ఇప్పుడు కావాల్సిన లోహియా మార్గదర్శకత్వం
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:57 AM
‘దార్శనిక నేత, స్వాతంత్ర్య సమర సైనికుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు’ అని రామ్ మనోహర్ లోహియాను ఆయన 115వ జయంత్యుత్సవం (మార్చి 23)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు...

‘దార్శనిక నేత, స్వాతంత్ర్య సమర సైనికుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు’ అని రామ్ మనోహర్ లోహియాను ఆయన 115వ జయంత్యుత్సవం (మార్చి 23)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. లోహియా రాజకీయ, సైద్ధాంతిక వారసత్వం నుంచి ఆచరణాత్మక స్ఫూర్తి పొందడానికి ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నాలు, దురదృష్టవశాత్తు, పూజ్యం. యూరోప్ నుంచి గ్రహించిన సోషలిస్టు భావజాలాన్ని భారతీయ సమాజానికి అనుగుణంగా రూపొందించి, అమలుపరిచేందుకు ఆయన చేసిన విశేష కృషి విస్తృత స్థాయిలో రాజకీయ శ్రేణులను ప్రభావితం చేయలేకపోవడం ఒక విషాదం. నరేంద్ర మోదీ గానీ, బీజేపీ సిద్ధాంతకర్తలు గానీ లోహియాను ప్రస్తుతించడం ఇదే మొదటిసారి కాదు. లోహియా భావాలు, అభిప్రాయాలను తమ రాజకీయ ప్రయోజనాలకు వారు తరచు ఉపయోగించుకుంటున్నారు. నెహ్రూను లోహియా ఎంత తీవ్రంగా విమర్శించినా ఒకనాటి జనసంఘ్ అజెండాల విషయంలో ఆయన నెహ్రూతో పూర్తిగా ఏకీభవించేవారు. లోహియా అనుసరించిన కాంగ్రెస్ వ్యతిరేక వాదాన్ని నేటి బీజేపీ, కాంగ్రెస్‌ను విమర్శించేందుకు వినియోగించుకుంటుంది. లోహియా ‘ఇంగ్లీష్ బహిష్కరణ’ నినాదాన్ని దేశ వ్యాప్తంగా హిందీ విధింపునకు ఉపయోగిస్తున్నారు.
బలహీన వర్గాల రాజకీయ అభ్యున్నతికి లోహియా ఇచ్చిన మద్దతు, అందించిన తోడ్పాటును ఇప్పుడు ప్రాబల్య ఓ బీసీలు అధికారాన్ని కైవసం చేసుకునేందుకు వాడుకుంటున్నారు. లోహియా వారసత్వాన్ని కాపాడుకోవడమనేది ఆయన ఆలోచనల, విధానాల వక్రీకరణలను సరిదిద్దడంతో ప్రారంభమవ్వాలి. కాంగ్రెస్ వ్యతిరేక వాదం అనేది ఒక రాజకీయ తాత్వికత కాదు, పాలక వర్గాల రాజకీయాలను జయించేందుకు అదొక స్వల్పకాలిక ఎత్తుగడ మాత్రమే. భారత జాతీయ కాంగ్రెస్‌లో లోహియా రాజకీయ ప్రస్థానం ప్రారంభమయింది. స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ నుంచి నిష్క్రమించాలన్న పలువురు సోషలిస్టు ప్రముఖుల ప్రతిపాదనను ఆయన తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. 1960ల్లో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రాబల్యం పూర్తి స్థాయిలో ప్రబలిపోయినప్పుడు మాత్రమే ఆయన కాంగ్రెస్ వ్యతిరేక వాదాన్ని ప్రతిపాదించారు. లోహియా ఆంగ్ల భాషా వ్యతిరేకి కానేకాదు. ఆ భాషను ఆయన అమితంగా ఇష్టపడేవారు. అయితే ఇంగ్లీష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించేవారు. అది ఒక విదేశీ భాష అయినందు వల్ల కాక. భూస్వామ్య జీవన శైలి, వర్గ అసమానతలకు ప్రతినిధిగా ఉన్నందునే ఆంగ్ల భాషను ఆయన వ్యతిరేకించారు. అలాగే ఆయన హిందీ భాషా దురహంకారి కూడా కాదు. అన్ని భారతీయ భాషలను సమరీతిలో అభివృద్ధి పరచాలని ఆయన ఆకాంక్షించేవారు వివిధ భారతీయ భాషలలోని ప్రముఖ రచయితలను లోహియా ఆలోచనలు ప్రభావితం చేయడంలో ఆశ్చర్యమేముంది? ఫణీశ్వర్‌నాథ్ రేణు, రఘువీర్ సహాయ్, సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా, విజయ్‌దేవ్ నారాయన్ సాహి (హిందీ), బీరేంద్ర కుమార్ భట్టాచార్య (అస్సామీ), యుఆర్ అనంతమూర్తి, పూర్ణచంద్ర తేజస్వి, పి. లంకేష్, సిద్దలింగయ్య (కన్నడ) మొదలైన రచయితలు తమ సాహితీ సృజనలో లోహియా భావాల నుంచి స్ఫూర్తి పొందినవారే.
సామాజిక న్యాయానికి సంబంధించిన లోహియా విధానాలు కేవలం ఓబీసీలకు మాత్రమే ప్రాధాన్యమివ్వలేదు. వెనుకబడిన కులాల వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలన్నది ఆయన వాదన. ఆయన దృష్టిలో వెనుకబడిన లేదా అణగారిన వర్గాలు అంటే ఓబీసీలు, దళితులు, ఆదివాసులతో పాటు మహిళలు కూడా. వీరందరి పురోగతికి ప్రత్యేక అవకాశాలు కల్పించాల్సి ఉన్నదని ఆయన నొక్కి చెప్పేవారు. ఆయన గర్జించిన ఆరు అన్యాయాలలో జెండర్ అసమానత్వం కూడా ఒకటి. ఈ అన్యాయాలను రూపుమాపేందుకు ఏడు విప్లవాల (సప్త క్రాంతి)ను సాధించాలని ఆయన సంకల్పించారు. వర్తమాన భారతదేశ లౌకికవాద రాజకీయాలకు ఎదురవుతున్న ప్రధాన సవాళ్లలో ఒకటి వాటికి మన సమున్నత నాగరికతా వారసత్వం, జాతీయోద్యమ భావస్రవంతిలో మూలాలు ఉన్న సాంస్కృతిక ప్రాతిపదికలు కొరవడటమే. ప్రగతిశీల సోషలిస్టు రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు లోహియా మన సాంస్కృతిక సంప్రదాయాలు, విలువలను ఉపయోగించుకున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య సమైక్యతకు శ్రీరామచంద్రుడు, తూర్పు, పశ్చిమ భారతదేశాల మధ్య ఐక్యతకు శ్రీకృష్ణుడు ప్రతీకలు అని లోహియా భావించారు. పర్యావరణ పరిరక్షణ చైతన్యం ఉద్భవించడానికి చాలా కాలం ముందే మన నదులు కృశించిపోతున్న పరిస్థితుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.. సోషలిస్టు భావాలను వివరించేందుకు ఈశోపనిషత్తులోని నచికేతుడి కథను ఆధారంగా చేసుకునేవారు. భారతీయ దర్శనాలు, ఇతిహాసాలు, కావ్యాలపై లోహియా విలక్షణ భావాలు ఎమ్‌ఎఫ్ హుస్సేన్‌తో సహా ఎంతో మంది కళాకారులను ఉత్తేజపరిచాయి. హిందూ మత సంకుచితత్వంపై తన విమర్శను వశిష్ఠుడు, వాల్మీకిల ద్వారా లోహియా వ్యక్తపరిచారు. అగ్రవర్ణ హిందువుల సంకుచిత వైఖరులకు వశిష్టుడు ప్రతినిధి అని ఆయన భావించారు. హిందూ ధర్మంలోని ఉదారవాద సంప్రదాయానికి వాల్మీకి ప్రతినిధి అని ఆయన పేర్కొన్నారు. అంతర్గత సంస్కరణలకు, న్యాయసాధనకు, బాహ్య ప్రభావాలను సాదరంగా ఆహ్వానించేందుకు ఈ సంప్రదాయం దోహదం చేస్తుందని లోహియా అన్నారు. హిందూ వెర్సెస్ ముస్లిమ్ లేదా క్రిస్టియన్ అనే సంవాదంలోని కీలక అంశం హిందూ ధర్మంలోని రెండు భావస్రవంతుల మధ్య ఘర్షణే అని లోహియా అన్నారు.
హిందూ ధర్మ చింతన, జీవన వ్యవహారాలలో ఉదారవాద సంప్రదాయం ప్రబలంగా ఉన్నప్పుడు భారత్ సమున్నత నాగరికతా శిఖరాలను అధిరోహిస్తుంది. ఔదార్య రహితమైన హిందూ ధర్మం ఒక జాతిగా, ఒక నాగరికతగా భారతదేశ క్షీణతను సూచిస్తుందని లోహియా అభిప్రాయపడ్డారు. లోహియా వారసత్వం భారతదేశ సొంత ఆధునికతకు తాత్విక పునాదులను నిర్మించడమే. మార్క్సిజంతో సహా యూరోప్ కేంద్రిత పాశ్చాత్య సిద్ధాంతాలను ఆయన నిశితంగా, నిష్కర్షగా విమర్శించారు. అదే సమయంలో మన మహోన్నత గతం గురించిన భ్రమల్లో ఆయన ఏ మాత్రం చిక్కుకోలేదు. సామాజిక, ఆర్థిక సమత సాధనకు నిబద్ధమైన లోహియా కొత్త ప్రగతిశీల రాజకీయాలకు నమూనాను రూపొందించారు. ఆయన సూత్రీకరణలు అన్నీ కాల పరీక్షకు నిలిచేవి కానప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని కాపాడుకునేందుకు దోహదం చేసే సైద్ధాంతిక ప్రాతిపదికలను లోహియా రాజకీయ చింతన సమకూరుస్తుందనడంలో సందేహం లేదు.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
Read Latest AP News And Telugu News