RBI Revised Guidelines: నూతన ఎగ్జిమ్ నిబంధనలు ప్రకటించిన ఆర్‌బీఐ
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:50 AM
వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించే చర్యల భాగంగా, ఆర్‌బీఐ ఎగుమతి, దిగుమతి లావాదేవీలకు సంబంధించి సవరించిన ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, బకాయిలు దాటిన ఎగుమతిదారులు తమ తదుపరి ఎగుమతులు చేయడానికి హామీ తీసుకోవాల్సి ఉంటుంది

ముంబై: వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించే చర్య ల్లో భాగంగా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)-1999 పరిధిలో ఎగుమతి, దిగుమతి లావాదేవీలకు సంబంధించి సవరించిన ముసాయిదా నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రతిపాదించింది. ఈ సవరించిన ముసాయిదా నిబంధనల ప్రకారం ఎగుమతిదారుకు గడువు తేదీ ముగిసిన రెండేళ్ల తర్వాత కూడా బకాయి సొమ్ము అందకపోయినా, అలా తాను అందుకోవాల్సిన సంచిత బకాయి రూ.25 కోట్లు దాటినా సంబంధిత ఎగుమతిదారుడు అడ్వాన్స్‌గా పూర్తి సొమ్ము చెల్లింపు లేదా వెనక్కి తీసుకోవడానికి వీలు లేని లెటర్ ఆఫ్ క్రెడిట్ హామీ పొందిన తర్వాత మాత్రమే మరిన్ని ఎగుమతులను ఆమోదించవచ్చు. అలాగే బంగారం, వెండి దిగుమతుల విషయంలో అధీకృత డీలర్ అడ్వాన్స్ చెల్లింపులు చేయడానికి ఇక ఏ మాత్రం అనుమతించరు. మరింతగా వ్యాపార సౌలభ్యం కల్పించడం లక్ష్యంగానే ఈ ముసాయిదా నిబంధనలు విడుదల చేసినట్టు ఆర్‌బీఐ తెలిపింది.