Share News

Electric Vehicle Imports: మా కార్లపైనా సుంకాలు తగ్గించండి

ABN , Publish Date - Apr 08 , 2025 | 05:58 AM

భారత్‌–ఈయూ వాణిజ్య ఒప్పందం కింద కార్లపై జీరో సుంకాలు విధించాలని యూరోపియన్‌ యూనియన్‌ కోరుతోంది. దీనిపై కేంద్రం దశలవారీగా సుంకం తగ్గించే అవకాశం పరిశీలిస్తోంది

Electric Vehicle Imports: మా కార్లపైనా సుంకాలు తగ్గించండి

భారత్‌కు ఈయూ సరికొత్త ప్రతిపాదన

ట్రంప్‌ బాటలోనే ఈయూ

న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం కింద భారత్‌లోకి దిగుమతి అవుతున్న కార్లపై జీరో సుంకాలు ప్రకటించాలని యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కోరుతోంది. అయితే ఆ చర్చలకు ఒక ముగింపు ఇచ్చే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం సైతం తన ప్రతిపాదనలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సంసిద్ధత ప్రకటిస్తోంది. ప్రస్తుతం యూరప్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లపై 100 శాతం సుంకం విధిస్తుండగా దాన్ని దశలవారీగా 10 శాతానికి తగ్గించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశీయ పరిశ్రమను రక్షించడం కోసం దిగుమతి కార్లపై సుంకాన్ని కనీసం 30 శాతంగా కొనసాగించాలని ఒకపక్క పరిశ్రమ వర్గాలు కోరుతుండగా ప్రభుత్వం అందుకు భిన్నమైన వైఖరిపై సమాలోచనలు జరుపుతుండటం గమనార్హం. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం దిగుమతి సుంకాలు తగ్గించాలని ఒత్తిడి పెంచుతున్న సమయంలోనే ఈయూ నుంచి కూడా అదే తరహా ప్రతిపాదన రావటం గమనార్హం.

ఎవరి మాట నెగ్గేను: ఈయూ ప్రతిపాదనలకు ప్రభుత్వం తలొగ్గినట్టయితే అది ఫోక్స్‌వ్యాగన్‌, మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలతో పాటు ఈ ఏడాది దేశంలో విద్యుత్‌ కార్ల (ఈవీ) విక్రయాలు ప్రారంభించాలన్న ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లాకు కూడా ఒక ఘన విజయమే అవుతుంది. ఈయూ డిమాండ్లను గత వారం ఆటోమొబైల్‌ పరిశ్రమ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం తెలియచేసింది. అయితే ఈ తాజా పరిస్థితులపై వ్యాఖ్యానించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు గాని, సియామ్‌ ప్రతినిధులు గాని నిరాకరించారు. వాస్తవానికి ఏటా 40 లక్షల కార్ల అమ్మకాలు నమోదయ్యే మన ఆటోమొబైల్‌ మార్కెట్‌ అత్యంత సురక్షిత మార్కెట్‌. మరోవైపు ఈవీలపై దిగుమతి సుంకాలు తగ్గించవద్దని టాటా మోటార్స్‌, మహీంద్రా.. ప్రభుత్వంతో లాబీయింగ్‌ చేస్తున్నాయి.

Updated Date - Apr 08 , 2025 | 06:00 AM