Share News

Indian Government and Maoists Conflict: శాంతి చర్చలకు సిద్ధమై పరిణతి చూపించారు

ABN , Publish Date - Apr 08 , 2025 | 06:35 AM

భారతదేశంలోని మావోయిస్టు-ప్రభుత్వ యుద్ధంపై, శాంతి చర్చల అవసరంపై, ఆదివాసి ప్రజల ప్రయోజనాల కోసం మావోయిస్టుల సూచనలు

Indian Government and Maoists Conflict: శాంతి చర్చలకు సిద్ధమై పరిణతి చూపించారు

చనిపోయేది ఎవరైతేనేమి, ముందుకే పోవాలని ఇరు పక్షాలూ అనుకొనే యుద్ధాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఎవరి ప్రయోజనాలు వాళ్లకు ఉంటాయి. కానీ దురాక్రమణకు, స్వీయ సంరక్షణకు మధ్య సాగే యుద్ధాలు వీటికి భిన్నమైనవి. మధ్య భారతదేశంలో జరుగుతున్న యుద్ధం ఇలాంటిదే. ఈ యుద్ధంలో భారత ప్రభుత్వానికి సాధారణ ప్రజలే లక్ష్యం. బైటికి మాత్రం మావోయిస్టులతో తలపడుతున్నానని అంటోంది. కానీ మరణిస్తున్నవాళ్లలో మూడొంతుల మంది సాధారణ ప్రజలని మావోయిస్టులే చెబుతున్నారు.

ఈ హత్యాకాండ ఆగాలనే ప్రజాస్వామిక ఆందోళనలకు కొనసాగింపుగా హైదరాబాదులో శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. ‘‘భారత ప్రభుత్వమూ, మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలకు సిద్ధం కావాలి’’ అని ఈ కమిటీ ప్రతిపాదించింది. ఈ యుద్ధంలో సాధారణ ప్రజల ప్రాణాలు పోవడానికి వీల్లేదనే మానవీయ ఆకాంక్షతో మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధపడింది. ఈ మేరకు గత నెల 28న ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది మానవ ప్రాణం పట్ల మావోయిస్టుల వైఖరిని తెలియజేస్తోంది. ఒకటిన్నర పేజీల ఈ ప్రకటనలో తమ పార్టీ నాయకుల, కార్యకర్తల మరణాల కంటే ఆదివాసుల ప్రాణాలకే వాళ్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.


నిజానికి మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధం కావడం ఇది మొదలు కాదు. 2002లో, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాంతి చర్చలు ఒక దశ దాకా జరిగి విఫలమయ్యాయి. ఆ తర్వాత కూడా పశ్చిమ బెంగాల్‌లో మమత అధికారంలోకి వచ్చాక శాంతి చర్చల ప్రస్తావన వచ్చినప్పుడు మావోయిస్టు పార్టీ సానుకూలంగా స్పందించింది. 2023 డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వమే శాంతి చర్చల ప్రతిపాదన పదేపదే తీసుకొచ్చింది. దానికి రెండుసార్లు మావోయిస్టుపార్టీ దండకారణ్య కమిటీ సంసిద్ధత తెలియజేసింది. ప్రభుత్వమే శాంతి చర్చలకు సిద్ధమైంది కాబట్టి, సానుకూల వాతావరణం ఏర్పాటు చేయాలని, దీని కోసం కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలను బ్యారెక్‌లకే పరిమితం చేయాలని, కొత్త సైనిక క్యాంపులు ఏర్పాటు చేయరాదని సూచించింది. అయినా ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేదు. ఒక పక్క శాంతి చర్చలు అంటూనే ఆపరేషన్‌ కగార్‌ను ప్రారంభించింది.

ఇప్పుడు మళ్లీ హైదరాబాదులో ఏర్పడ్డ శాంతి చర్చల కమిటీ పౌర సమాజం వైపు నుంచి శాంతి చర్చల ప్రతిపాదన చేసింది. ఈసారి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీయే స్పందించింది. సాయుధ పోరాటం వల్లేనేగాక అనేక ఇతర ప్రక్రియల వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరుతాయనే ప్రజాస్వామిక దృక్పథం ఉండటమే దీనికి కారణం. తీవ్రమైన యుద్ధం మధ్యలో చిక్కుకొని కూడా ప్రజల ప్రయోజనాల కోసం శాంతి చర్చలకు సిద్ధమని చెప్పడం మావోయిస్టుల రాజకీయ పరిణతిని సూచిస్తోంది. లక్షలాది బలగాలు, వందలాది సైనిక క్యాంపుల మధ్య ఆదివాసుల జీవితానికి భద్రత లేకుండా పోయింది కాబట్టి, గతంలో ఛత్తీస్‌గడ్‌ ప్రభుత్వం ముందు దండకారణ్య కమిటీ పెట్టిన ప్రతిపాదనలనే ఇప్పుడు ఆ పార్టీ కేంద్ర కమిటీ పెట్టింది. ఈ విడత శాంతి చర్చల ప్రస్తావనకు ఇంత నేపథ్యం ఉన్నది.

అయితే ఈ మారణకాండ ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే జరగడం లేదు. అక్కడ తీవ్రంగా ఉన్నప్పటికీ మహారాష్ట్ర (గడ్చిరోలి), ఒడిషా, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కగార్‌ యుద్ధం నడుస్తున్నది. అందువల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సహా, కేంద్రం ముందు శాంతి చర్చలకు తమ సమ్మతిని మావోయిస్టులు తెలియజేశారు. ‘‘మధ్య, తూర్పు భారతదేశంలోని పీడిత ప్రజల, పీడిత సాంఘిక సముదాయాల, పీడిత జాతులపై జరుగుతున్న కగార్‌ యుద్ధాన్ని నిలిపివేయాలి’’ అని మావోయిస్టులు డిమాండ్‌ చేశారు.

కాబట్టి ఇది మావోయిస్టులకు –ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన సమస్య కాదు. మధ్య, తూర్పు భారతదేశంలోని ఆదివాసీ, పీడిత ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న సంఘర్షణ. ఆ ప్రాంతాల్లోని సహజ సంపదలకు అక్కడున్న ఆదివాసీ ప్రజలు సంరక్షకులు. వాళ్ల అస్తిత్వానికి, స్వయం పాలనలోని రాజకీయ, సాంస్కృతిక జీవన విధానానికి భారత రాజ్యాంగం గుర్తింపును ఇచ్చింది. చట్టబద్ధమైన రక్షణ కల్పించింది. ప్రభుత్వం దీన్ని ఉల్లంఘించి అభివృద్ధి అనే పేరుతో ఆదివాసీ ప్రాంతాల కార్పొరేటీకరణకు పాల్పడుతోంది. ప్రభుత్వ అభివృద్ధి నమూనా వల్ల తలెత్తిన ఈ యుద్ధం ఆదివాసులను బలి తీసుకుంటోంది. దీన్ని ఆపడానికి శాంతి చర్చల కమిటీ చేసిన ప్రతిపాదనలను మావోయిస్టులు గౌరవించారు. ‘‘ప్రజల ప్రయోజనాల కోసం మేము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమే’’ అని స్పష్టంగా ప్రకటించారు.


ఈ యుద్ధంలో భారత ప్రభుత్వం తన అజమాయిషీలో ఉండే సైనిక బలగాలేగాక ఆదివాసీ యువతను సాయుధ బలగాల్లో భర్తీ చేసుకొని, వారి చేతనే ఆదివాసులను హత్య చేయిస్తున్నదని కూడా మావోయిస్టులు తమ ప్రకటనలో అన్నారు. అట్లాగే గత ఏడాది నుంచి వందలమంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ప్రభుత్వం చెబుతోంది. అణచివేతలాగే బలవంతపు లొంగుబాటు కూడా ప్రభుత్వ వ్యూహంలో భాగం. వీళ్లంతా ఆదివాసులు. దండకారణ్య ప్రజలపై జరుగుతున్న యుద్ధంలో ఈ ‘లొంగిపోయిన నక్సలైట్లను’ భాగం చేసే ప్రమాదం ఉన్నది. అంటే ఒక రకమైన అంతర్యుద్ధ వాతావరణం అక్కడ నెలకొని ఉన్నది. ఏ రకంగా చూసినా ఇది ప్రజల ఉనికిని పూర్తిగా దెబ్బతీస్తుంది.

ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు కేవలం ఆదివాసీల గురించేగాక గైరాదివాసీల ప్రయోజనాల గురించి కూడా ఆలోచించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే ఈ అన్ని సమూహాల మౌలిక సమస్యలను ముందుకు తీసుకొస్తారు. పాలకుల అభివృద్ధి నమూనా వల్ల తలెత్తిన ఈ హత్యాకాండ ఆగాలని కోరుకుంటున్నారు కాబట్టి మావోయిస్టులు దీన్ని కేవలం రాజకీయార్థిక విషయంగానే చూడ్డం లేదు. రాజ్యాంగబద్ధ పాలనలోని సామాజిక, సాంస్కృతిక విషయాలను సహితం ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ‘‘మత మైనారిటీలపై వివక్షతను రాజ్యాంగబద్ధం చేస్తోంది’’ అని చెబుతూ, ఆదివాసీ–గైరాదివాసీ సంస్కృతీ సంప్రదాయాల రక్షణ, మాతృభాషల, పర్యావరణ రక్షణ వైపు నుంచి కూడా మాట్లాడారు.

మావోయిస్టుల ప్రకటన రాగానే చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం చర్చలకు సిద్ధమే అంటూ, ఆయుధాలు వదిలిపెట్టాలని అన్నది. మావోయిస్టులు ఆయుధాలు వదిలేస్తే ఇక చర్చలు జరగాల్సిన పనే ఉండదు. శాంతి చర్చలకు మావోయిస్టులు సూత్రబద్ధ, నిర్మాణాత్మక ప్రతిపాదనలు సూచిస్తే, ప్రభుత్వం మాత్రం చర్చలు జరగనవసరం లేని కండీషన్‌ పెట్టింది. ఈ అసంబద్ధతను ప్రజాస్వామికవాదులు గుర్తించాలి. చర్చనీయాంశం చేయాలి. ఈ పని కూడా మావోయిస్టుల కోసం కాదు. వాళ్లూ కోరుకుంటున్న ప్రజల ప్రయోజనాల కోసం.

-పాణి

Updated Date - Apr 08 , 2025 | 07:03 AM