Share News

Trump Tariffs Impact: మార్కెట్‌ ట్రంఫట్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:24 AM

ట్రంప్‌ సుంకాలు ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లలో భారీ పతనాన్ని తెచ్చాయి. భారత మార్కెట్లు కూడా ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేకుండా సెన్సెక్స్‌, నిఫ్టీ 1.22% మరియు 1.49% నష్టాలను నమోదు చేశాయి. ఈ పతనంతో BSE లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9.98 లక్షల కోట్లు తగ్గింది

Trump Tariffs Impact: మార్కెట్‌ ట్రంఫట్‌

  • వాణిజ్య యుద్ధం, మాంద్యం భయాలతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

  • సెన్సెక్స్‌ 930 పాయింట్లు పతనం

  • 76,000 స్థాయిని కోల్పోయిన సూచీ

  • 23,000 దిగువకు జారిన నిఫ్టీ

  • దాదాపు రూ.10 లక్షల సంపద నష్టం

ముంబై: ట్రంప్‌ సుంకాలు అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధానికి దారి తీయవచ్చని, అమెరికాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టవచ్చన్న భయాందోళనలతో ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. భారత ఈక్విటీ సూచీలూ ఇందుకు అతీతమేమీ కాదు. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 1,054.81 పాయింట్ల మేర క్షీణించి 75,240.55 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 930.67 పాయింట్ల (1.22 శాతం) నష్టంతో 75,364.69 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345.65 పాయింట్లు (1.49 శాతం) కోల్పోయి 22,904.45 వద్దకు జారుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌ వంటి మార్కెట్‌ దిగ్గజాలతో పాటు ఐటీ, మెటల్‌, ఫార్మా రంగ షేర్లలో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడటం సూచీల భారీ నష్టాలకు కారణమైంది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9.98 లక్షల కోట్లు తగ్గి రూ.403.34 లక్షల కోట్లకు (4.73 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. ఈ వారంలో సెన్సెక్స్‌ 2,050.23 పాయింట్లు (2.64 శాతం), నిఫ్టీ 614.8 పాయింట్లు (2.61 శాతం) కోల్పోయాయి.

  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 23 నష్టపోయాయి. టాటా స్టీల్‌ 8.59 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. టాటా మోటార్స్‌ 6.15 శాతం పతనమైంది. ఎల్‌ అండ్‌ టీ, అదానీ పోర్ట్స్‌ 4 శాతానికి పైగా.. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌ 3 శాతానికి పైగా తగ్గాయి.


  • ప్రధాన కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి షేర్లలో మధ్యాహ్నం నుంచి అమ్మకాలు పోటెత్తాయి. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 3.08 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 3.43 శాతం క్షీణించాయి. రంగాల వారీ సూచీలన్నీ నేలచూపు చూశాయి. అత్యధికంగా మెటల్‌ 6.34 శాతం నష్టపోగా.. క్యాపిటల్‌ గూడ్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, కమోడిటీస్‌, ఇండస్ట్రియల్స్‌, ఎనర్జీ, రియల్టీ, ఐటీ సూచీలు 3 శాతానికి పైగా తగ్గాయి.

  • ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించి రూ.85.44 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల తరలింపు మన కరెన్సీకి గండికొట్టాయి.

  • అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్‌ రకం క్రూడాయిల్‌ పీపా ధర ఒకదశలో 6.62 శాతం తగ్గి 65.50 డాలర్లకు దిగివచ్చింది. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి నేపథ్యంలో ఇంధన గిరాకీ తగ్గవచ్చన్న అంచనాలు ఇందుకు కారణమయ్యాయి.

  • మన విదేశీ మారకం (ఫారెక్స్‌) నిల్వలు 5 నెలల గరిష్ఠ స్థాయికి పెరిగాయి. మార్చి 28తో ముగిసిన వారం నాటికి ఫారెక్స్‌ నిల్వలు మరో 659.6 కోట్ల డాలర్ల మేర పెరిగి మొత్తం 66,539.6 కోట్ల డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ వెల్లడించింది. నిల్వలు పెరుగుతుండటం వరుసగా ఇది నాలుగోవారం.


ఫార్మా షేర్లు కుదేలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో బాంబు పేల్చారు. వారి దేశంలోకి దిగుమతయ్యే ఔషధాలపైనా గతంలో ఎన్నడూ లేని విధంగా సుంకాలను త్వరలోనే విధిస్తామని తాజాగా ప్రకటించారు. ఈ నెల 2న సుంకాలు ప్రకటించిన సందర్భంలో ఔషధాలు, సెమీకండక్టర్లకు మినహాయింపునిచ్చిన పెద్దన్న.. ఆకస్మికంగా యూటర్న్‌ తీసుకోవడం ఈ రెండు ఇండస్ట్రీల వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ వార్త నేపథ్యంలో ఫార్మా రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. మార్క్సాన్స్‌ ఫార్మా షేరు 11.18 శాతం నష్టపోగా.. లారస్‌ ల్యాబ్స్‌ 7.40 శాతం, గ్రాన్యూల్స్‌ ఇండియా 7.01 శాతం, శిల్పా మెడికేర్‌ 6.56 శాతం, ఇప్కా ల్యాబ్స్‌ 6.53 శాతం, అరబిందో ఫార్మా 5.96 శాతం, లుపిన్‌ 5.85 శాతం తగ్గాయి. గ్లాండ్‌ ఫార్మా 5.51 శాతం, అజంతా ఫార్మా 5.40 శాతం, సిప్లా 5.32 శాతం, బయోకాన్‌ 5.09 శాతం, వోక్‌హార్డ్‌ 5 శాతం క్షీణించాయి. దివీస్‌ లేబొరేటరీస్‌ 4.70 శాతం, నాట్కో ఫార్మా 4.75 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 3.60 శాతం, సన్‌ఫార్మా 3.43 శాతం పడ్డాయి. బీఎ్‌సఈలోని హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 3.20 శాతం క్షీణించింది.


ఇవి కూడా చదవండి:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 06:24 AM