Share News

ఎక్స్‌ సేవలకు తీవ్ర అంతరాయం

ABN , Publish Date - Mar 11 , 2025 | 05:23 AM

సామాజిక మధ్యమం ఎక్స్‌ సేవలు సోమవారం పలుమార్లు స్తంభించాయి. భారత్‌తో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో ఎక్స్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఎక్స్‌ సేవలకు తీవ్ర అంతరాయం

  • భారీ సైబర్‌ దాడి జరిగిందన్న మస్క్‌

  • ఏదైనా దేశం హస్తం ఉండొచ్చని వ్యాఖ్య

న్యూఢిల్లీ, మార్చి 10: సామాజిక మధ్యమం ఎక్స్‌ సేవలు సోమవారం పలుమార్లు స్తంభించాయి. భారత్‌తో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో ఎక్స్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ‘డౌన్‌ డిటెక్టర్‌’ నివేదిక ప్రకారం సోమవారం మూడు దఫాలుగా (ప్రతిసారి గంట చొప్పున) ఎక్స్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం 3గంటలకు తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొంది. ఆ తర్వాత రాత్రి 7.30 సమయంలో, రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా ఎక్స్‌ అందుబాటులోకి రాలేదంటూ వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల్లో 52% వెబ్‌సైట్‌కు సంబంధించినవి కాగా 41% యాప్‌కు చెందినవి. 8 శాతం సర్వర్‌ కనెక్షన్‌కు సంబంధించినవి.


ఎక్స్‌ భారీ సైబర్‌ దాడికి గురైందని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. దీని వెనక సమన్వయంతో పనిచేస్తున్న పెద్ద ముఠా కానీ ఏదైనా దేశం హస్తం కానీ ఉండొచ్చని ఎక్స్‌ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు. సైబర్‌ దాడి కారణంగా రోజంతా మూడు సార్లు (ప్రతిసారి దాదాపు గంట పాటు) అంతరాయాలు ఏర్పడ్డాయన్నారు. ‘ఎక్స్‌పై భారీ సైబర్‌ దాడి జరిగింది. ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రతిరోజూ సైబర్‌ దాడులను ఎదుర్కొంటున్నాం. కానీ ఈసారి చాలా పెద్ద ఎత్తున జరిగింది. సమన్వయంతో కూడిన ఓ పెద్ద ముఠా కానీ లేదా ఏదైనా దేశం కానీ దీని వెనక ఉండొచ్చు. వారిని గుర్తించే పనిలో ఉన్నాం..’ అని వెల్లడించారు.

Updated Date - Mar 11 , 2025 | 05:24 AM