ఉగాది ఉత్సవం
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:22 AM
చిన్న తిరుపతి శ్రీవారి దివ్య క్షేత్రంలో స్వామివారికి ఉగాది ఉత్సవం ఆదివారం రాత్రి కడురమణీయంగా జరిగింది.

విశ్వావసు నామ సంవత్సరం సకల శుభకరం
ఏలూరు గిరిజన భవన్‌లో అధికారిక కార్యక్రమం
పంచాంగ శ్రవణం.. పండితులకు సత్కారం
ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్రం ఉగాది మండపంలో ప్రత్యేక పూజలు
జిల్లాలోని ఆలయాల్లో భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల, మార్చి30 (ఆంధ్రజ్యోతి): చిన్న తిరుపతి శ్రీవారి దివ్య క్షేత్రంలో స్వామివారికి ఉగాది ఉత్సవం ఆదివారం రాత్రి కడురమణీయంగా జరిగింది. గరుడాళ్వార్ కూడలిలోని ఉగాది మండపంలో ఆలయ అర్చకులు వైభవోపేతంగా వేడుక నిర్వహిం చారు. ఆలయంలో ఉభయదేవేరులు, గోదాదేవితో కలసిన శ్రీవారి ఉత్సవమూర్తులను సాయంత్రం వెండి శేషవాహనంపై ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారం చేశారు. అనంతరం మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు. అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణ నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా శ్రీవారు కొలువుదీరిన వాహనం ఉగాది మండపం వద్దకు తరలివెళ్లింది.
అర్చకుల వేదమంత్రోచ్ఛరణ నడుమ శేషవాహనంపై అట్టహాసం గా మండపం వద్దకు చేరుకున్న స్వామి, అమ్మవార్లకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో రజిత సింహాసనంపై శ్రీవారిని ఉంచి అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఆలయ చైర్మన్ రాజా ఎస్‌వీ సుధాకరరావు ఆధ్యర్యంలో ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి, ఈఈ భాస్కర్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించాశారు. పండితులు పంచాంగ శ్రవణం చేసి రాశి ఫలాలను చదివి భక్తులకు వినిపించారు. ఆ తర్వాత పండితులు, దాతలకు సత్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
ఏలూరు గిరిజన భవన్‌లో..
ఏలూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఏలూరు గిరిజన భవన్‌లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు సంప్రదాయ వస్ర్తాలను ధరించి హాజరయ్యారు. పండితుల మంత్రోచ్ఛరణ నడుమ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉగాది వేడుకలను ప్రారంభించారు. గండికోట రాజేష్ శిష్యబృందం, ఐటీడీఏ బాలికల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జఠావల్లభుల సాయిరామ్ ఆధ్వర్యంలో ఇలింద్రపర్తి శ్రీనివాసరావు, డాక్టర్ విప్పర్తి ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, పట్టా సుదర్శనాచార్యుల కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. సుదర్శన శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఐటీడీఏ పీవో రాములు, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రంగారావు, సెట్వెల్ సీఈవో ప్రభాకర్, ఉద్యానశాఖ డీడీ ఎస్.రామ్మోహన్, జిల్లా వ్యవసాయశాఖ జేడీ హబీబ్ భాషా, డీఈవో పి.లక్ష్మమ్మ, ఐసీడీఎస్ పీడీ పి.శారద, జలవనరులశాఖ ఎస్‌ఈ పి.నాగార్జునరావు, సహాయ పర్యాటకశాఖ అధికారి పట్టాభి, డీపీఆర్‌వో ఆర్‌వీఎస్ రామచంద్రరావు పాల్గొన్నారు.