Kodali Nani Health: కొడాలి నాని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం
ABN , Publish Date - Apr 01 , 2025 | 03:50 AM
వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్‌కు తరలించారు

మూడు రక్త నాళాలు బ్లాక్
సర్జరీ కూడా చేయలేని పరిస్థితి
హైదరాబాద్ ఏఐజీ నుంచి డిశ్చార్జి
ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలింపు
హైదరాబాద్ సిటీ/మచిలీపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను కుటుంబ సభ్యులు సోమవారం హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలించారు. కొడాలి నాని గ్యాస్ట్రిక్ (జీర్ణకోశ) సమస్యతో ఐదు రోజుల క్రితం ఏఐజీలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా... గుండెకు సంబంధించి తీవ్రమైన సమస్య ఉన్నట్లు బయటపడింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు రక్త నాళాలు చాలా వరకు బ్లాక్ అయ్యాయని వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా ఇలాం టి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ నిర్వహిస్తారు. అయితే... సర్జరీ చేసేందుకు కొడాలి ఆరోగ్య పరిస్థితి సహకరించదని, చేసినా మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమా దముందని వైద్యులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మందుల ద్వారా పరిస్థితి మెరుగుపరిచే అవకాశాలను పరిశీలించారు. కానీ... ఫలితం కనిపించలేదు.
దీంతో... కొడాలి నానిని సోమవారం ఏఐజీ హైదరాబాద్ నుంచి డిశ్చార్జి చేశారు. కుటుంబం ఆయనను మెరుగైన చికిత్స కోసం బేగంపేట విమానాశ్రయం నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలించారు. సుప్రసిద్ధ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా చైర్మన్‌గా ఉన్న ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో కొడాలి నానిని చేర్పించినట్లు తెలిసింది. అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా చేయగలరని డాక్టర్ పాండాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. 2009లో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్‌కు కూడా ఆయనే శస్త్ర చికిత్స చేశారు.
Read Latest AP News And Telugu News