్నకుండి పోయారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రికార్డులు వెలికితీశారు. పన్ను బకాయిలు చెల్లించని లైసెన్స్‌దారులపై కోర్టులో కేసు వేశారు.

తగ్గిన ఆదాయం

వాస్తవానికి గత తెలుగుదేశం హయాంలో ఒకేసారి మార్కెట్‌ పన్ను ఆదాయం పెరిగింది. అప్పటివరకు సిండికేట్‌గా మారి కొద్ది మొత్తానికే పాట పాడేవారు. లైసెన్స్‌ దక్కించుకునేవారు. మున్సిపాలిటీకి కనీసం రూ.10లక్షల ఆదా యం రావడం గగనమయ్యేది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మార్కెట్‌ ఆశీలు పన్ను పాట రూ. 62 లక్షలకు చేరింది. లైసెన్స్‌ దక్కించుకున్నవారు సక్ర మంగా సొమ్ములు చెల్లిం చేవారు. వైసీపీ హ యాంలో మార్కెట్‌ ఆశీలు పాట పక్కదారి పట్టింది. లైసెన్స్‌ దారులు బకాయిలు చెల్లించక పోయినా సరే అధికారులు చెతులెత్తేశారు. మరోవైపు మార్కెట్‌ పన్ను ఆదాయం తగ్గిపోవడంతో తాజాగా ఎవరూ వేలంపాటలో పాల్గొనడం లేదు. గత ఏడాది రూ. 18.20 లక్షల ఆదాయం మాత్రమే లభించింది. గత ఏడాది అక్టోబరు వరకు మున్సిపాలిటీ పన్ను వసూలు చేసింది. దాదాపు రూ.7.30 లక్షల పన్ను సమకూరింది. ఆ తర్వాత తాత్కాలికంగా లైసెన్స్‌దారునికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు రూ.10.99లక్షలు మున్సిపాలిటీకి చెల్లించారు. ఐదు నెలల్లోనూ దాదాపు రూ. 11.00 లక్షలు ఆదాయం వచ్చింది. అయినా సరే కొత్తగా ఏ ఒక్కరూ పాటలో పాల్గొనడం లేదు. బకాయిలు చెల్లించకుండా డిఫాల్టరైన లైసెన్స్‌దారులపై కేసులు నమోదు చే శారు.

పన్ను బకాయి ఇలా

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 2022–23లో రూ. 33.60 లక్షలకు మార్కెట్‌ ఆశీలు పాడుకున్నారు. మున్సిపాలిటీకి ఆ ఏడాది రూ. 24.80 లక్షలు మాత్రమే చెల్లిం చారు. మరో రూ. 9.00 లక్షలు బకాయి పడ్డారు. ఆ మరుసటి ఏడాది పాట రూ. 63.94 లక్షలకు వెళ్లింది. లైసెన్స్‌ దక్కింకున్న కాంట్రాక్టర్‌ రూ.28.33 లక్షలు చెల్లించారు. మరో రూ. 35.60 లక్షలు బకాయి పడ్డారు. మొత్తంపైన రెండేళ్లపాటు మున్సిపాలిటీకి రూ. 42 లక్షల బకాయి రావాల్సి ఉంది. మున్సిపల్‌ అధికారులు పట్టించుకోలేదు. వైసీపీ నేతల ఒత్తిడితో మీనమేషాలు లెక్కించారు.

రెండుసార్లు వేలంపాట రద్దు

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 2025–26 సంవత్సరానికి వేలంపాట నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్‌లు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. రెండు పర్యాయాలు పాటను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నెల 25వ తేదీన మరోసారి వేలం పాట నిర్వహిం చేందుకు మున్సిపాలిటీ చర్యలు తీసుకుంది. అప్పటికీ స్పందించకపోతే రెవెన్యూశాఖ పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. లేదంటే మున్సి పాలిటీ పన్ను ఆదాయం తగ్గించుకుని వేలంపాటకు వెళ్లాలి. కాంట్రాక్ట ర్‌లనుంచి స్పందన లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:20 AM