Share News

Hormone Free Male Birth Control Pill: వీర్య నిరోధక మాత్ర

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:46 AM

అమెరికన్‌ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేసిన "వైసీటీ-529" అనే హార్మోన్‌ రహిత గర్భనిరోధక మాత్ర 99% సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు ఎలుకలు, కోతులపై జరిపిన ప్రయోగాల్లో తేలింది. మానవపై తొలి దశ ట్రయల్స్‌ పూర్తయ్యాయి, న్యూజిలాండ్‌లో రెండో దశ ట్రయల్స్‌ జరుగుతున్నాయి

Hormone Free Male Birth Control Pill: వీర్య నిరోధక మాత్ర

హార్మోన్‌ రహిత ట్యాబ్లెట్‌ వైసీటీ 529ను అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రజ్ఞులు 99% సామర్థ్యంతో పని చేస్తున్నట్టు ఎలుకలు, కోతులపై ప్రయోగాల్లో వెల్లడి మనుషులపై తొలి దశ ట్రయల్స్‌ పూర్తి.. న్యూజిలాండ్‌లో 2వ దశ ఈ దశాబ్దం చివరికి అందుబాటులోకి వచ్చే చాన్స్‌?

లండన్‌: మీరు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లండి. గర్భనిరోధక మాత్రలంటే మహిళలు మాత్రమే వాడేవి దొరుకుతాయి. పురుషులు వాడే మాత్రలు ఎక్కడా దొరకవు. దాదాపు ఏడెనిమిది దశాబ్దాలుగా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రజ్ఞులు కృషి చేస్తున్నా ‘మేల్‌ బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌’ను మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. కానీ, యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటాకు చెందిన శాస్త్రజ్ఞులు తాము ఆ అద్భుతాన్ని సాధించామని చెబుతున్నారు. కొలంబియా వర్సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన యువర్‌ ఛాయిస్‌ థెరప్యూటిక్స్‌ శాస్త్రజ్ఞులతో కలిసి వారు సంయుక్తంగా ఈ పరిశోధనలు జరిపి ‘వైసీటీ-529’ అనే ‘హార్మోన్‌ రహిత గర్భనిరోధక మాత్ర’ను అభివృద్ధి చేశామని.. ఎలుకలపై, సైనోమోల్గస్‌ జాతి కోతులపై చేసిన పరిశోధనల్లో అది 99ు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలిందని వారు వెల్లడించారు. వీర్యకణాల తయారీకి అత్యంత కీలకమైన విటమిన్‌ ఏను వృషణాలకు అందకుండా నిరోధిస్తుందని.. దానివల్ల వీర్యం ఉత్పత్తి ఆగిపోతుందని శాస్త్రజ్ఞులు వివరించారు. అదే సమయంలో ఈ మాత్ర టెస్టోస్టిరాన్‌ స్థాయులపై మాత్రం ఎలాంటి ప్రభావమూ చూపదని మిన్నెసొటా వర్సిటీ కెమిస్ట్‌, ఫార్మసిస్ట్‌ జార్జ్‌ తెలిపారు. కోతులు, ఎలుకలపై వారు చేసిన ప్రయోగాలకు సంబంధించిన ఫలితాల నివేదిక ‘కమ్యూనికేషన్స్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. దాని ప్రకారం.. ఎలుకల్లో ఈ మందు నాలుగువారాల వినియోగం తర్వాత 99% సామర్థ్యంతో పనిచేయగా, కోతుల్లో రెండు వారాల వినియోగంతోనే వీర్యకణాల సంఖ్యను తగ్గించేసింది.


మందు ఆపిన ఆరువారాల్లో ఎలుకల్లో మళ్లీ వీర్య కణాల సంఖ్య మునుపటి స్థితికి చేరుకోగా.. కోతుల్లో మాత్రం అందుకు 10 నుంచి 15 వారాలు పట్టింది. ఈ మందు వాడకం వల్ల రెండింటిలోనూ అతి తక్కువ దుష్ప్రభావాలు మాత్రమే కనిపించాయి. దీంతో మనుషులపై తొలి దశ ప్రయోగాలు నిర్వహించామని.. ఈ ఔషధం మానవ వినియోగానికి సురక్షితమేనని తేలిందని జార్జ్‌ వివరించారు. రెండో దశ (సేఫ్టీ అండ్‌ ఎఫికసీ) ట్రయల్స్‌ను న్యూజీలాండ్‌లో నిర్వహిస్తున్నామన్నారు.

ఆ రెండు మార్గాలే..

పురుషులకు సంబంధించినంతవరకూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్భనిరోధక విధానాలు రెండే.. ఒకటి కండోమ్స్‌ వాడకం. రెండోది వ్యాసెక్టమీ (వీర్య వాహికలను కత్తిరించి ముడి వేసే/మూసేసే శస్త్రచికిత్స). స్త్రీలకు గర్భనిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నట్టు పురుషులకు లేకపోవడానికి కారణమేంటి? ఎంతో పురగతి సాధించిన వైద్య రంగం.. ఈ విషయంలో మాత్రం ఇంకా విజయం సాధించలేకపోవడానికి కారణమేంటి? అంటే.. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి.. మహిళల్లో అండాల విడుదల దాదాపు నెలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. దానికీ ఒక క్రమం ఉంటుంది. కానీ, పురుషుల్లో నిత్యం కోట్లాది వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుంటుంది. ఎప్పుడో నెలకు ఒకసారి జరిగే ప్రక్రియను నిరోధించడం సులువు. నిత్యం, నిరంతరం జరిగే ప్రక్రియను ఆపడం కష్టం. అలాగని అసాధ్యమేమీ కాదు. పురుషుల కోసం గత 60-70 ఏళ్లలో రకరకాల కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌, జెల్స్‌, ఇంజెక్షన్లను శాస్త్రజ్ఞులు తయారు చేశారు. కానీ, వాటిలోని హార్మోన్ల వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ప్రతిసారీ ట్రయల్స్‌ దశలోనే వాటి ప్రస్థానం ముగిసిపోతూ వస్తోంది.


హార్మోన్‌ రహిత మాత్రలపై కూడా కొన్ని పరిశోధనలు జరిగాయిగానీ అవేవీ ట్రయల్స్‌ దశ దాటి ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు అమెరికన్‌ శాస్త్రజ్ఞులు తయారుచేసినవి కూడా హార్మోన్‌ రహిత మాత్రలే. ఈ దశాబ్దం చివరికల్లా అవి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదెంతవరకూ నిజమవుతుందో చూడాలి!!

ఈ వార్తలు కూడా చదవండి..

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

For National News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 04:46 AM