Share News

Pre-Arrest Bail: మద్యం స్కాం కేసులో.. హైకోర్టుకు మిథున్‌రెడ్డి

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:54 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.

Pre-Arrest Bail: మద్యం స్కాం కేసులో.. హైకోర్టుకు మిథున్‌రెడ్డి

  • ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని వినతి

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది సెప్టెంబరు 23న సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశారు. ‘ఈ కేసులో నన్ను నిందితుడిగా చేర్చినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా చేసిన సత్యప్రసాద్‌ మేజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన 164 స్టేట్‌మెంట్‌ను సైతం పత్రికల్లో ప్రచురించారు. కొన్ని మద్యం కంపెనీలకు అనుచిత లబ్ది, మరికొన్నింటికి నష్టం జరిగేలా లావాదేవీలన్నింటనీ నేనే పర్యవేక్షించినట్లు అందులో ఆరోపించారు.


రాజకీయ ప్రతీకారంతో దర్యాప్తు సంస్థ దురుద్దేశపూర్వకంగా నన్ను నిందితుడిగా చేర్చింది. ఏక్షణంలోనైనా అరెస్టు చేస్తారని ఆందోళనగా ఉంది. ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ నాపై పెట్టిన సెక్షన్లు చెల్లుబాటు కావు. దర్యాప్తునకు సహకరిస్తాను. ఏప్రిల్‌ 4వరకు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఉన్నాయి. లోక్‌సభకు హాజరు కావాలి. ముందస్తు బెయిల్‌ ఇవ్వండి’ అని కోరారు.

Updated Date - Mar 18 , 2025 | 04:54 AM