US Elections System Overhaul: అమెరికా ఎన్నికల వ్యవస్థకు ట్రంప్ కీలక మార్పు.. ఒటర్లకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:12 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ ఎన్నికల వ్యవస్థకు సమూల మార్పులు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల వ్యవస్థను కూడా ట్రంప్ ప్రస్తావించారు.

ఇంటర్నెట్ డెస్క్: సంచలనాలకు కేరాఫ్‌గా మారిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ ఎన్నికల వ్యవస్థకు సమూల మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల వ్యవస్థను కూడా తన ఆదేశాల్లో పేర్కొనడం కొనసమెరుపు. విదేశీ నిధులు, ఓటర్‌ల గుర్తింపు ధ్రువీకరణ, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాల్లో సమూల మార్పులను ఆదేశించారు. తన ఆదేశాలు ఉల్లంఘించని రాష్ట్రాలకు ఫెడరల్ (కేంద్రం) నిధులు అందవని కూడా తేల్చి చెప్పారు. దీంతో, ఇది అగ్రరాజ్యంలో మరో సంచలనానికి తెరతీసింది.
ట్రంప్ మంగళవారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, అమెరికా ఎన్నికల్లో ఓటర్ల పేర్ల నమోదుకు ఇకపై పౌరసత్వ ధ్రువీకరణ అవసరం. అంతేకాకుండా, సాధారణ ఓట్లతో పాటు అన్ని రకాల బాలెట్లు ఎన్నికల రోజునే పోలింగ్ కేంద్రానికి చేరాల్సని ఉంటుంది. ఎన్నికలకు అవసరమైన కనీస ప్రాథమిక రక్షణల అమలులో అమెరికా విఫలమైందని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను ప్రకటించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సంస్థలతో కలిసి పనిచేయాలని చెప్పారు. ఎన్నికల సంబంధిత నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు దిగాలని అన్నారు. ఈ ఆదేశాలు పాటించని రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో కోతలు ఉంటాయని కూడా హెచ్చరించారు.
Also Read: ట్రంప్‌ను గెలిపించుకున్నాక భార్య అరెస్టు! యువకుడికి షాక్
‘‘స్వీయ పాలనలో ముందువరుసలో ఉన్న అమెరికా.. ప్రస్తుతం ఎన్నికల్లో ప్రాథమిక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో విఫలమవుతోంది. ఇండియా, బ్రెజిల్ లాంటి అభివద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఓటర్ గుర్తింపును, బయోమెట్రిక్ డాటాబేస్‌తో అనుసంధానానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అమెరికా మాత్రం ఇప్పటికీ ఓటర్ల పౌరసత్వానికి సంబంధించి స్వీయ ధ్రువీకరణ పత్రాలపైనే ఆధారపడుతోంది’’ అని ట్రంప్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా ఆదేశాల ప్రకారం, ఎన్నికల్లో ఓటర్ రిజిస్ట్రేషన్‌కు పాస్‌పోర్టు లాంటి పౌరసత్వ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కానుంది. పోలింగ్ రోజు తరువాత వచ్చే పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించొద్దని కూడా రాష్ట్రాలను ట్రంప్ ఆదేశించారు. ఏ రోజు పోస్టల్ బ్యాలెట్‌ను పంపించారన్న దానితో నిమిత్తం లేకుండా ఈ నిబంధన అమలు చేయాలని స్పష్టం చేశారు.
Also Read: సోషల్ ఖాతాల వివరాలివ్వండి.. డొనాల్డ్ ట్రంప్
‘‘ఎన్నికలు నిజాయితీతో, ప్రజావిశ్వాసం చూరగొనేలా జరగాలి. ఎన్నికల్లో అవకతవకలకు తావు లేకుండా ఓటర్లు తమ ఓటును చెక్ చేసుకునేందుకు వీలుగా డాక్యుమెంట్లు ఉండాలి. ఈ మేరకు ఎన్నికల సమగ్రత నియమావళికి మార్పులు చేయాలి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పలు అవకతవకలు జరిగాయని ట్రంప్ మొదటి నుంచీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, ట్రంప్ ఆదేశాలు న్యాయసమీక్షకు నిలువలేవని అక్కడి నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అమెరికాలో రాష్ట్రాలకున్న విస్తృతాధికారాలే ఇందుకు కారణమని అంటున్నారు. సమాఖ్య వ్యవస్థ కలిగిన అమెరికాలో రాష్ట్రాలకు పలు అంశాల్లో కేంద్రంతో సరిసమానమైన అధికారులు ఉంటాయి.
Read Latest and International News