Share News

ధరలు పెంచేసి.. జనాన్ని బాదేసి!

ABN , Publish Date - Mar 13 , 2025 | 03:36 AM

ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్‌ వైర్లు, కెపాసిటర్లు తదితర విద్యుత్‌ పరికరాలను డిస్కమ్‌లు పొరుగు రాష్ట్రాల కంటే రెట్టింపు ధరలకు కొనుగోలు చేశాయి.

ధరలు పెంచేసి.. జనాన్ని బాదేసి!

  • జగన్‌ జమానాలో విద్యుత్‌ పరికరాలకు రూ.20 వేల కోట్ల అదనపు చెల్లింపులు

  • సమగ్ర దర్యాప్తునకు నిపుణుల డిమాండ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్‌ వైర్లు, కెపాసిటర్లు తదితర విద్యుత్‌ పరికరాలను డిస్కమ్‌లు పొరుగు రాష్ట్రాల కంటే రెట్టింపు ధరలకు కొనుగోలు చేశాయి. జనంపై దాదాపు రూ.20,000 కోట్ల అదనపు భారం మోపాయి. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని విద్యుత్‌ రంగ నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు. 2019-24 మధ్య ఏపీ జెన్కో కేంద్రాలను ‘బ్యాకింగ్‌ డౌన్‌’ చేశారు. అంటే విద్యుదుత్పత్తి తగ్గించేశారు. విచ్చలవిడిగా బహిరంగ మార్కెట్లో కరెంటు కొన్నారు. అత్యధిక ధరలకు ట్రాన్స్‌ఫార్మర్లు, కెపాసిటర్లు, విద్యుత్‌ తీగలు, సిమెంట్‌ పోల్స్‌ కొనుగోలు చేశారు. ఇందుకైన రూ.20 వేల కోట్ల అదనపు వ్యయాన్ని ట్రూఅప్‌ చార్జీల పేరిట ప్రజల నెత్తినే రుద్దారు. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. డిస్కమ్‌ల విచ్చలవిడి కొనుగోళ్లతో ఆ ఐదేళ్లలో రూ.32,166 కోట్ల మేర ట్రూఅప్‌ చార్జీల భారాన్ని ప్రజలు మోయాల్సి వచ్చిందని అందులో పేర్కొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 03:36 AM