Share News

30, 40, 50 ఏళ్లలో రిటైర్మెంట్‌ ప్రణాళిక ఇలా..

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:28 AM

జీవితంలో మలి దశ ఆర్థిక అవసరాలను సమకూర్చుకునేందుకు వీలైనంత త్వరగా రిటైర్మెంట్‌ ప్రణాళికను ప్రారంభించడం మేలు. ఈ ప్లానింగ్‌లో ఏటేటా పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులు...

30, 40, 50  ఏళ్లలో రిటైర్మెంట్‌ ప్రణాళిక ఇలా..

జీవితంలో మలి దశ ఆర్థిక అవసరాలను సమకూర్చుకునేందుకు వీలైనంత త్వరగా రిటైర్మెంట్‌ ప్రణాళికను ప్రారంభించడం మేలు. ఈ ప్లానింగ్‌లో ఏటేటా పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులు, ఆయుర్దాయం వంటి అంశాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే రిటైర్మెంట్‌ అనంతర జీవితానికి తగినన్ని నిధులను పోగేయగలం. కానీ, తక్కువ ఆదాయం, కుటుంబ వ్యయ భారం వంటి సవాళ్ల కారణంగా చాలా మంది కెరీర్‌ ప్రారంభం నుంచే రిటైర్మెంట్‌ ప్లానింగ్‌కు శ్రీకారం చుట్టలేకపోతున్నారు. ఆలస్యమైనా ఫర్వాలేదు.. ఏదో ఒక దశలో మొదలు పెట్టడం చాలా ముఖ్యం. అవసరం కూడా. మరి 30, 40, 50 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌ ప్రణాళిక ప్రారంభించే వారు అనుసరించాల్సిన వ్యూహాలేంటో తెలుసుకుందాం..


30 లో..

ముప్ఫై ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మీ నెలవారీ ఖర్చులు రూ.30,000 అనుకుందాం. ఏటా 5 శాతం చొప్పున పెరుగుతూ పోతుంటే, మీరు రిటైర్‌ అయ్యేనాటికి మీ నెలవారీ ఖర్చులు రూ.1.33 లక్షలకు చేరుకోవచ్చు. పర్యవసానంగా రిటైర్‌ అయిన తొలి ఏడాదిలో మీకు ఖర్చులకు రూ.16 లక్షలు అవసరమవుతాయి. 5 శాతం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మీకు 80 ఏళ్లు వచ్చేవరకు మొత్తం రూ.5.3 కోట్లు అవసరం. కాబట్టి, మీరు దీర్ఘకాలంలో అధిక రిటర్నులు అందించేందుకు అవకాశాలున్న ఈక్విటీలు, ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం మేలు. ఉదాహరణకు, 30 ఏళ్ల వయసులో ఈక్విటీ ఫండ్‌లో నెలకు రూ.2,000తో సిప్‌ (క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక) ప్రారంభించి, ఏటా ఈ మొత్తాన్ని 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోతే, రిటైర్మెంట్‌ అనంతర అవసరాలను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. రిటైర్మెంట్‌ నాటికి ఫండ్‌లో మీరు మొత్తం రూ.40 లక్షల పెట్టుబడి పెడతారు. మీ పెట్టుబడులపై ఏటేటా 15 శాతం చొప్పున రిటర్నులతో కలిపి మీ ఫండ్‌ మొత్తం విలువ రిటైర్మెంట్‌ నాటికి రూ.2.53 కోట్ల వరకు చేరుకోగలదు. రిటైర్మెంట్‌ అనంతరం, సిప్‌ నుంచి ఎస్‌డబ్ల్యూపీ (క్రమానుగత ఉపసంహరణ ప్లాన్‌)కు మారాలి. మీ ఫండ్‌ నుంచి 20 ఏళ్ల పాటు నెలకు రూ.1.33 లక్షల చొప్పున సొమ్మును విత్‌డ్రా చేసుకుంటూ పోవాలి. విత్‌డ్రా సొమ్మును ఏటా 10 శాతం చొప్పున పెంచుకోవచ్చు. రిటైర్మెంట్‌ అనంతరం 20 ఏళ్ల పాటూ మీ ఫండ్‌ ఏటా 15 శాతం చొప్పున పెరిగితే, నెలనెలా డబ్బును ఉపసంహరించుకున్నప్పటికీ, మీకు 80 ఏళ్లు వచ్చేసరికి మీ ఫండ్‌లో రూ.8 కోట్ల వరకు మిగిలి ఉండే అవకాశం ఉంటుంది.


40 లో..

ఈ వయసులో మీ నెల ఖర్చులు రూ.40,000 అనుకుందాం. ద్రవ్యోల్బణాన్నీ పరిగణలోకి తీసుకుంటే, రిటైర్మెంట్‌ అయ్యాక తొలి నెలలో మీకు ఖర్చుల కోసం రూ.1.1 లక్షల వరకు అవసరమవుతాయి. అప్పుడు కూడా ఖర్చులు ఏటేటా 5 శాతం చొప్పున పెరిగాయనుకుంటే, రిటైర్మెంట్‌ అనంతర రెండు దశాబ్దాలకు (60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు) గాను మొత్తం రూ.4.3 కోట్లు అవసరం. అయితే, రిటైర్మెంట్‌ ప్రణాళికను 40 ఏళ్లప్పుడు ప్రారంభిస్తున్నందున మీ వద్ద ఎక్కువ సమయం ఉండదు. తక్కువ కాలంలో అధిక సంపద సృష్టికి దూకుడుగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగని, అధిక రిస్క్‌ కూడా తీసుకోలేరు. కాబట్టి, మార్కెట్‌ ఆటుపోట్ల నుంచి కొంత రక్షణ కల్పించే బ్యాలెన్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో ఎక్కువ మొత్తంలో సిప్‌ చేయడం మేలు. నెలకు రూ.12,000 చొప్పున, ఏటేటా 10 శాతం పెంచుతూ పోవాలి. మీ ఫండ్‌ పెట్టుబడులపై ఏటేటా 12 శాతం రిటర్నులు లభించగలిగితే, రిటైర్మెంట్‌ అనంతర ఆర్థిక అవసరాలను తీర్చుకోగలిగే వీలుంటుంది. మీరు రిటైర్‌ అయ్యే నాటికి మీ మొత్తం పెట్టుబడి రూ.82.5 లక్షలకు చేరుతుంది. ఏటేటా 12 శాతం రిటర్నులతో కలిపి మీ ఫండ్‌ మొత్తం విలువ రూ.2.24 కోట్లకు చేరుకుంది. రిటైర్మెంట్‌ అనంతరం సిప్‌ నుంచి ఎస్‌డబ్ల్యూపీకి మారడం ద్వారా మీకు నెలవారీగా అవసరమయ్యే రూ.1.1 లక్షల ఖర్చును సమకూర్చుకోవచ్చు. నెలవారీ విత్‌డ్రా సొమ్మును ఏటా 10 శాతం పెంచుకుంటూ పోయినా, 80 ఏళ్లు వచ్చేవరకూ మీ ఆర్థిక అవసరాలను తీర్చుకోగలుగుతారు.


50 లో..

నడి వయసులో రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ అంటే చాలా ఆలస్యమైనట్టే. అయినా, సాధ్యమే. భారీ మొత్తాల్లో రిస్క్‌ తక్కువగా ఉంటే ఆర్థిక పథకాల్లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా రిటైర్మెంట్‌ కార్ప్‌సను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వయసులో మీ నెలవారీ ఖర్చు రూ.50,000 అనుకుంటే, ఖర్చులు ఏటేటా 5 శాతం పెరుగుతున్నాయనుకుంటే, పదవీ విరమణ అనంతరం మొదటి నెలలో ఖర్చులకు రూ.82,000 అవసరం. 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల ప్రయాణం సాఫీగా సాగాలంటే మొత్తం రూ.3.2 కోట్ల నిధులు కావాలి. ఇందుకోసం బ్యాలెన్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌లో నెలకు రూ.50,000 చొప్పున సిప్‌ చేయగలిగితే, ఏటా 12 శాతం రిటర్నులు లభించాయనుకుంటే, 60 ఏళ్ల నాటికి మీ ఫండ్‌ విలువ రూ.1.64 కోట్లకు చేరుకుంటుంది. పదవీ విరమణ అనంతరం సిప్‌ నుంచి ఎస్‌డబ్ల్యూపీకి మారి మీ నెలవారీ ఖర్చులను ఫండ్‌ నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. విత్‌డ్రా సొమ్మును ఏటేటా 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోయినా, మీకు 80 ఏళ్లు నిండే నాటికి మీ ఫండ్‌లో ఇంకా రూ.52 లక్షల వరకు మిగిలి ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..

Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..

New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:28 AM