Akbaruddin Owaisi: ‘తెలంగాణ రైజింగ్’లో పాత బస్తీకి చోటేదీ?
ABN , Publish Date - Mar 28 , 2025 | 03:40 AM
పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు అంతా నగరం వెలుపలే అంటున్నారని చెప్పారు. వచ్చే పదేళ్లలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెచ్చుకోవడానికి రూపొందించిన ప్రణాళికలో హైదరాబాద్ దక్షిణ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరారు.

పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు సిటీ బయటేనా?
గుజరాత్‌లో ముస్లింలు బీసీ జాబితాలోనే ఉన్నారు
పదేళ్లుగా ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షి్‌పలు ఇవ్వట్లేదు: అక్బరుద్దీన్
హైదరాబాద్, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రైజింగ్’ ప్రణాళికలో ప్రభుత్వం పాత బస్తీకి చోటెక్కడ ఉందని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు అంతా నగరం వెలుపలే అంటున్నారని చెప్పారు. వచ్చే పదేళ్లలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెచ్చుకోవడానికి రూపొందించిన ప్రణాళికలో హైదరాబాద్ దక్షిణ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఫ్యూచర్ సిటీ, ఫార్మా విలేజీలు, ఐటీ కారిడార్లు అంటూ కొత్త విజన్ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. పాత బస్తీపై తన విజన్ ఏంటో చెప్పాలని కోరారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో అక్బర్ మాట్లాడుతూ ముస్లింల పిల్లలకు ఉద్యోగాలు ఎటూ ఇవ్వడం లేదని, కనీసం గౌరవంగా బతకడానికైనా అవకాశం ఇవ్వాలన్నారు. హాకర్ పాలసీ అమలు చేస్తే కనీసం రోజూ రొట్టె అయినా తినడానికి లభిస్తుందన్నారు.
గత ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షి్‌పలు ఇవ్వలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్నట్లే మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రీ మెట్రిక్ స్కాలర్‌షి్‌పలు ఇవ్వాలని కోరారు. కులీకుతుబ్ షాహీ అభివృద్ధి సంస్థకు నిధులు ఇవ్వాలని, పాత బస్తీని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి, చార్మినార్, ముర్గిచౌక్, మీరాలంమండీ ప్రాంతాల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.వంద కోట్లు కేటాయించాలని కోరారు. గత ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధుల్లో మిగతా రూ.1,800కోట్లు ఏప్రిల్‌లోపు విడుదల చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, ముస్లింలలో కొందరు బీసీ వర్గానికి చెందిన వారేనని అన్నారు. గుజరాత్‌లో ముస్లింలు బీసీ జాబితాలోనే ఉన్నారని, ఇక్కడి బీజేపీ నేతలు ఎందుకు అభ్యంతరం చెపుతున్నారని ప్రశ్నించారు. ఆలేరు ఎన్‌కౌంటర్ విచారణ నివేదిక ఏమైందని అడిగారు.
ఇవి కూడా చదవండి...
ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News And Telugu News