Myanmar Earthquake: భూ విలయం
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:24 AM
శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్, థాయ్‌లాండ్ దిశగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 191 మంది మరణించారు, 800 మందికి పైగా గాయపడ్డారు. భారత్, బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి

మయన్మార్, థాయ్‌లో భారీ భూకంపం!
191 మంది మృతి 800 మందికి గాయాలు
శుక్రవారం మధ్యాహ్నం 12.50కి ఘటన రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు 12 నిమిషాల్లో 6.4 తీవ్రతతో మరో భూకంపం తర్వాత మరో 4 సార్లు ప్రకంపనలు శిథిలాల్లో వందల మంది ఆచూకీ గల్లంతు థాయ్‌లాండ్, నైరుతి చైనాల్లో భారీగా ఆస్తి నష్టం భారత్, బంగ్లాదేశ్‌ల్లోనూ ప్రకంపనలు థాయ్‌లాండ్, మయన్మార్‌లలో అత్యవసర పరిస్థితి అన్నివిధాలా ఆదుకుంటాం: ప్రధాని నరేంద్ర మోదీ
బ్యాంకాక్, మార్చి 28: అతి భారీ భూకంపం మయన్మార్‌ను కుదిపేసింది. రాజధాని నేపిడో, రెండో అతిపెద్ద నగరం మాండలేలలో భారీ ప్రాణనష్టం, తీవ్ర ఆస్తినష్టం సంభవించింది. ప్రఖ్యాత కట్టడాలు, పురాతన ఆలయాలు, ఆస్పత్రులు కూలిపోయాయి. 181 మంది మరణించి ఉంటారని అంచనా. మరో 730 మంది గాయపడ్డారని చెబుతున్నారు. వందల మంది జాడ తెలియడం లేదు. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు(భారత కాలమానం ప్రకారం 11.50) రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో తొలుత ఒక భూకంపం వచ్చింది. తిరిగి పన్నెండు నిమిషాల వ్యవధిలో 6.4 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. తర్వాత మరోనాలుగుసార్లు ప్రకంపనలు వచ్చాయి. రెండోసారి వచ్చిన భూకంపం మయన్మార్‌నే కాకుండా పొరుగున ఉన్న థాయ్‌లాండ్, చైనాలోనూ విధ్వంసం సృష్టించింది. థాయ్‌లాండ్‌లో పది మందికి పైగా మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. చైనా వివరాలు అసలు బయటకే రాలేదు. అయితే, మూడు దేశాల్లో కలిపి ప్రాణనష్టం శనివారం నాటికి భారీగా పెరగొచ్చని అనుమానిస్తున్నారు.
పెద్ద సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా బహుళ అంతస్తులకు నిలయమైన థాయ్‌లాండ్ రాజధాని, ప్రముఖ పర్యాటక కేంద్రం బ్యాంకాక్‌లో పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం నిలువునా కూలిపోయిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను నిరుత్తరులను చేశాయి. అంతపెద్ద భవనం క్షణాల్లో సిమెంటు రాళ్లు, ఇనుప తీగలకుప్పగా మారింది. ఈ ఒక్క భవనంలోనే 43 మంది నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారని అంటున్నారు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి ఆర్తనాదాల వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. మయన్మార్, థాయ్‌లాండ్ రెండు దేశాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంప కేంద్రం ఉన్న మయన్మార్‌లో పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఐరావతి నది మీద మాండలే నగరంలో 90 ఏళ్ల క్రితం కట్టిన ప్రఖ్యాత అవా వంతెన కుప్పకూలిపోయింది. దాంతో మాండలేకు, మయన్మార్ అతిపెద్ద నగరం యాంగూన్‌కు మధ్య రాకపోకలు దెబ్బతిన్నాయి. మాండలేలో బహుళ అంతస్తుల భవనం వంగిపోవడంతో పైభాగాన స్విమ్మింగ్‌పూల్ నుంచి నీరంతా జలపాతంలా దూకే దృశ్యాలను ప్రజలు చిత్రీకరించారు.
మయన్మార్ రాజధాని నేపీటాలో వెయ్యి పడకల ఆసుపత్రి కూలిపోయి 20 మంది మరణించారు. మాండలే నగరంలోని మాండలే రాజప్రాసాదం, బౌద్ధ క్షేత్రం మహాముని పగోడా పునాదులు దెబ్బతిన్నాయి. ఎవరు సాయం ఇచ్చినా స్వీకరిస్తామని మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంకాక్ నగరంలో పలు హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు ముందుజాగ్రత్తగా మూసేశారు. ప్రభుత్వం కూడా పర్యాటకులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లొద్దని సూచించింది. బ్యాంకాక్‌ను ప్రభుత్వం విపత్తు ప్రాంతంగా ప్రకటించింది. తెలుగువారు ఎక్కువగా వెళ్లే పట్టాయా భూకంప కేంద్రానికి దూరంగా ఉండటంతో అక్కడ పెద్దగా ప్రభావం లేదు. అయితే, మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. భూకంపం కారణంగా థాయ్‌లాండ్‌లో విమానాశ్రయాలు మూసేయడంతో హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చే పలు విమానాలు రద్దు అయ్యాయి. ఆ విమానాల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు సాయంత్రం నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నారు. భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం పది కిలోమీటర్ల లోతులో ఉండటం వల్ల నష్టం తీవ్రత అధికంగా ఉందని భావిస్తున్నారు. భూకంపం నేపథ్యంలో థాయ్‌లాండ్ స్టాక్ ఎక్స్ఛేంజీని నిలిపేశారు. కోల్‌కతాలోనూ ప్రకంపనలు భూప్రకంపనలు భారత్ వరకు విస్తరించాయి. కోల్‌కతా, ఇంపాల్‌లో భవనాలు కంపించాయి. భూకంపం నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. రెండు దేశాలకు ఎలాంటి సాయం అవసరమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మయన్మార్, థాయ్‌లాండ్ ప్రభుత్వాలతో భారత విదేశాంగ శాఖ టచ్‌లో ఉందని చెప్పారు. బంగ్లాదేశ్‌లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.
రాజధాని ఢాకా, చిట్టగాంగ్‌లలో ప్రకంపనలు వచ్చాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బ్యాంకాక్ సబర్బన్ ప్రాంతాల్లో 1.7 కోట్ల మంది నివసిస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన బ్యాంకాక్‌లో ప్రజలంతా షాపింగ్ మాల్‌లు ఖాళీ చేసి నగరం మధ్యలో ఉన్న పార్క్‌లో పోగయ్యారు. భారతీయ పర్యాటకులు పెద్ద ఎత్తున ఉండే నగరం కావడంతో ప్రస్తుతం అక్కడే ఉన్న పర్యాటకుల బంధువులు ఆందోళనలో మునిగి పోయారు. యోగక్షేమాల కోసం ఫోన్లు ఎక్కువ కావడంతో నెట్‌వర్క్‌లు స్తంభించిపోయాయి. భారత ప్రభుత్వం భారతీయ పర్యాటకుల కోసం +66618819218 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. నైరుతి చైనాలోని యునాన్ రాష్ట్రంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ప్రకంపనల భయానికి జనం ఇళ్లలోకి వెళ్లడం లేదు. మయన్మార్ సరిహద్దులోని చైనా పట్టణం జిన్హోంగ్‌లో భూమి ఒక నిమిషం పాటు కంపించిందని స్థానిక అధికారులు తెలిపారు. మయన్మార్, థాయ్‌లాండ్‌లకు కావాల్సిన మందులను పంపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 2004 సునామీ భూకంపం తర్వాత థాయ్‌లాండ్‌లో భూకంపాలను ఎదుర్కోవడానికి అన్ని రకాల వ్యవస్థలను సిద్ధం చేశారు. దాంతో ప్రాణనష్టం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
DA Hike 2025: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు గురించి అధికారిక ప్రకటన
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News