Share News

బెయిన్‌ క్యాపిటల్‌కు మణప్పురంలో 18% వాటా

ABN , Publish Date - Mar 21 , 2025 | 02:17 AM

బంగారం తాకట్టుపై రుణాలిచ్చే మణప్పురం ఫైనాన్స్‌లో 18 శాతం వాటాను రూ.4,385 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బెయిన్‌ క్యాపిటల్‌...

బెయిన్‌ క్యాపిటల్‌కు  మణప్పురంలో 18% వాటా

డీల్‌ విలువ రూ.4,385 కోట్లు

న్యూఢిల్లీ: బంగారం తాకట్టుపై రుణాలిచ్చే మణప్పురం ఫైనాన్స్‌లో 18 శాతం వాటాను రూ.4,385 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బెయిన్‌ క్యాపిటల్‌ గురువారం వెల్లడించింది. ఈ డీల్‌ ద్వారా బెయిన్‌ క్యాపిటల్‌.. మణప్పురం ఫైనాన్స్‌ ప్రమోటర్లలో ఒకటిగా మారడంతో పాటు ఉమ్మడి నియంత్రణ హక్కులు సైతం దక్కించుకోనుంది. ఈక్విటీ, వారంట్ల ఫ్రిఫరెన్షియల్‌ కేటాయింపుల ద్వారా ఈ లావాదేవీ జరగనుంది. ఇందులో భాగంగా మణప్పురం ఫైనాన్స్‌లో 18 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటీ రూ.236 చొప్పున కొనుగోలు చేయనుంది. సంస్థ షేరు 6 నెలల సగటు ట్రేడింగ్‌ ధరతో పోలిస్తే 30 శాతం అధికమిది. ఈ ఒప్పందం అనంతరం మణప్పురం వ్యవస్థాపక ప్రమోటర్‌ వీపీ నందకుమార్‌, ఆయన కుటుంబం కంపెనీలో 28.9 శాతం వాటా కలిగి ఉండనుంది.


మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌: ఈ డీల్‌తో సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా షేర్ల కొనుగోలుకు బెయిన్‌ క్యాపిటల్‌ తప్పనిసరి ఓపెన్‌ ఆఫర్‌ను సైతం ప్రకటించింది. ఓపెన్‌ ఆఫర్‌ ధరనూ ఒక్కోషేరుకు రూ.236గా నిర్ణయించారు. ఓపెన్‌ ఆఫర్‌ పూర్తయ్యాక మణప్పురంలో బెయిన్‌ క్యాపిటల్‌ వాటా 41.7 శాతానికి పెరిగే అవకాశం ఉంది. కేరళకు చెందిన మణప్పురం ఫైనాన్స్‌ 1949లో ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలోనే రెండో అతిపెద్ద గోల్డ్‌ లోన్‌ కంపెనీ ఇది. దేశవ్యాప్తంగా 5,357 శాఖలను నిర్వహిస్తోంది. వీటిల్లో 50,795 మంది పనిచేస్తున్నారు. 65.9 లక్షల మంది కస్టమర్లకు సేవలందిస్తోంది. మణప్పురం ఫైనాన్స్‌ తన వ్యాపారాన్ని బంగారం తాకట్టు రుణాల నుంచి సూక్ష్మ రుణాలు, వాహన రుణాలు, గృహ రుణాలు, ఎస్‌ఎంఈ రుణాల విభాగాల్లోకీ విస్తరించింది.

Also Read:

Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం

CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..

For Business News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 02:17 AM