ప్రత్యామ్నాయ రోడ్లతోనే సమస్యలకు చెక్
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:34 AM
తణుకు పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటే ప్రత్యామ్నాయ రోడ్లను అభివృద్ధి చేయడమే శరణ్యంగా కనిపిస్తుంది.

తణుకు పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు
ఇరుకు రోడ్లతో ప్రజలు, వాహనదారులకు తప్పని ఇబ్బందులు
ప్రధానంగా రాష్ట్రపతి రోడ్డుపైనే కొనసాగిస్తున్న రాకపోకలు
ప్రత్యామ్నాయ రోడ్ల అభివృద్ధితోనే ట్రాఫిక్ సమస్యల పరిష్కారం
తణుకు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : తణుకు పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటే ప్రత్యామ్నాయ రోడ్లను అభివృద్ధి చేయడమే శరణ్యంగా కనిపిస్తుంది. పట్టణంలోని ఎక్కడకు వెళ్లాలన్నా ప్రధానంగా రాకపోకలు చేసేది రాష్ట్రపతి రోడ్డు ఒక్కటే. ఆ రోడ్డు ఉదయం, సాయంత్రం చాలా రద్దీగా ఉంటుంది. వందల సంఖ్యలో కార్లు, మోటారు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రోడ్డులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. తణకు పరిసరల ప్రాంతాల పరిధిలో ఉన్న వారు పలు పనులపై వచ్చే వాహనాలతో పాటు స్కూళ్లు, కాలేజీలకు చెందిన బస్సుల తాకిడి ఎక్కువే. పట్టణంలో నిత్యం 80 వేల మంది విద్య, వైద్య, వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. రాష్ట్రపతి రోడ్డు, వేల్పూరు రోడ్డు, స్ర్తీ సమాజం రోడ్డు, డీఎల్‌కే రోడ్డు, పెరవలి, తాడేపల్లిగూడెం, ఇరగవరం రోడ్లతో పాటు భీమవరం జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు రాష్ట్రపతి రోడ్డు మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ రోడ్డు ఒకటే కావడం వల్ల ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఇబ్బందులు తప్పడం లేదు. 2014–19 సంవత్సరంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్రపతి రోడ్డు, వేల్పూరు రోడ్డు విస్తరణ చేసి కాస్తంత ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.
వంతెనపైనే పార్కింగ్
పట్టణంలో సంతమార్కెట్‌కు వెళ్లే వారి వాహనాలకు పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఆదివారం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చి గోస్తనీ వంతెన మీద వాహనాలు పార్కింగ్ చేస్తుంటారు. వంతెనపై సగం స్థలం వరకు పార్కింగ్ చేయడం వల్ల మార్కెట్‌లోకి వచ్చిపోయే వారు కనీసం నడవడానికి ఇబ్బందులు తప్పడం లేదు. మునిసిపల్ అధికారులు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించే పరిస్థితి అక్కడ లేదు. చుట్టూ మార్కెట్ ఉన్న ప్రాంతం దుకాణాలతో నిండిపోయి ఉంటుంది. అటువైపు శ్మశానాలు దాటిన తర్వాత ఉన్న రోడ్డు పక్క స్థలంలో వాహనాలు పార్కింగ్ చేసేవిధంగా చర్యలు తీసుకుంటే కొంతమేరకు తాకిడి తగ్గుతుంది.
డీఎల్‌కే రోడ్డు అభివృద్ధి చేయాలి
ప్రధాన రహదారికి అనుబం ధంగా ఉన్న డీఎల్‌కే రోడ్డును అభివృద్ధి చేయాలి. ఇప్పటికే ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విశేషంగా కృషి చేస్తున్నారు. సీఎంకు రోడ్డు అవసరాన్ని చెప్పి నిధులు మంజూరు చేయాలని కోరారు.
– తాతపూడి మారుతీరావు, తణుకు.
ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు
ప్రజలకు ప్రతి నిత్యం ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ట్రాపిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కచ్చితంగా ఇబ్బందులు తొలగాలంటే ఇతర రోడ్లను ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయాలి.
– గమిని రామచంద్రరావు, తణుకు.
కాలువ గట్టు అభివృద్ధి చేయాలి
హౌసింగ్ బోర్డు కాలనీకి పక్కనే ఉన్న కాలువ గట్టును అభివృద్ధి చేయాలి. దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగక రంగా ఉంటుంది. తాడేపల్లిగూడెం వైపు నుంచి వచ్చే వాహనదారులకు రాకపోకలకు అనువుగా కాలువ గట్టు అభివృద్ధితో ప్రయాణం సులువుగా ఉంటుంది.
– బొల్లెంపల్లి ప్రభాకరరావు, తణుకు.
ఇతర మార్గాలపై దృష్టి పెట్టాలి
పట్టణంలోకి ఉదయం, సాయంత్రం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.. పల్లెలు, పట్టణాల నుంచి పలు పనుల నిమిత్తం వచ్చిన వారంతా రాష్ట్రపతి రోడ్డు మీదుగా రావడం వల్ల సమస్య ఎక్కువగా ఉంది. దీని నివారణకు ఇతర రోడ్డు మార్గాలపై దృష్టి సారించి అభివృద్ధి చేయాలి
– ఒమ్మి రాంబాబు, తణుకు.