Share News

‘టెన్‌’్త మూల్యాంకనమూ ఓ పరీక్షే !

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:56 PM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను సజావుగా నడిపించడం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఓ పరీక్షలా మారింది. మూల్యాంకన విధుల నుంచి మినహాయింపునకు ఉపాధ్యాయులు సమర్పిస్తున్న అభ్యర్థనలు, మెడికల్‌ సర్టిఫికెట్లు విస్తుపోయేలా ఉండడంతో అధికారులు గందరగోళంలో ఉన్నారు

‘టెన్‌’్త మూల్యాంకనమూ   ఓ పరీక్షే !

విధుల మినహాయింపునకు టీచర్ల దొడ్డిదారి ప్రయత్నాలు

స్వల్పకాలిక అనారోగ్యానికి దీర్ఘకాలిక రోగ మెడికల్‌ సర్టిఫికెట్లు

టీచర్‌ సంఘాల నాయకుల రికమండేషన్లు

వందల సంఖ్యలో విధుల మినహాయింపునకు అభ్యర్థనలు

గందరగోళంలో జిల్లా విద్యాశాఖ అధికారులు

ఏలూరు అర్బన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను సజావుగా నడిపించడం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఓ పరీక్షలా మారింది. మూల్యాంకన విధుల నుంచి మినహాయింపునకు ఉపాధ్యాయులు సమర్పిస్తున్న అభ్యర్థనలు, మెడికల్‌ సర్టిఫికెట్లు విస్తుపోయేలా ఉండడంతో అధికారులు గందరగోళంలో ఉన్నారు కీళ్ల నొప్పికి గుండె జబ్బు ద్రువీకరణపత్రం, స్వల్పకాలిక అనారోగ్యానికి దీర్ఘకాలిక రోగ మెడికల్‌ సర్టిఫికెట్‌... ఈవిధంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన విధులనుంచి మినహాయింపునకు కొందరు టీచర్లు సమర్పించిన అభ్యర్థనలు. వీటితో పాటు తమ యూనియన్లకు చెందిన ఉపాధ్యాయులంటూ మరికొందరు టీచర్‌ సంఘాల నాయకులు తెచ్చిపడేస్తున్న రికమండేషన్లు మరికొన్ని. మరోవైపు రెగ్యులర్‌ పరీక్షల జవాబుపత్రాలతోపాటే ఏకకాలంలో సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య టెన్త్‌ పరీక్షల పత్రాలనుకూడా మూల్యాంకన చేయాల్సిన పరిస్థితులు. ఈ క్రమంలో ఏప్రిల్‌ మూడు నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి మూల్యాంకన ప్రక్రియను సక్రమంగా నిర్వహించడం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఓ పరీక్షలా మారింది. పలు జిల్లాలనుంచి సుమారు 1.84 లక్షల ఆన్సర్‌ స్ర్కిప్టులు మూల్యాంకన నిమిత్తం ఏలూరు జిల్లాకు కేటాయించే అవకాశాలున్నాయి. వీటికి దూరవిద్య టెన్త్‌ జవాబుపత్రాలు అదనం. నిర్ధేశిత షెడ్యూలు ప్రకారం మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు జరగాల్సిఉంది. ఆన్సర్‌ స్ర్కిప్టుల మూల్యాంకనానికి అన్ని సబ్జెక్టులనుంచి సుమారు 2,100 మంది స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ ఉపాధ్యాయులు అవసరం ఉందని గుర్తించారు. జిల్లాలోని అన్ని హైస్కూళ్లు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2,162మంది స్కూల్‌ అసిస్టెంట్లు అన్ని సబ్జెక్టుల్లో ఉన్నారు. ఆ ప్రకారం రెగ్యులర్‌ విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనానికి కావలసిన స్కూల్‌ అసిస్టెంట్లకు స్పాట్‌ వాల్యూయేషన్‌ విధులు కేటాయిస్తే, ఇంకా 62మంది మాత్రమే ఉంటారు. వీరిలో పలువురు ఇప్పటికే మెడికల్‌ లీవులు, ఇతర కారణాలపై సెలవులపై ఉన్నారు. ఇక మిగిలివున్న స్కూల్‌ అసిస్టెంట్లందరికీ మూల్యాంకన విధులు కేటాయించాల్సిన తప్పని పరిస్థితులున్నాయి.

వందల సంఖ్యలో అభ్యర్థనలు

తాజా పరిణామాలు పరిశీలిస్తే మూల్యాంకన విధులకు మినహాయింపులుకోరే అభ్యర్థనలు వందలసంఖ్యలోనే ఉన్నాయి. ఇవి ఇంకా వస్తూనేఉన్నాయి. నిబంధనల ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులు, తీవ్ర అనారోగ్యం, ఇతర సహేతుక కారణాలపై స్పాట్‌ విధులనుంచి మినహాయింపులు ఇచ్చే అధికారం విద్యాశాఖకు ఉంది. ఈ కోవలోనే మినహాయింపుల నిమిత్తం పలువురు టీచర్లు అభ్యర్థనలకు జతచేసిన వైద్యద్రువీకరణ పత్రాలను పరిశీలించిన విద్యాశాఖ అధికారులు విస్తుపోయేలా కొన్ని పత్రాలున్నాయి. నిజంగా తీవ్ర అనారోగ్యపరిస్థితుల్లో వున్న వారికి మినహాయింపులు ఇవ్వడంలో అభ్యంతరాలు చెప్పబోమని, కాని కొందరు మూల్యాంకన విధులకు దూరంగా ఉండేందుకు తెస్తున్న ఒత్తిళ్లతో స్పాట్‌ వాల్యూయేషన్‌ను ఎలా నిర్వహించగలమని విద్యాశాఖ సందేహిస్తోంది. దూరవిద్య టెన్త్‌ జవాబు పత్రాలను మూల్యాంకన చేయాల్సి రావడం ఉపాధ్యాయుల కొరతను మరింతగా పెంచుతోంది.

జిల్లా విద్యాశాఖ వర్గాలను దీనిపై వివరణ కోరగా ‘నిబంధనల ప్రకారమే స్పాట్‌ విధులనుంచి మినహాయింపులపై నిర్ణయం తీసుకుంటాం. సహేతుక కారణాలులేకుండా మూల్యాంకన విధులకు రాలేమంటే ఒప్పుకోం. పరిమితులతోకూడిన మినహాయింపులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాం. అర్హులైన వారి తోనే మూల్యాంకన జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటాం. ఎవరి ఒత్తిళ్లకూ లొంగేదిలేదు. ఇప్పటివరకు ఎవరికీ మినహాయింపులు ఇవ్వలేదు.’ అని వివరించాయి.

Updated Date - Mar 27 , 2025 | 11:59 PM