Share News

కోర్టులతో జలవివాదాలు పరిష్కారమౌతాయా?

ABN , Publish Date - Mar 27 , 2025 | 05:00 AM

కేసు ఓడినవాడు కోర్టు వద్దనే ఏడిస్తే, కేసు నెగ్గినవాడు కూడా అప్పుల పాలై ఇంటికొచ్చి ఏడ్చినాడనేది సామెత. ఈ సూత్రం అంతర్ రాష్ట్ర జల వివాదాలకూ అన్వయమవుతుంది. కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాల మధ్య వివాద...

కోర్టులతో జలవివాదాలు పరిష్కారమౌతాయా?

కేసు ఓడినవాడు కోర్టు వద్దనే ఏడిస్తే, కేసు నెగ్గినవాడు కూడా అప్పుల పాలై ఇంటికొచ్చి ఏడ్చినాడనేది సామెత. ఈ సూత్రం అంతర్ రాష్ట్ర జల వివాదాలకూ అన్వయమవుతుంది. కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి 2004లో నియామకమైన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో తుది తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తమకు సమ్మతం కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తడితే, నోటిఫై కాకుండా స్టే విధించింది. పదేళ్లయినా అది అలాగే ఉంది. ఫలితంగా 1975లో ఇచ్చిన బచావత్ ట్రిబ్యునల్ తీర్పు నేటికీ అమలులో ఉంది. అదే విధంగా ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్య మహానది జల వివాదమూ ఏళ్ల తరబడి నానుతోంది. తుదకు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వంశధార నదీ జలాల వివాద పరిష్కారానికి నియామకమైన ట్రిబ్యునల్ 2017లో తాత్కాలిక తీర్పు ఇస్తూ, వంశధార నదిపై నేరెడి వద్ద ఆంధ్రప్రదేశ్ బ్యారేజీ నిర్మించుకోవచ్చని చెప్పింది. దీనిపై 2019లో ఒడిషా సుప్రీంకోర్టుకెక్కింది. తుదకు ట్రిబ్యునల్ 2021లో తుది తీర్పు ఇచ్చినా, సుప్రీంకోర్టు విధించిన స్టే ఇంకా కొనసాగుతోంది. వంశధారపై నేరెడి వద్ద బ్యారేజీ నిర్మించి సైడ్‌వేర్ కడితే కేవలం 40 కోట్ల రూపాయల వ్యయంతో వంశధార–నాగావళి నదుల అనుసంధానం సులభంగా జరిగి పోతుంది.


కావేరీ నదిపై నియామకమైన ట్రిబ్యునల్ తీర్పు కూడా సమస్యను పరిష్కరించలేకపోతే తుదకు సుప్రీంకోర్టు జోక్యంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. అయినా అప్పుడప్పుడూ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఏ నదీ జలాల వివాదమైనా ట్రిబ్యునల్స్, కోర్టుల తీర్పు కన్నా సామరస్యంగా పరస్పరం ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరిస్తే పరిష్కారం లభిస్తుంది. ఇదంతా ఎందుకంటే... తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం నేడు తారస్థాయికి చేరింది. రెండు రాష్ట్రాల్లో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వాలు రెచ్చగొట్టే ధోరణి పక్కన పెట్టినా, రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు ఆయా ప్రభుత్వాలకు పొగ పెట్టడం ఎక్కువైంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం బేసిన్‌లోని ప్రాజెక్టులను యాజమాన్య బోర్డుకు అప్పగించడంపై స్టే కోరుతూ సుప్రీంకోర్టు కెక్కింది. బహుశా నిత్యం భావోద్వేగాలు రెచ్చగొట్టే కేసీఆర్‌ వైఖరికి కౌంటర్ కావచ్చునేమో! గతంలో ట్రిబ్యునల్స్ తీర్పుల అంశంలో ఏం జరిగిందో గమనంలోకి తీసుకోకుండా తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాల నేతలు వ్యవహరిస్తున్నారు. మున్ముందు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతోనే తెలంగాణ సాగునీటి సమస్యలు పరిష్కారమౌతాయని రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. అత్తకిచ్చిన ముంత తలాకిటనే ఉందనే అంశం మరచిన కోడలిలా ఉంది ఈ వ్యవహార శైలి. ట్రిబ్యునల్ తీర్పు అంశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రాజెక్టుల అప్పగింతపై తాము తొక్కిన దారినే ఎంచుకోదని గ్యారంటీ ఏమిటి? ఇలా ఒకరికొకరు పోటీ పెంచుకుంటూ పోతే దీనికి పరిష్కారం ఎక్కడ? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సామరస్యం కొరవడినందున కలిగే దుష్ఫలితాలకు ఈ నీటి సంవత్సరం కృష్ణానదికి వచ్చిన వరద జలాలే నిదర్శనం.


ఈ ఏడాది శ్రీశైలం జలాశయానికి 1600 టీయంసీలు నీళ్లు వస్తే, రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం, సమన్వయం కొరవడినందున ప్రకాశం బ్యారేజీ నుంచి 860 టీయంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఇప్పుడు నాగార్జునసాగర్‌లో ముప్పయి, శ్రీశైలం జలాశయంలో ముప్పయి టియంసిల నీళ్లు కూడా లేవు. ఈ వేసవిలో జంట నగరాల దాహార్తికి సాగర్ నుంచి పంపింగ్ చేసే సన్నాహాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో 150 టీయంసీలు క్యారీ ఓవర్ కింద నిల్వ చేసుకొనే అవకాశం ఉన్నా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చేజార్చుకున్నాయి. తాము చెప్పినా, బోర్డు చెప్పినా తెలంగాణ వినిపించుకోకుండా శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి కోసం విచ్చలవిడిగా నీళ్లు వదిలేసిందని ఆంధ్రప్రదేశ్ కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇప్పుడు రెండు కేసులు ఒకటిగా విచారణకు వచ్చాయి. వాస్తవం ఇలా కళ్ల ముందు ఉంటే కేసీఆర్‌కు చెందిన మీడియా రోజూ ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం జలాశయం నుంచి కిందకు నీళ్లు వదిలిందని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని కథనాలు వండి వార్చింది. ఇప్పటికి కూడా తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతలు ఈ ఏడాది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 250 టీయంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం గురించి తమ ప్రసంగాల్లోనే కాకుండా, మీడియాలోనూ విమర్శలు చేస్తున్నారు.


కానీ 860 టీయంసీల నీళ్లు ఎందుకు సముద్రం పాలయ్యాయో ఆలోచించడం లేదు. ఘోరమైన ఓటమి నుంచి తట్టుకొని నిలబడేందుకు ఇప్పుడు కూడా భావోద్వేగాల అస్త్రాన్ని కేసీఆర్‌ ప్రయోగించడమే విషాదం. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెక్కింది! సకాలంలో జాగ్రత్త పడకపోతే వేసవి కాలంలో తాగునీటికి తంటాలు తప్పవని రెండు రాష్ట్రాలు గుర్తించాలి. కేసీఆర్‌ ట్రాప్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పడితే దీర్ఘకాలికంగా కూడా రెండు రాష్ట్రాల జలవివాదాలు సామర్యంగా పరిష్కారం కావు. గమనార్హమైన అంశమేమంటే తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి పార్టీ నేతలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్యం కుదరనీయకుండా నిరాధారమైన ఆరోపణలతో రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వీరికి దొరికాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పర్యావరణ అనుమతులు నిరాకరించడంపై వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. ఈ అంశంలో ఇప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు. గతంలోనే ఇందుకు చెందిన రికార్డులు సమర్పించి ఉండాలి. 2019లో జగన్‌ సూచనల మేరకు కర్నూలు చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం విస్తరణగా ఉంది. అప్పటినుంచి ఈ పథకం అమలు జరిగి ఉంటే ఇన్ని తిప్పలు ఉండేవి కావు. అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ప్రయోజనకారిగా ఉండేది. తెలంగాణలో 2013లో జూరాల నుంచి 70 టీయంసీలు తరలింపునకు


కిరణ్‌కుమార్‌రెడ్డి జీవో ఇస్తే దాన్ని, 180 కిలోమీటర్ల కింద శ్రీశైలం జలాశయం నుంచి 90 టీయంసీలు తరలించే విధంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టి, ఇది పాత ప్రాజెక్టుగా ఆమోదముద్రకు యత్నించారు. ఆ మాత్రం జగన్‌కి తట్టనందున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణగా చేపట్టి, కొత్త ప్రాజెక్టుగా తయారు చేశారు. తుదకు ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టే ముందు కేంద్ర జల సంఘానికి సమగ్రమైన డీపీఆర్ పంపలేదు. పైగా పంపిన డీపీఆర్ కూడా తిరిగి వచ్చింది. కేసీఆర్‌తో ఒకవైపు స్నేహం చేసిన జగన్, ఆయన ట్రిక్కులు ఆకళింపు చేసుకోలేకపోయారు. మరోవైపు తెలంగాణకు అనుకూలంగా ట్రిబ్యునల్ నియామకానికి అనుమతి ఇచ్చి, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం తీరని అపకారం చేశారు. అదంతా మరచి ఇప్పుడు వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడు ఏమైంది? అటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు దిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లకు కేంద్రం జలసంఘం కొర్రీలు వేసింది. ఇటు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేకుండా పోయాయి. ప్రతి అంశానికి తెలంగాణ ప్రభుత్వం అప్పుడూ ఇప్పుడూ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ఆగమంటున్నది. ట్రిబ్యునల్ తీర్పు ఏ విధంగా ఉంటుందో పక్కన పెడితే, బేసిన్‌లోని ప్రాజెక్టులు బోర్డుకు అప్పగింతపై తెలంగాణ స్టే కోరినట్లే, ఆంధ్రప్రదేశ్ కూడా కోర్టు కెడితే... దీనికి అంతం ఎక్కడ? వాస్తవం చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు జఠిలమవుతున్నాయి. దీనికి తోడు భావోద్వేగాలు జత కలవడంతో పీటముడి రోజురోజుకూ బిగుసుకుంటోంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగడం రెండు రాష్ట్రాల అభివృద్ధికి క్షేమం కాదు.


పైగా ఈ వివాదాలతో గొంతెండిపోతున్న అటు దక్షిణ తెలంగాణ, ఇటు రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ ఏడాది వరద వెల్లువెత్తినా ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పుడు తాగునీటికి కూడా కటకటలాడవలసి వస్తోంది. రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన వారి కుట్రలను ప్రభుత్వాలు ప్రజల ముందు బహిర్గతం చేయాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి చెబుతూ తొలుత జూరాల నుంచి ఎత్తిపోతలు పెట్టిన పథకాన్ని శ్రీశైలం జలాశయానికి మార్చి వివాదాస్పదం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వం కాదా? అని సరైన కోణంలో ఎదురు దాడి చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ముచ్చుమర్రి నుంచి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణగా మార్పు చేసి వివాదాస్పదం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని చెప్పే నేత కూటమి ప్రభుత్వంలో కన్పించడం లేదు.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 27 , 2025 | 05:01 AM