Trump Voter's Wife Arrested: ట్రంప్‌ను గెలిపించుకున్నాక అమెరికా యువకుడి భార్య అరెస్టు! ఇప్పుడతడి పరిస్థితి ఏంటంటే..
ABN , Publish Date - Mar 24 , 2025 | 04:21 PM
ట్రంప్‌కు ఓటేసి గెలిపించుకున్న అమెరికన్‌కు భారీ షాక్ తగిలింది. వీసా గడువు ముగిసినందుకు అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో, అతడు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయాడు. అయినా, ట్రంప్‌కు ఓటేసినందుకు తనకు విచారం ఏమీ లేదని స్పష్టం చేశాడు.

ఇంటర్నెట్ డెస్క్: వలసలపై ఉక్కుపాదం మోపుతానంటూ అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రచారాన్ని హోరెత్తించిన ట్రంప్ చివరకు అధికారంలోకి వచ్చాక విదేశీయులను భారీ స్థాయిలో సొంత దేశాలకు పంపిస్తున్నారు. అయితే.. ట్రంప్ బహిష్కరణలు చూసి మురిసిసోయిన ఓ అమెరికన్‌కు భారీ షాక్ తగిలింది. వలసల శాఖ అధికారులు చివరకు అతడి భార్యను కూడా అరెస్టు చేయడంతో అతడు ఒకింత షాక్ తిన్నాడు. అయినా, ట్రంప్‌కు ఓటేసినందుకు తనకు ఎటువంటి విచారం లేదని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.
బ్రాడ్లీ బార్టెల్ ట్రంప్‌కు మద్దతుదారు. అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తాడన్న ఆశతో ట్రంప్‌కు ఇటీవలి ఎన్నికల్లో ఓటేసి గెలిపించుకున్నాడు. అయితే, బ్రాడ్లీ భార్య పేరు దేశస్థురాలు. 2019లో ఆమె వర్క్ స్టడీ వీసాపై అమెరికాకు వచ్చింది. ఆ తరువాత కరోనా సంక్షోభం రావడంతో వివిధ దేశాల మధ్య రాకపోకలన్నీ నిలిచిపోయాయి.
Also Read: కొడుకు గొంతు కోసిన తల్లి అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్టు
ఈ నేపథ్యంలో ఆమెకు బ్రాడ్లీతో పరిచయం ఏర్పడింది. మొదట్లో బ్రాడ్లీ ఆమెను పలకరించి తన నెంబర్‌ను ఓ చిటీపై రాసి ఇచ్చాడు. కానీ ఆమె అతడిని లక్ష్య పెట్టలేదు. అతడిచ్చిన చీటీని కూడా పారేసింది. ఆ తరువాత ఇద్దరూ మరోసారి ఫేస్‌బుక్ ద్వారా కాంటాక్ట్‌లోకి వచ్చారు. అలా వారి పరిచయం మళ్లీ పెరిగి ప్రేమగా మారింది. చివరకు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, కరోనా ఆంక్షల కారణంగా హనీమూన్‌కు వెళ్లలేకపోయారు.
ఈ ఏడాది వారికి తీరిక చిక్కడంతో ఫిబ్రవరిలో హనీమూన్‌కు వెళ్లారు. అమెరికాకు వచ్చాక ఎయిర్‌పోర్టులో బ్రాడ్లీకి భారీ షాక్ తగిలింది. అధికారులు అతడి భార్య డాక్యుమెంట్లు చెక్ చేశారు. తాను అమెరికన్ కాదని, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నానని ఆమె చెప్పడంతో బ్రాడ్లీ కళ్లముందే ఆమె చేతికి బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ప్రపంచంలో బాగా పాప్యులర్ అయిన ఈ విండోస్ వాల్‌పేపర్ చరిత్ర గురించి తెలిస్తే..
కళ్లముందే భార్య అరెస్టు కావడంతో తనకు నరకం కనిపించిందని బ్రాడ్లీ అన్నాడు. ప్రస్తుతం డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న ఆమెను బయటకు తీసుకురావడం కష్టంగా మారిందని చెప్పాడు. ఓ లాయర్‌ను కూడా నియమించుకున్నట్టు వెల్లడించాడు. వ్యవస్థ మొత్తం చెత్తగా ఉందని, దీనికి ట్రంప్‌ను బాధ్యులను చేయలేమని కూడా అన్నాడు. వ్యవస్థను బాగుచేసే అవకాశమే ట్రంప్‌కు ఇంకా రాలేదని వత్తాసు పలికాడు. అయితే, ట్రంప్‌కు ఓటేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందంటూ అనేక మంది ఆన్‌లైన్‌లో విషంక్కారని వాపోయాడు. తనకు మాత్రం ట్రంప్‌కు ఓటేసినందుకు ఎటువంటి విచారం లేదని అన్నాడు.
Read Latest and International News