Share News

సాంస్కృతిక విధానం దిశగా తొలి అడుగు

ABN , Publish Date - Mar 27 , 2025 | 05:06 AM

చారిత్రక సంస్కృతి, నాగరికతా వికాసంలోనూ తెలంగాణ ఘనమైన వారసత్వం కలిగి ఉంది. దేశంలో ఏ ప్రాంతానికీ ఈ నేల భౌగోళికత తీసిపోదు. క్రీస్తుకు పూర్వం 221 నుంచి 218 వరకు కోటిలింగాల రాజధానిగా శాతవాహనులు దేశమంతా...

సాంస్కృతిక విధానం దిశగా తొలి అడుగు

చారిత్రక సంస్కృతి, నాగరికతా వికాసంలోనూ తెలంగాణ ఘనమైన వారసత్వం కలిగి ఉంది. దేశంలో ఏ ప్రాంతానికీ ఈ నేల భౌగోళికత తీసిపోదు. క్రీస్తుకు పూర్వం 221 నుంచి 218 వరకు కోటిలింగాల రాజధానిగా శాతవాహనులు దేశమంతా విస్తరింప చేసిన తొలి తెలుగు రాజ్యం ఇది. ఆ కాలంలోనే హాలుడు 700 గాథలతో ‘గాథా సప్తశతి’ సంకలనం చేశాడు. ఇది చారిత్రాత్మకమైన కవిత్వం. ప్రపంచ జాతక కథల్లో మొట్టమొదటి ‘బృహత్కథ’ ఈ గడ్డ నుంచే వచ్చింది. ఆ తర్వాత క్రీస్తు శకం 945లోనే జినవల్లభుడు తొలి తెలుగు కందపద్యంతో కురిక్యాల శాసనం ప్రకటించారు. ఈ శాసనమే తెలుగుకు ప్రాచీన హోదా రావడానికి తోడ్పడింది. అటు తర్వాత పాలకురికి సోమనాథుని ‘బసవ పురాణం’, గోన బుద్ధారెడ్డి కాకతీయుల కాలం, కులీ కుతుబ్ షా హయాం... అక్కడి నుంచే మొదలైంది తెలంగాణ సాంస్కృతిక సారస్వత కళల వైభవ చరిత్ర. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం పదేళ్లలోనూ ఒక సమగ్ర సాంస్కృతిక విధానాన్ని నాటి ప్రభుత్వం రూపొందించలేకపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర సాంస్కృతిక విధాన రూపకల్పనకు శ్రీకారం చుడుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల ప్రఖ్యాత ప్రత్యామ్నాయ సినిమా దర్శకుడు, కవి, రచయిత, చిత్రకారుడు బి. నరసింగరావుతో ప్రభుత్వం చర్చించి ఒక సాంస్కృతిక పాలసీ డాక్యుమెంట్‌ను తయారు చేయించింది.


ఆయన తెలంగాణ హెరిటేజ్‌కు సంబంధించి ఒక విలువైన డాక్యుమెంట్‌ను రూపొందించారు. సాహిత్యం, సాంస్కృతికం, లలిత కళలు, శిల్పకళ, గ్రంథాలయాలు, ప్రదర్శనశాలలు, చలనచిత్రం, నాట్యం, ఫోటోగ్రఫీ మొదలుకొని సమస్త రంగాలను మేళవించి తెలంగాణ రాష్ట్రం కోసం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి కల్చరల్ పాలసీ డాక్యుమెంట్‌ను ఆయన రూపొందించారు. ఏ ప్రభుత్వాలకైనా అభివృద్ధి, సంక్షేమం, ప్రజా పరిపాలనకు సంబంధించి ప్రాధాన్యతలు ముందు వరుసలో ఉంటాయి. అనంతరం శాంతిభద్రతలు, ఆర్థిక వ్యవహారాలు. ఆ తర్వాతే సాహిత్యం, సంస్కృతి, క్రీడలు, ఇతర కళావారసత్వానికి సంబంధించినవి ఉంటాయి. కానీ కాలయాపన చేయకుండా ఒక సమగ్ర సంస్కృతిక పాలసీని చర్చించి, ఆమోదిస్తే తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వం కాట కలువకుండా నిలిచిపోతుంది. బి. నరసింగరావు రూపొందించిన సమగ్ర సాంస్కృతిక విధానపత్రం మహా అద్భుతంగా ఉంది. ఒక ఆర్కిటెక్ట్‌ బహుళ అంతస్తుల భవనాన్ని కళాత్మకంగా ఎలా గీస్తారో నర్సింగరావు అలాగే ఒక విజనరీ ప్రణాళికను రూపొందించారు. అందులో ఇప్పుడు ఉన్న సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లళిత కళా అకాడమీ, ఫోటోగ్రఫీ అకాడమీ, జానపద అకాడమీలను ప్రతిపాదించారు.


వీటితోపాటు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గ్రంథాలయాలు, మ్యూజియాలు, ఇవన్నీ వివిధ శాఖల కింద పనిచేస్తున్నాయి. అన్నిటి అనుసంధానం జాప్యం కాకుండా సీఎంఓ స్థాయిలో కార్యదర్శి నేతృత్వంలో సాంస్కృతిక సచివాలయం ఒకటి ఉండాలి. సంబంధిత పర్యవేక్షణ ద్వారా ఇది కొనసాగుతుండాలి. ఇందులో సాహిత్యం, కళలు, చలనచిత్రం, సాంస్కృతిక వారసత్వం, జాతీయ అంతర్జాతీయ లావాదేవీలు విభాగాలుగా ఉండాలి. వీటికి గురుత్వ అధికారి నేతృత్వం వహించాలి. ఆ అధికారి కూడా ఆయా విషయ పరిజ్ఞానంలో నిష్ణాతులై, నిపుణులై ఉన్నవాళ్లను ఎంపిక చేయాలి. ఇకపోతే సాహిత్యం, కళల కోసం పూర్వ తెలంగాణలోని పది జిల్లా కేంద్రాల్లో 25 ఎకరాల ప్రభుత్వ భూమిలో భవన సదుపాయాలు నిర్మించాలి. ఇందులో ఆ పూర్వ జిల్లా పరిధిలో చిత్రకళ, శిల్పకళ, సంగీతం, నృత్యం, నాటకం, ఫోటోగ్రఫీ, సినిమా అధ్యయనం, వారసత్వ అధ్యయనానికి కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఒక కళాశాల నిర్మించాలి. అదే స్థలంలో 800, 250, 150 సీట్ల కెపాసిటీతో, వేర్వేరు వైశాల్యాలతో మూడు ఆడిటోరియాలు నిర్మించాలి. మరొక భవనంలో మ్యూజియం, గ్రంథాలయం, ఫోటోగ్రఫీ, పెయింటింగ్ ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. మరొక భవన సదుపాయంలో శిక్షణా శిబిరాల రిహార్సల్స్ కోసం విశాలమైన షెడ్లు, సిబ్బంది వసతిగృహాలు నిర్మించాలి.


ఇలా పది జిల్లాల్లో నిర్మిస్తూ సమాంతరంగా పది ఎకరాలలో హైదరాబాదులో మరొక భవన సదుపాయాన్ని నిర్మించాలి. కెఫటేరియా, రెస్టారెంట్ గెస్ట్‌హౌస్‌లు డబుల్ బెడ్ రూమ్‌లు ఉండాలి. వీటితో పాటు తెలంగాణలో అన్ని నగరాల్లో ఉన్న ఆడిటోరియాలను పునరుద్ధరించాలి. తెలంగాణలో నడుస్తున్న బాల భవన్‌లు, శిల్పారామాలను పునర్ నిర్మించి తెలంగాణ సాంస్కృతిక కేంద్రంగా కార్యకలాపాలను నడిపించాలి. ప్రపంచంలో సినిమా రంగానికి సంబంధించిన అధ్యయనం గొప్పగా సాగుతున్నది. మన తెలుగు రాష్ట్రంలో అది లేదు. ఇందుకోసం ఫిలిం సొసైటీలు నటీనటుల సంఘాల సమన్వయంతో సంప్రదింపులు జరపాలి. సినిమాలకు సంబంధించి నిర్మాణం, ప్రచారం, ప్రదర్శన ఇలా మూడు పాయలుగా అభివృద్ధి చేయాలి. అందుకుగాను 10 ఎకరాల స్థలంలో ఒక సినిమా కాంప్లెక్స్ తీర్మానం చేపట్టి దానికి ‘పైడి జయరాజు సినిమా ఘర్’ పేరు పెట్టాలి పైడి జయరాజ్ తెలంగాణ సినిమా వైతాళికుడు. 1928లోనే తెలుగు సినిమాను జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లిన ఘనుడు. ‘సినిమా నిర్మాణ’ కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలి అందులో నిర్మాతల సంఘం, దర్శకుల సంఘం, సినిమా కళాకారుల సంఘం, సినిమా జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేయించాలి. ఈ సినిమా ఘర్లోనే 24 కళలకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతాయి.


సినిమా అధ్యయనం శిక్షణ పరిశోధన కోసం ‘శ్యాం బెనగల్ సినిమా అకాడమీ’ ఏర్పాటు చేయాలి. ఈ అకాడమీ ఆవరణలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌, ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్, బాలల చలనచిత్రాల క్లబ్, ఫిలిం సొసైటీ కార్యాలయాల వేదిక, ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లు ఉండాలి. ఈ ఆవరణలో కూడా మూడు థియేటర్లు ఉండాలి. మరొకటి ‘బిఎస్ఎన్ సినిమా రిక్రియేషన్ సెంటర్’. బిఎస్ఎన్ అంటే బిఎస్ నారాయణ తెలంగాణ సినిమా వైతాళికుడు. అలాగే ‘కాంతారావు సెంటర్ ఫర్ సినిమా హ్యాబిటేషన్’ ఏర్పాటు చేయాలి. ఇందులో చిత్ర పరిశ్రమ కార్మికులు, కుటుంబాల కోసం అపార్ట్‌మెంట్లు నిర్మించాలి. మరొకటి ‘పిఆర్ చలనచిత్ర స్టూడియోస్’ నిర్మిస్తే ఇది అత్యంత ఆధునిక స్టూడియో అవుతుంది. అప్పుడే తెలంగాణ సినిమాకు దేశవ్యాప్తంగా ఖండాంతరంగా గుర్తింపు గౌరవం లభిస్తాయి. పిఆర్ అంటే ప్రభాకర్ రెడ్డి. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. పురానిక్షిప్తశాఖ, గ్రంథాలయాలు, ప్రచురణలు, రాష్ట్రీయ బుక్ ట్రస్ట్, రాష్ట్ర ప్రచురణల విభాగం విడివిడిగా ఏర్పాటు చేయాలి. తెలంగాణ వైతాళిక చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు నాగోబా జాతర, బతుకమ్మ, హైదరాబాద్, రాజా దీనదయాల్, వట్టికోట ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి, మక్దూం, గణేష్ నిమజ్జనం, కోటిలింగాల, ఫణిగిరి, నందికొండ... తదితర వారసత్వాలపై కాఫీ టేబుల్ బుక్ ప్రచురించాలి. ఇందుకు సంబంధించిన బడ్జెట్, ఐదేళ్ల ప్రణాళికలు రూపొందించి దశలవారీగా కార్యకలాపాలను కొనసాగించవచ్చు. ఇందులో రాష్ట్ర బడ్జెట్‌లో ఒక శాతం మాత్రమే ఖర్చు అవుతుందని బి. నర్సింగరావు తన డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక విధానానికి సంబంధించి 22 పుటల్లో రూపొందించిన ఈ పత్రం భావి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అన్నవరం దేవేందర్

కవి, రచయిత

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 27 , 2025 | 05:06 AM