Share News

వాహన విడిభాగాల తయారీదారులకు ట్రంప్‌ టారిఫ్‌ షాక్‌!

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:10 AM

వచ్చే నెల 3 నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే అన్ని వాహనాలు, వాటి విడిభాగాలపై 25 శాతం సుంకం వసూలు చేయనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు....

వాహన విడిభాగాల తయారీదారులకు ట్రంప్‌ టారిఫ్‌ షాక్‌!

భారత్‌ నుంచి అమెరికాకు ఏటా రూ.60,000 కోట్ల ఎగుమతులు

కంపెనీల మార్జిన్లపై తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ: వచ్చే నెల 3 నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే అన్ని వాహనాలు, వాటి విడిభాగాలపై 25 శాతం సుంకం వసూలు చేయనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. భారత్‌లోని వాహన విడిభాగాల తయారీదారులకు ఇది శరాఘాతంగా పరిణమించనుంది. ఎందుకంటే, భారత కంపెనీలు ఏటా దాదాపు 700 కోట్ల డాలర్ల (సుమారు రూ.60,000 కోట్లు) విలువైన వాహన విడిభాగాలను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. అమెరికా సుంకాల దెబ్బకు తమ లాభాల మార్జిన్లు తగ్గవచ్చని ఇండస్ట్రీ భయపడుతోంది. ముఖ్యంగా సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్‌ ఫోర్జింగ్‌, భారత్‌ ఫోర్జ్‌, సంవర్ధన మదర్సన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌పై ట్రంప్‌ సుంకాల ప్రభావం అధికంగా ఉండనుంది. సోనా బీఎల్‌డబ్ల్యూకు 40 శాతం, భారత్‌ ఫోర్జ్‌కు 38 శాతం, సంవర్ధన మదర్సన్‌కు 18 శాతం ఆదాయం అమెరికా ఎగుమతుల నుంచే సమకూరుతోంది.


అమెరికా దిగుమతులపై

15 శాతం సుంకం

ఇండస్ట్రీ అంచనాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ కంపెనీలు అమెరికాకు 679 కోట్ల డాలర్ల విలువైన వాహన విడిభాగాలను ఎగుమతి చేశాయి. కాగా, అమెరికా నుంచి భారత్‌కు 140 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. ప్రస్తుతం అమెరికా తన దేశంలోకి దిగుమతయ్యే వాహన విడిభాగాలపై ఎలాంటి సుంకం విధించడం లేదు. భారత్‌ మాత్రం అమెరికా నుంచి దిగుమతయ్యే విడిభాగాలపై 15 శాతం సుంకం వసూలు చేస్తోంది.


ఎగుమతి ఆదాయంలో 27 శాతం అమెరికాదే

ఈ ఏడాది మే లేదా ఆ తర్వాత ఇంజన్లు, ట్రాన్స్‌మిషన్లు, పవర్‌ట్రెయిన్‌ పార్ట్స్‌, ఎలక్ట్రికల్‌ పార్ట్స్‌ వంటి కీలక విడిభాగాలపైనా 25 శాతం సుంకం విధించే యోచనలో ట్రంప్‌ ప్రభుత్వం ఉంది. ఈ భారాన్ని పూర్తిగా భరించాల్సి వస్తే, భారత వాహన విడిభాగాల ఎగుమతిదారుల నిర్వహణ లాభాల మార్జిన్లు 1.25-1.50 శాతం మేర తగ్గే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనూజ్‌ సేథీ అన్నారు. ప్రస్తుతం వీరి మార్జిన్లు 12-12.5 శాతంగా ఉన్నాయి. దేశీయ వాహన విడిభాగాల తయారీ రంగానికి దాదాపు 20 శాతం ఆదాయం ఎగుమతుల ద్వారానే సమకూరుతుండగా.. అందులో 27 శాతం అమెరికా మార్కెట్‌ నుంచే లభిస్తోంది. అమెరికాలో ప్లాంటు కలిగిన కంపెనీలు మాత్రం అక్కడ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడం ద్వారా లబ్ది పొందే అవకాశం ఉంది.


టాటాకు జేఎల్‌ఆర్‌ ఎఫెక్ట్‌

దేశీయ వాహన కంపెనీల్లో టాటా మోటార్స్‌ ఆదాయంపైన సుంకాలు ప్రభావం చూపనున్నాయి. కంపెనీకి చెందిన అంతర్జాతీయ బ్రాండ్‌ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో జేఎల్‌ఆర్‌ ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా కార్లను విక్రయించగా.. అందులో అమెరికా మార్కెట్‌ వాటా 23 శాతంగా ఉంది. అవన్నీ యూకేలోని కంపెనీ ప్లాంట్ల నుంచి ఎగుమతైనవే. ట్రంప్‌ సుంకాలను పూర్తిగా భరించాల్సి వస్తే జేఎల్‌ఆర్‌ లాభాలకు భారీగా గండిపడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stock Market Update: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

SEBI: ఆప్షన్ ట్రేడింగ్ అక్కడే కొంప ముంచుతోంది : సెబీ ఛైర్మన్

454 చెట్లను నరికించిన వ్యక్తికి 4.54 కోట్ల ఫైన్‌

భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుందాం

Updated Date - Mar 28 , 2025 | 03:10 AM