Share News

Donald Trump: విదేశీ వాహనాలపై అమెరికా 25% సుంకం

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:20 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో తయారు చేసి అమెరికాలో దిగుమతి అయ్యే వాహనాలపై 25శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు.

Donald Trump: విదేశీ వాహనాలపై అమెరికా 25% సుంకం

  • డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం

  • ఏప్రిల్‌ నుంచి అమల్లోకి

  • ఇద్దరికీ భారమన్న యూరప్‌

  • సుంకాల అంశంలో భారత్‌కు ఊరట!

  • అమెరికాతో చర్చలు సానుకూలం

  • కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, మార్చి 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో తయారు చేసి అమెరికాలో దిగుమతి అయ్యే వాహనాలపై 25శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్‌3వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని, ఈ చర్య శాశ్వతంగా ఉంటుందని బుధవారం వైట్‌హౌ్‌సలో వెల్లడించారు. ఈ నిర్ణయం దేశీయ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందని వైట్‌హౌస్‌ పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వాహనాల ఎగుమతిదారులపై ఆర్థికంగా ప్రతికూలంకానుంది. విదేశీ వాహనాలపై 25శాతం సుంకం విధించడం వల్ల ఏటా 100బిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుందని వైట్‌హౌస్‌ అంచనా వేస్తోంది. కాగా వాహనాల ధరలు భారీగా పెరగనుండటంతో అమ్మకాలు తగ్గే అవకాశముందని వాణిజ్యవర్గాలు భావిస్తున్నాయి. సుంకాలు పెంచడం వల్ల అమెరికాలో మరిన్ని వాహనాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తారని ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా ట్రంప్‌ నిర్ణయంపై ఐరోపా దేశాల ఆటో పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్‌ నిర్ణయం యూర్‌పతో పాటు అమెరికాలోని వినియోగదారులు, కంపెనీలకు భారమవుతుందని ఆటో పరిశ్రమ పేర్కొంది. ప్రతిపాదిత అమెరికా సుంకాల నుంచి భారత్‌కు ఉపశమనం లభిస్తుందని.. చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై తరహాలో భారం ఉండదని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సజావుగా జరుగుతున్నాయని వెల్లడించాయి. అమెరికా ప్రతీకార సుంకాలు విధించేందుకు గడువు ఏప్రిల్‌ 2వ తేదీలోపు ప్రతిష్ఠంభన ఏర్పడే సంకేతాలులేవని తెలిపాయి. కొత్త ఒప్పందంలో అధిక డిమాండ్‌ ఉన్న భారత్‌ ఎగుమతులపై సుంకాలపెంపు పరిమితంగా ఉండే అవకాశముంది. వచ్చే మూడు రోజుల్లో కొత్త ఒప్పందం విధివిధానాల ఖరారుకు సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. భారత్‌ నుంచి మరిన్ని రాయితీల కోసం అమెరికా అధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. భారత్‌తో ఉన్న ప్రత్యేక వాణిజ్య సంబంధాల నేపథ్యంలో చైనా, మెక్సికో, కెనడా దేశాలపై తరహాలో సుంకాలు వేయకపోవచ్చని, ఇది భారత ఎగుమతిదారులకు ఊరట కలిగిస్తుందని ఆశిస్తున్నారు. అమెరికా ఎగుమతులపై సుంకాలను భారత్‌ కూడా సమీక్షిస్తోంది. కొన్ని వస్తువులపై సుంకాలు తొలగించడం, మరికొన్నింటిపై మార్పులు చేయడం వంటి ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నాయి.

Updated Date - Mar 28 , 2025 | 05:25 AM