IPO Calender: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కు కొత్త జోష్.. 4 ఐపీవోలు, 5 లిస్టింగ్స్
ABN , Publish Date - Mar 22 , 2025 | 09:49 PM
భారత స్టాక్ మార్కెట్స్ లోకి వచ్చే వారం నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. ఇవన్నీ స్మాల్ అండ్ మీడియం సెక్టార్ కి సంబంధించినవే. దీంతోపాటు ఇప్పటికే మార్కెట్ నుంచి ఐపీవోల ద్వారా నిధులు సమీకరణ పూర్తి చేసుకున్న ఐదు సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.

భారత స్టాక్ మార్కెట్స్ లోకి వచ్చే వారం నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. ఇవన్నీ స్మాల్ అండ్ మీడియం సెక్టార్ కి సంబంధించినవే. దీంతోపాటు ఇప్పటికే మార్కెట్ నుంచి ఐపీవోల ద్వారా నిధులు సమీకరణ పూర్తి చేసుకున్న ఐదు సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. డివైన్ హీరా జ్యువెలర్స్, పరదీప్ పరివాహన్ మార్చి 24న స్టాక్ ఎక్సేంజ్ లలో లిస్ట్ కానున్నాయి. గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్ షేర్స్ మార్చి 27న, యాక్టివ్ ఇన్‌ఫ్రాస్టక్చర్, ర్యాపిడ్ ఫ్లీట్ షేర్లు మార్చి 28న మార్కెట్లోకి రానున్నాయి. ఇక వచ్చే వారం ఐపీవోకి రాబోతోన్న ఆయా కంపెనీల వివరాలు చూద్దాం.
1. మార్చి 24 సోమవారం డెస్కో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ (Desco Infratech IPO) ఐపీఓకు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్ మార్చి 26తో ముగుస్తుంది. ధరల శ్రేణి రూ.147- 150గా కంపెనీ నిర్ణయించింది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, వాటర్ అండ్ పవర్ వంటి వివిధ రంగాలలో ఇంజినీరింగ్, ప్లానింగ్, కనస్ర్టక్షన్ వంటి సర్వీసులందిస్తోందీ కంపెనీ. ఐపీఓ ద్వారా రూ.30.75 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా 20.50 లక్షల తాజా వాటాలను జారీ చేయనున్నారు. ఏప్రిల్ 1న షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి.
2. మార్చి 25 మంగళవారం శ్రీ అహింస నేచురల్స్ (Shri Ahimsa Naturals) పబ్లిక్ ఇష్యూ మొదలై మార్చి 27తో ముగుస్తుంది. ధరల శ్రేణిని రూ.113- 119గా కంపెనీ నిర్ణయించింది. గ్రీన్ కాఫీ బీన్స్, గ్రీన్ టీ వంటి ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేస్తుందీ కంపెనీ. మొత్తం రూ.73.81 కోట్లు సమీకరణ లక్ష్యంగా ఈ ఐపీవో వస్తోంది. దీనిలో భాగంగా 42.04 లక్షల తాజా షేర్లు జారీ చేయనున్నారు. 19.99 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తారు. ఏప్రిల్ 1న ఇవి స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.
3. మార్చి 25 మంగళవారం నాడే ఏటీసీ ఎనర్జీ సిస్టమ్(ATC Energies System) అనే ఐపీవో కూడా సబ్‌స్క్రిప్షన్ మొదలుకానుంది. మార్చి 27తో ముగుస్తుంది. ధరల శ్రేణిని రూ.112- 118గా కంపెనీ ప్రకటించింది. ఇంధన రంగంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటైన ATC ఎనర్జీస్, లిథియం-అయాన్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.63.76 కోట్లు సమీకరించేందుకు 43.24 లక్షల తాజా షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 10.80 లక్షల షేర్లు జారీ చేయబోతోంది. ఏప్రిల్ 2న ఇవి మార్కెట్లో లిస్ట్ కాబోతున్నాయి.
4.మార్చి 26 బుధవారం ఐడెంటిక్స్‌వెబ్ (Identixweb) ఐపీఓకు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్ మార్చి 28తో ముగుస్తుంది. ధరల శ్రేణి రూ.51-54గా కంపెనీ ప్రకటించింది. రూ.16.63 కోట్లు సమీకరించాలనే ఉద్దేశంలో పబ్లిక్ ఇష్యూలో భాగంగా 30.80 లక్షల షేర్లు జారీ చేయనుంది. ఏప్రిల్ 3న ఇవి మార్కెట్లో లిస్ట్ అవుతాయి.
5. ఐపీవో ద్వారా రూ.550 కోట్లు సమీకరించేందుకు ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా లిమిటెడ్ బీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ప్రతిపాదిత ఐపీవో కింద రూ.300 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ.250 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. తాజా ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ప్లాంటు, మెషినరీ కొనుగోలు, కార్పొరేట్ అవసరాలకు కంపెనీ ఉపయోగించనుంది.