కృత్రిమ మేధలో ‘డ్రాగన్’ దూకుడు
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:06 AM
కృత్రిమ మేధ (ఎఐ) సాంకేతికత చైనాకు ప్రతీకగా మారింది. ప్రపంచదేశాలు ఇంతవరకు చైనాను చూస్తున్న తీరు తెన్నులను డీప్‌సీక్ ఒక్కసారిగా మార్చి వేసింది. చైనా శీఘ్రపురోగతిని నిరోధిస్తున్న ప్రతి ద్రవ్యోల్బణం, రుణభారం...

కృత్రిమ మేధ (ఎఐ) సాంకేతికత చైనాకు ప్రతీకగా మారింది. ప్రపంచదేశాలు ఇంతవరకు చైనాను చూస్తున్న తీరు తెన్నులను డీప్‌సీక్ ఒక్కసారిగా మార్చి వేసింది. చైనా శీఘ్రపురోగతిని నిరోధిస్తున్న ప్రతి ద్రవ్యోల్బణం, రుణభారం, జనసంఖ్యామానం సమస్యలపై కలవరపాటు సమసిపోయేందుకు డీప్‌సీక్ దోహదం చేస్తోంది. ఇప్పుడు మదుపుదారులు అందరూ ఆ సమస్యల గురించి కాకుండా ఆర్థికాభివృద్ధిలో అమెరికాను చైనా ఎలా, ఎంతత్వరగా అధిగమించగలుగుతుంది, సాంకేతికతల సృష్టిలో ప్రస్తుత ప్రపంచ అగ్రరాజ్య ప్రాబల్యాన్ని చైనా ఎలా సవాల్ చేయనున్నదీ అన్న విషయాలపైనే మాటామంతీ జరుపుతున్నారు. చైనాకు విశేషంగా ఉన్న ‘ఇంజినీర్ లబ్ధి’ (engineer dividend) సత్ఫలితాలనిస్తోంది. 2000–2020 సంవత్సరాల మధ్య చైనాలో ఇంజినీర్ల సంఖ్య 5.2 మిలియన్ నుంచి 17.7 మిలియన్‌కు పెరిగింది. అపారంగా అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ ప్రతిభాపాటవాలు ‘ఉత్పత్తి అవకాశాల సరిహద్దు’ (production possibility frontier)ను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడంలో చైనాకు తోడ్పడుతుంది.
ఒక విధంగా డీప్‌సీక్ సంచలనం ఆశ్చర్యకరమైనదేమీ కాదు. ఇంజినీరింగ్ ప్రతిభావంతులు అత్యధిక సంఖ్యలో ఉండడం వల్లే సాంకేతికతల నవీకరణలో పథనిర్దేశం చేయగల అవకాశం చైనాకు లభించింది. 2022లో ప్రపంచ అగ్రగామి ఎఐ పరిశోధకులలో 47శాతం మంది తమ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను చైనాలోనే పూర్తి చేశారు. ఈ విషయంలో అమెరికా వాటా 18 శాతం మాత్రమే. ప్రపంచ మేధా సంపత్తి సంస్థ గణాంకాల ప్రకారం 2024లో ఇన్నోవేషన్ ఇండికేటర్స్‌లో చైనా మూడవ స్థానంలో ఉంది. ఈ వినూత్న సాంకేతికతల సృష్టి అనామక పరిశోధనా కేంద్రాల నుంచి జరుగుతున్నదనే వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి. ఇందుకొక ఉదాహరణే డీప్‌సీక్. బీజింగ్‌లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం ‘Tsinghua’ నుంచి అది ప్రభవించలేదు. ఒక చిన్ననగరంలోని ఒక అంకుర సంస్థ నుంచి అది వెలుగుచూసింది. డీప్‌సీక్ సృష్టికర్త లియాంగ్ వెన్‌ఫెంగ్ ప్రఖ్యాత ఝెజియాంగ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. అయితే, ఆ వర్శిటీ చైనా హార్వర్డ్ విశ్వవిద్యాలయమేమీ కాదు. స్టాక్ ఎనాల్సిస్, రెజ్యూమ్ స్క్రీనింగ్ మొదలైన సంక్లిష్ట పనులను సమర్థంగా నిర్వర్తించగల అధునాతన సాంకేతికతను సృష్టించడం ద్వారా Manus ఎఐ ఇటీవలే మరొకసారి కృత్రిమ మేధరంగంలో అమెరికా అగ్రగామిత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది.
ఈ సంస్థ చీఫ్ ఎక్జిక్యూటివ్ జియావోహాంగ్ వూహాన్‌లోని హువాఝోంగ్ విశ్వవిద్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చదివాడు. ఈ వర్శిటీ పేరు ప్రఖ్యాతులు ఝెజియాంగ్ విశ్వవిద్యాలయంకు ఉన్న వాటి కంటే కూడా తక్కువే. ‘యూనిట్రీ రోబోటిక్స్’ అనే అంకుర సంస్థనే తీసుకోండి. దీని ‘కుంగ్ ఫు బాట్స్’ ప్రతిష్ఠాకరమైనవి. కృత్రిమమేధ ఆధారిత మానవుల లాంటి రోబోల (హ్యూమనాయిడ్) అధికోత్పత్తిలో అమెరికా, చైనాల మధ్య పోటీలో చైనాను అగ్రగామిగా నిలపడంలో ఈ కుంగ్ ఫు రోబోలు విశేష దోహదం చేశాయి. షాంఘైలోని ఒక స్థానిక విశ్వవిద్యాలయంలో ఈ అంకుర సంస్థ వ్యవస్థాపకుడు వాంగ్ చదువుకున్నాడు. ఇంగ్లీష్ పరీక్షలో తగిన మార్కులు సాధించలేకపోవడంతో ఏమంత పేరులేని విశ్వవిద్యాలయమే అతడికి దిక్కు అయింది. ఒక్కమాటలో చెప్పాలంటే, చైనా ఏమి సాధించగలదన్న విషయాన్ని నిర్ధారించేందుకు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులయిన అగ్రగామి ఒకశాతం మంది ప్రతిభావంతులను పరిగణనలోకి తీసుకోవద్దు. దిగువస్థాయి విశ్వవిద్యాలయాలలో చదువుకుని, చిన్ననగరాలలో నివసిస్తున్నవారు దిగ్భ్రమ కలిగించే నవకల్పనలతో ప్రపంచం ముందుకు వస్తున్నారు. మరో ముఖ్యవిషయమేమిటంటే చైనా ‘వ్యయప్రయోజనం’ పొందుతోంది. ఒక సంస్థ తన పోటీదారుల కంటే తక్కువ ఖర్చుతో వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని ఈ వ్యయప్రయోజనం సూచిస్తుంది. ఇది అధిక లాభదాయకతకు, మార్కెట్లో పోటీతత్వానికి అవకాశమిస్తుంది. చైనాలో మొత్తం ఇంజినీరింగ్ పట్టభద్రులలో 30 సంవత్సరాల లోపువారు 44 శాతం.
అమెరికాలో ఇది 20 శాతం మాత్రమే. ఒక ప్రతిభావంతుడైన పరిశోధకుడి మీద చైనా పెడుతున్న ఖర్చు అమెరికా చేస్తున్న వ్యయంలో ఎనిమిదో వంతు. చైనాలో ఉన్నత విద్యారంగంమీద పాలకుల శ్రద్ధ కారణంగా ఇప్పుడు ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసినవారిలో 40శాతం మంది విశ్వవిద్యాలయాలకు వెళ్లుతున్నారు. పాతికేళ్లక్రితం ఇటువంటి విద్యార్థుల సంఖ్య కేవలం 10 శాతం. చైనాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలో ఇంజినీరింగ్ కోర్సులో చేరేవారు అత్యధికం. జనాభాసంఖ్య తగ్గుదల సమస్యతో సతమతమవుతున్న చైనా ప్రభుత్వానికి ఇదొక ఉపశమనం. గత ఏడాది చైనాలో 9.5 మిలియన్ పసిపాపలు మాత్రమే పుట్టారు. కోవిడ్ ఉపద్రవానికి ముందుకాలంలో వార్షిక జనాభా పెరుగుదల 15 మిలియన్‌గా ఉండేది. తమ సమాజం అంతకంతకూ వృద్ధాప్య సమాజం అయిపోతుండడంతో పాటు ఎగుమతుల ఆధారిత అభివృద్ధి నమూనా ప్రయోజనాలు తగ్గిపోవడంతో ఒకనాటి జపాన్ వలే చైనా ప్రాధాన్యాన్ని కోల్పోవచ్చనే భయాందోళనలు ఈ దేశ ప్రజలు, పాలకులలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ ప్రతిభాపాటవాల సమృద్ధి ఒక సరికొత్త అభివృద్ధి నమూనాను సూచిస్తోంది. చైనా కార్మిక శ్రేణులలో వృద్ధులు పెరిగిపోతున్నారు. ఆగ్నేయాసియా దేశాలతో పోలిస్తే చైనాలో సంప్రదాయక ఎగుమతుల రంగాలయిన స్మార్ట్ ఫోన్స్, వస్త్రోత్పత్తులలో కార్మికుల వేతన భత్యాలు అత్యధికం. అయితే, ప్రతిభాసంపన్నులైన యువ ఇంజినీర్లు సమృద్ధిగా అందుబాటులో ఉన్నారు. జీవ సాంకేతికతలు, రోబోలు, కృత్రిమ మేధ అనువర్తనాలలో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు దీటైన పోటీ నివ్వగల శక్తిసామర్థ్యాలను చైనాకు వారు సమకూర్చగలరు.
చైనా పాలకులు ఇప్పటికే సంప్రదాయ ఎగుమతుల రంగాలకు ప్రాధాన్యమివ్వడాన్ని తగ్గించారు. ఆ రంగాలలో తాము కీలక అనుకూలతలను కోల్పోతున్నామన్న వాస్తవాన్ని వారు గుర్తించారు. అందుకు మారుగా ఉత్కృష్ట ఇంజినీరింగ్ ప్రతిభాసామర్థ్యాలను అపారంగా సమకూర్చుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. కనుక అమెరికా టెక్నలాజికల్ శక్తి సామర్థ్యాలు తిరుగులేనివని వాదిస్తున్నవారు వాటికి చైనా నుంచి ఎదురవనున్న వ్యవస్థాగత సవాళ్లను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. ఒకనాడు వస్త్రోత్పత్తులు, గృహ సామగ్రి ఉత్పత్తులలో వలే ఇప్పుడు కృత్రిమమేధ ఇత్యాది అధునాతన సాంకేతికతరంగాలను డ్రాగన్ దున్నేయబోతున్నదా?
షులి రెన్
(డెక్కన్ హెరాల్డ్ సౌజన్యం)
ఈ వార్తలు కూడా చదవండి
AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..
Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్
CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...
For More AP News and Telugu News