Home Loans: హోమ్ లోన్ కావాలా.. అయితే ఎస్బీఐ కంటే తక్కువ వడ్డీ రేట్లు ఇక్కడే..
ABN , Publish Date - Feb 27 , 2025 | 11:27 AM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే తక్కువ వడ్డీ రేట్లకే ప్రభుత్వ రంగానికి చెందిన మరో ఆరు బ్యాంకులు గృహ రుణాలను అందిస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏంటి, ఏ వడ్డీ రేట్ల వద్ద రుణాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం గృహ రుణాల గ్రహీతలకు ఊరట కలిగిస్తోంది. అక్టోబర్ 01, 2019 తర్వాత రిటైల్ ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలను రెపో రేటుకు అనుసంధానించారు. ఈ మేరకు ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులు కూడా రేటు తగ్గింపు ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు అందించాల్సి ఉంటుంది. గృహ రుణాలు తీసుకునే వారిపై ఇది భారాన్ని తగ్గిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆర్బీఐ తాజాగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు మేర కోత విధించి 6.25 శాతానికి తగ్గించింది. దీంతో పలు బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీలను తగ్గించాల్సి ఉంది.
రిజర్వు బ్యాంక్ నిర్ణయంతో గృహ రుణ వినియోగదారులకు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని అందించిన మొదటి ప్రధాన బ్యాంకుల్లో ఒకటిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిలిచింది. ఎస్బీఐ తన ఫ్లోటింగ్ రేటు గృహ రుణ వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. 8.25 శాతం వడ్డీతో ప్రారంభమయ్యే గృహ రుణాలను ఖాతాదారులకు అందిస్తోంది. ఇది హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేటు బ్యాంకుల ప్రారంభ రేట్ల కంటే తక్కువ. అయితే వివిధ రుణదాతల వెబ్‌సైట్ల డేటా ప్రకారం ఫిబ్రవరి 2025లో ఆరు బ్యాంకులు ఎస్బీఐ కంటే తక్కువ వడ్డీ రేట్ల వద్ద రుణాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో ప్రారంభమయ్యే గృహ రుణాలను అందిస్తోంది. ఒక వ్యక్తి రూ.50 లక్షలను రుణంగా తీసుకుంటే నెలకు రూ.42,133 చొప్పున 20 సంవత్సరాలపాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 8.1శాతం వార్షిక వడ్డీ రేటుతో ప్రారంభమయ్యే గృహ రుణాలను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకు 8.15 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో రూ.50 లక్షలను గృహ రుణంగా తీసుకుంటే రూ.42,289 నెలవారీ ఈఎంఐ చొప్పున 20 సంవత్సరాలపాటు చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు పైన తెలిపిన ప్రభుత్వ రంగ రుణదాతలకు భిన్నంగా హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు 8.75 శాతం వడ్డీ రేటుతో ప్రారంభమయ్యే గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ రేటు వద్ద రూ.50 లక్షలు గృహ రుణంగా తీసుకుంటే 20 సంవత్సరాలపాటు నెలకు రూ.44,185 చెల్లించాలి. అయితే రుణదాతలు అందించే తుది గృహ రుణాల రేట్లు గ్రహీతల క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Gold and Silver Prices Today: బ్యాడ్ న్యూస్.. గోల్డ్ ధర ఎంతకు చేరిందంటే..
100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చుకు డబ్బుల్లేవ్