Share News

‘వర్సిటీ’ భూములు అమ్మకానికా?

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:57 AM

ఈ మధ్య యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి ఒక తమాషా లాంటి భూవివాదం జరుగుతోంది. అది ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ప్రైవేట్‌ వ్యక్తులకు, వ్యవస్థలకు చెందిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లు వారి వారి...

‘వర్సిటీ’ భూములు అమ్మకానికా?

ఈ మధ్య యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి ఒక తమాషా లాంటి భూవివాదం జరుగుతోంది. అది ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ప్రైవేట్‌ వ్యక్తులకు, వ్యవస్థలకు చెందిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లు వారి వారి ఇష్టానుసారం జరుగుతాయి. వాటిని రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. కాని, ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల మధ్య జరిగితే అవి జీవోలు, అలాట్‌మెంట్లు, అసైన్‌మెంట్ల ద్వారా జరుగుతాయి. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్లు చేస్తే చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఎందుకంటే, జీఓలు, అలాట్‌మెంట్లు, అసైన్‌మెంట్లు... రిజిస్ట్రేషన్‌ లాంటివే కనుక. ఒకసారి ఒక భూమి కేటాయిస్తే దాని వివరాలు ఆ ఊరికి లేక ప్రాంతానికి చెందిన శిస్తు వసూలు వగైరాల కొరకు పహణీలలో నమోదవుతాయి. అలాగే, ఆ భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయో, ఎన్నాళ్ల నుండి ఉన్నాయో కూడా అందులో పేర్కొంటారు. కాబట్టి యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు చెందిన భూమి రిజిస్ట్రేషన్‌ కాలేదనే మిషపై ప్రభుత్వం ఎంతో కొంత వాపసు తీసుకొని అమ్ముకుంటామంటే అది సరియైన పద్ధతి కాదు. అలాట్‌ చేయబడిన భూమి చాన్నాళ్ల వరకు వినియోగించుకోకపోతే దానిని ప్రభుత్వం వాపసు తీసుకోవచ్చునని ఒక నిబంధన ఉంటుంది. దీనినే ‘రీజనబుల్‌ టైమ్‌’ అని కూడా అంటారు. ఇది ఇదమిత్థంగా ఉండదు. అది ప్రభుత్వం, కోర్టువారి అభిప్రాయానుసారం ఉంటుంది. ఈ నిబంధన పురస్కరించుకొని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ భూమిని తీసుకుంటున్నామని ప్రభుత్వం అనవచ్చు. అయితే ఈ ఉపయోగించుకోవడం అనేది అంత సులభంగా తేల్చగలిగేదేమీ కాదు. ప్రభుత్వం పర్మిషన్లు వగైరా ఇవ్వడం, ఇవ్వకపోవడంపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. యూనివర్సిటీలకు భూములు వాటి భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా కొంత ఎక్కువగానే కేటాయిస్తారు.


వాటిలో కొంత వెనక్కు తీసుకుంటే భవిష్యత్తులో వాటికి అవసరముంటే అప్పుడు యూనివర్సిటీల పరిస్థితి ఏమిటి? ప్రజోపయోగార్థం భూమి సేకరించడానికి పూనుకుంటే సమాజం అభ్యంతరం తెలియజేయకపోవచ్చు. కాని, భూమిని అంగట్లో పెట్టి అమ్ముకోవటానికి తీసుకోదలచామని ప్రభుత్వం బహిరంగంగానే చెప్పడం హాస్యాస్పదం. అందుకే అటు యూనివర్సిటీ నుంచి, ఇటు సమాజంలోని సామాజిక సంరక్షణకు పాటుపడే ఆచార్య జి.హరగోపాల్‌ వంటివారు దీనిని చాలా తీవ్రంగా విమర్శించారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ భూములను అమ్ముకోవడానికి ప్రయత్నించడం చాలాకాలం నుంచి జరుగుతూనే ఉంది... మందలించేవారు, ప్రతిఘటించేవారు లేనందువల్ల. ఒకప్పుడు కరీంనగర్‌లో చాలాచోట్ల గుట్టలుండేవి. అవి ఇప్పుడు లేవు. కారణం వీటిని గ్రానైట్‌ వ్యాపారం కోసం శిథిలం చేస్తూ అమ్ముకుంటున్నారు. కొనేవారు కొంటున్నారు, పర్మిషన్లు ఇచ్చేవారు ఇస్తూనే ఉన్నారు. నేనొకసారి జపాన్‌కు వెళితే అక్కడి ప్రజలు చిన్నాపెద్దా పర్వతాల చుట్టూ ఇళ్లు కట్టుకోవడం కనిపించింది, కాని పర్వతాలను పడగొట్టి, పగలకొట్టి కాదు. వాళ్లకున్న సౌందర్యదృష్టి, పర్యావరణ సంరక్షణ దృష్టి అలాంటిది. ప్రతి యూనివర్సిటీకి ప్రభుత్వం ఎంతో కొంత భూమిని కేటాయిస్తుంది. ఆ భూములు కొంతవరకు అవి వాడుకోవడం లేదు. మరి ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం వాపసు తీసు కుంటుందా? ఒకవేళ అలా తీసుకోకపోతే యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు చెందిన భూమిని తీసుకోవడం పక్షపాతమవుతుంది కదా!

డా. కొండలరావు

వెల్చాల పూర్వ సంచాలకులు, తెలుగు అకాడమి

ఇవి కూడా చదవండి:

తృటిలో తప్పిన ప్రమాదం

Revanth Reddy: డిన్నర్‌కి పిలిచి AK47తో లేపేశాడు.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు..

Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా

Updated Date - Mar 28 , 2025 | 01:57 AM