మార్చి 31 కౌంట్‌డౌన్ షురూ..
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:32 AM
ఈ నెలాఖరుతో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇందుకు మరికొన్ని రోజులే మిగిలి ఉంది. మార్చి 31 డెడ్‌లైన్ ఈ ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన పన్ను ఆదా చేసేందుకు చివరి...

పన్ను ఆదా చర్యలు చేపట్టారా మరి..?
ఈ నెలాఖరుతో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇందుకు మరికొన్ని రోజులే మిగిలి ఉంది. మార్చి 31 డెడ్‌లైన్ ఈ ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన పన్ను ఆదా చేసేందుకు చివరి అవకాశం కూడా. ఇందుకు మీ ముందున్న ఐదు మార్గాలు..
పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడులు: అధికాదాయం కలిగిన వారు పన్ను రాయితీ ప్రయోజనాలందించే ఆర్థిక పథకాల్లో పెట్టుబడులు పెట్టడం మేలు. ఎందుకంటే, ఆదాయం పన్ను చట్టంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకు ఈక్విటీ అనుసంధానిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎ్‌సఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎ్‌స) తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్‌పీఎ్‌స పెట్టుబడులపైన 80సీసీడీ(1బీ) కింద అదనంగా రూ.50,000 మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. అద్దెకు ఉంటున్న వారిలో ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) ప్రయోజనాలు లభించనివారు సెక్షన్ 80జీజీ కింద అదనపు మినహాయింపు సైతం క్లెయిమ్‌చేసుకోవచ్చు.
రిటర్నులు అందించని పెట్టుబడులకు స్వస్తి: ఈ ఆర్థిక సంవత్సరం ఈక్విటీ ఇన్వెస్టర్లకు అంతగా కలిసిరాలేదు. 2024 -25లో నిఫ్టీ కేవలం 3 శాతం వృద్ధిని మాత్రమే కనబరిచింది. ఇలాంటి ప్రతికూల సమయాల్లో అంతగా రిటర్నులు పంచని లేదా నష్టాల్లో ఉన్న ఈక్విటీ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా అధిక ప్రతిఫలాలు లభించిన ఆస్తులపై చెల్లించాల్సిన పన్ను (క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్)ను తగ్గించుకోగలిగే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అలాగే, పన్ను చెల్లింపుదారులు స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ల విక్రయంపై రూ.లక్ష వరకు దీర్ఘకాలిక మూలధన ఆర్జన పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలిగే అవకాశాలను పరిశీలించండి. తద్వారా పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ పెట్టుబడులపై లాభాలను స్వీకరించవచ్చు.
సకాలంలో ముందస్తు పన్ను చెల్లింపులు: రూ.10,000కు పైగా పన్ను చెల్లించాల్సిన వారు ముందస్తుగా పన్ను చెల్లించడం తప్పనిసరి. ప్రతి త్రైమాసికానికి ఒకసారి చొప్పున నాలుగు విడతల్లో ముందస్తు పన్ను చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. చివరి విడత గడువు మార్చి 15. ఒకవేళ తక్కువగా చెల్లిస్తే, మార్చి 31 నాటికి మిగతా మొత్తాన్ని జమ చేయవచ్చు. ఈ గడువు దాటితే, చెల్లింపులు జరిపే వరకు లేదా ఆదాయం పన్ను రిటర్నులు (ఐటీఆర్) సమర్పించే వరకు నెలకు 1 శాతం వడ్డీ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.
ఉద్యోగం మారిన పక్షంలో ఆదాయ వివరాల అప్‌డేట్: ఐటీ చట్టంలో నిబంధన 26ఏ ప్రకారం.. ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారిన వారు గత సంస్థ నుంచి అందుకున్న ఆదాయాన్ని ఫామ్ 12బీ ద్వారా కొత్తగా చేరిన కంపెనీ మేనేజ్‌మెంట్‌కు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. కొత్త యాజమాన్యం మీ జీతం నుంచి సరైన పన్ను మొత్తాన్ని మినహాయించేందుకు ఇది దోహదపడుతుంది. సకాలంలో ఫామ్ 12బీ సమర్పించడం ద్వారా ఆ ఏడాది ఆదాయం వెల్లడిలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, రిటర్నుల ఫైలింగ్ సంక్లిష్టం కాకుండా జాగ్రత్తపడవచ్చు.
ఆరోగ్య బీమా కొనుగోలు: ఆరోగ్య బీమా పథకం కొనుగోలుతో వైద్య అత్యవసరాల్లో కవరేజీ లభించడంతో పాటు పన్ను కూడా ఆదా అవుతుంది. సెక్షన్ 80డీ ప్రకారం.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంలో సాధారణ వ్యక్తులు రూ.25,000, సీనియర్ సిటిజన్లు రూ.50,000 వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Earth Hour 2025: ఈరోజు ఎర్త్ అవర్..ఈ టైంలో కరెంట్ బంద్ చేసి, ప్రకృతికి సహకరిద్దాం..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News