Share News

Donald Trump: అదానీకి ట్రంప్‌ అండ!

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:33 AM

ముడుపుల ఆరోపణలతో అమెరికాలో నమోదైన కేసులతో స్వదేశంలో, విదేశాల్లో తీవ్ర ఇరకాటంలో పడిన అదానీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ ఊరట కలిగించారు. వ్యాపారాల కోసం అమెరికా, ఇతర దేశాల వ్యాపార సంస్థలు లంచాల ఎరచూపకుండా అడ్డుకునే విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్‌సీపీఏ-1977) అమలును నిలిపివేశారు. విదేశాల్లో వ్యాపారాలు నిలబెట్టుకునేందుకు సదరు విదేశాల అధికారులకు ముడుపులు ఇచ్చిన అమెరికన్‌ సంస్థల ప్రాసిక్యూషన్‌ను స్తంభింపజేస్తూ సోమవారం కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేశారు.

Donald Trump: అదానీకి  ట్రంప్‌ అండ!

అమెరికాలో అదానీపై నమోదైన కేసులు

బలహీనపడేలా నిర్ణయం

విదేశీ అవినీతి కార్యకలాపాల

చట్టం అమలు నిలిపివేత

మోదీ పర్యటనకు ముందు నిర్ణయం

ఆంధ్ర, ఒడిశా సహా 5 రాష్ట్రాల అధికార్లకు

భారీ లంచాలిచ్చినట్లు అదానీపై ఆరోపణ

ఎఫ్‌సీపీఏ చట్టం కిందే గతంలో కేసులు

ట్రంప్‌ నిర్ణయంతో షేర్‌ మార్కెట్లలో

పుంజుకున్న అదానీ సంస్థల షేర్లు

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 11: ముడుపుల ఆరోపణలతో అమెరికాలో నమోదైన కేసులతో స్వదేశంలో, విదేశాల్లో తీవ్ర ఇరకాటంలో పడిన అదానీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ ఊరట కలిగించారు. వ్యాపారాల కోసం అమెరికా, ఇతర దేశాల వ్యాపార సంస్థలు లంచాల ఎరచూపకుండా అడ్డుకునే విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్‌సీపీఏ-1977) అమలును నిలిపివేశారు. విదేశాల్లో వ్యాపారాలు నిలబెట్టుకునేందుకు సదరు విదేశాల అధికారులకు ముడుపులు ఇచ్చిన అమెరికన్‌ సంస్థల ప్రాసిక్యూషన్‌ను స్తంభింపజేస్తూ సోమవారం కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేశారు. సదరు చట్టం కింద గతంలో, ప్రస్తుతం తీసుకున్న చర్యలను సమీక్షించాలని.. చట్టం అమలుకు కొత్త మార్గదర్శకాలు తీసుకురావాలని కొత్త అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీని ఆదేశించారు. ఈ ఆదేశాలతో స్టాక్‌మార్కెట్లలో అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పవర్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ తదితర సంస్థల షేర్ల ధరలు మంగళవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. ప్రధాని మోదీ బుధవారం అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ట్రంప్‌ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

సౌర విద్యుత్‌ కాంట్రాక్టుల కోసం ఆంధ్ర, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, జమ్మూకశ్మీరు అధికారులకు అదానీ గ్రీన్‌ సంస్థ రూ.2,100 కోట్లు ముడుపులుగా ఇచ్చిందని.. లంచాల వ్యతిరేక చట్టాలకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చి.. ఈ ప్రాజెక్టుల కోసం అమెరికాలో అదానీ గ్రూపు రుణసేకరణ చేసిందని.. ఇది వంచనేనంటూ గౌతమ్‌ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్‌ అదానీ, మరో ఏడుగురు అదానీ గ్రీన్‌ అధికారులపై గత ఏడాది జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా న్యాయశాఖ గత ఏడాది నవంబరులో అభియోగాలు నమోదు చేయడం.. ఇవన్నీ నిరాధార ఆరోపణలని అదానీ గ్రూపు ఖండించడం.. అదానీపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)తో విచారణ జరపాలంటూ భారత పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేయడం తెలిసిందే. 2021 రెండో అర్థభాగంలో ఈ ముడుపుల భాగోతం చోటుచేసుకుందని నాడు అమెరికా న్యాయశాఖ పేర్కొంది. అప్పట్లో ఏపీలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, ఒడిశాలో బిజూ జనతాదళ్‌, తమిళనాట డీఎంకే, ఛత్తీ్‌సగఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నాయి. జమ్మూకశ్మీరు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలనలో అంటే.. బీజేపీ పాలనలో ఉన్నట్లు లెక్క. ఎఫ్‌సీపీఏ కింద ప్రాసిక్యూషన్‌ను ఆపేస్తూ ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయం పరిధిని బట్టి అదానీ కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

jhkl.jpg


హిండెన్‌బర్గ్‌ ఆరోపణల సంగతేంటి..?

తన గ్రూపు షేర్ల ధరను పెంచుకోవడానికి అదానీ స్టాక్‌మార్కెట్లలో అవకతవకలకు, కార్పొరేట్‌ మోసాలకు పాల్పడ్డారని అమెరికాకు చెందిన ‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌’ సంస్థ 2022లో చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. అదానీ గ్రూపు షేర్ల ధరలు దారుణంగా పతనమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) దర్యాప్తు కూడా చేసింది (ఇటీవలే హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించారు). జేపీసీతో విచారణ జరిపించాలని నాటి నుంచి విపక్షాలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నా.. మోదీ ప్రభుత్వం అంగీకరించలేదు. ఆ తర్వాత ముడుపుల అభియోగాలపై అదానీలపై అమెరికాలో అభియోగాలు నమోదైన తర్వాత కూడా విచారణకు సమ్మతించలేదు. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై ఎఫ్‌సీపీఏ కింద దర్యాప్తు చేయాలని అమెరికన్‌ అధికారులు గనుక భావిస్తూ ఉంటే.. ఇప్పుడు ట్రంప్‌ నిర్ణయంతో అదానీలపై చట్టపరమైన చర్యలు ఆలస్యం కావచ్చని.. లేదంటే కేసు బలహీనపడే అవకాశమూ ఉందంటున్నారు. అటు భారతీయ ఏజెన్సీలు సెబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా ఈ అంశంలో ముందడుగు వేయరాదని అనుకుంటే.. న్యాయపరమైన సమస్యల నుంచి గౌతమ్‌ అదానీ బయటపడినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అంత మాత్రాన ఆయన అంతర్జాతీయ స్ర్కూటినీ నుంచి తప్పించుకోలేరని. బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌, ఇతర ప్రపంచ మార్కెట్లు ఆయన గ్రూపుపై నిఘా మానవని వ్యాఖ్యానిస్తున్నారు.


ఎఫ్‌సీపీఏ అంటే..

అమెరికాలో లిస్టయిన కంపెనీలు, అధికారులు, వ్యక్తులు, విదేశీ సంస్థలు.. బిజినెస్‌ ఒప్పందాల కోసం విదేశీ అధికారులకు లంచాలు ఎరచూపడాన్ని నిషేధిస్తూ 1977లో అమెరికా ఎఫ్‌సీపీఏ చట్టం తీసుకొచ్చింది. దీనిప్రకారం.. మోసాలను నివారించేందుకు కచ్చితమైన ఆర్థిక రికార్డులను చూపించడం కూడా వ్యాపార సంస్థలకు తప్పనిసరి. ఈ చట్టం కింద భారీ స్థాయి కార్పొరేట్‌ మోసాలపై అమెరికన్‌ ఏజెన్సీలు ప్రాసిక్యూట్‌ చేశాయి కూడా. అయితే ఈ చట్టాన్ని అతిగా అమలు చేయడం వల్ల అమెరికన్‌ కంపెనీలకు నష్టం వాటిల్లిందని ట్రంప్‌ గట్టిగా భావిస్తున్నారు.

అదానీపై చర్యలొద్దు: అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు

గౌతమ్‌ అదానీపై అమెరికా న్యాయశాఖ మోపిన అభియోగాలపై పునరాలోచన చేయాలని ఆరుగురు అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీని అభ్యర్థించారు. ఆయన్ను ప్రాసిక్యూట్‌ చేస్తే అమెరికా-భారత్‌ సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇండియాతో పటిష్ఠ ద్వైపాక్షిక సంబంధాల కొనసాగింపు ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు. బైడెన్‌ హయాంలో న్యాయశాఖ అదానీపై చేపట్టిన చర్యలను ప్రశ్నించారు. ‘దశాబ్దాలుగా భారత్‌ మనకు ముఖ్యమైన మిత్రదేశం. రాజకీయాలు, వాణిజ్యం, ఎకానమీకి మించి.. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల నడుమ సామాజిక-సాంస్కృతిక బంధంగా రూపాంతరం చెందింది. ఈ చారిత్రక భాగస్వామ్యం, మిత్రుల మధ్య నిరంతర సంప్రదింపుల ప్రక్రియ.. బైడెన్‌ యంత్రాంగం తీసుకున్న కొన్ని తెలివితక్కువ నిర్ణయాల వల్ల ప్రమాదంలో పడింది’ అని వారు పేర్కొన్నారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 04:33 AM

News Hub